పిల్లలు తక్కువుంటే విలీనమే..!

4 Mar, 2023 04:54 IST|Sakshi

సంక్షేమ వసతిగృహాల్లో  సర్దుబాటు మంత్రం 

ఇరవై మంది కంటే తక్కువుంటే సమీప హాస్టల్‌లో విలీనం 

కేబినెట్‌ సబ్‌ కమిటీ సమావేశంలో సమీక్షించిన మంత్రులు 

ఈ దిశగా ప్రతిపాదనల తయారీకి సంక్షేమ శాఖలకు ఆదేశం 

డైట్‌ చార్జీల పెంపుతో సంక్షేమ హాస్టళ్ల పటిష్టతకు చర్యలు 

సాక్షి, హైదరాబాద్‌: సంక్షేమ వసతి గృహాలను మరింత సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా మెస్‌ చార్జీల పెంపునకు సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం... విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా వసతిగృహాలను క్రమబద్దీకరించే అంశాన్ని పరిశీలిస్తోంది. హాస్టళ్ల వారీగా విద్యార్థుల సంఖ్యను సమీక్షించడంతో పాటు సమీపంలో ఉన్న హాస్టళ్లలో సర్దుబాటు చేసే అవకాశాలపై నివేదిక తయారు చేయాల ని సంక్షేమ శాఖలను ఆదేశించింది.

రెండ్రోజుల క్రితం సంక్షేమ వసతిగృహాలు, గురుకుల వి ద్యా సంస్థలతో పాటు రెసిడెన్షియల్‌ పద్ధతిలో కొనసాగుతున్న విద్యా సంస్థల్లో డైట్‌ చార్జీల పెంపుపై కేబినెట్‌ సబ్‌ కమిటీ సమావేశం జరిగింది. రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రు లు సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్‌ పా ల్గొన్నారు. డైట్‌ చార్జీలను 25 శాతం పెంచాలని ప్రభుత్వానికి సూచిస్తూ కేబినెట్‌ సబ్‌ కమిటీ ప్రతిపాదనలు పంపింది. ఇదే క్రమంలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న హాస్టళ్లను సమీపంలోని హాస్టళ్లలో విలీనం చేసి మెరుగైన వసతులు కల్పించే అంశంపైనా చర్చించారు. 

కనీసం 50 మంది విద్యార్థులుంటే.. 
సగటున ఒక సంక్షేమ హాస్టల్‌లో కనీసం 50 మంది విద్యార్థులుండాలి. దాదాపు వంద మందికి వసతులు కల్పిస్తూ హాస్టల్‌ను అందుబాటులోకి తెచ్ఛినప్పటికీ... అందులో కనీసం సగం మంది పిల్లలుంటేనే మెరుగైన సర్విసులు కల్పించవచ్చు. అలాకాకుండా 15 నుంచి 25 మంది విద్యార్థులుంటే ఖజానాపైనా భారం అధికంగా ఉంటుంది. ఈ క్రమంలో పిల్లల సంఖ్య తక్కువగా ఉన్న హాస్టళ్లను గుర్తించాలని, అదేవిధంగా వాటిని సమీప హాస్టళ్లలో విలీనం చేసే అంశాలపై పూర్తిస్థాయి నివేదికను జిల్లాల వారీగా రూపొందించాలని మంత్రులు ఆదేశించారు.

ఏప్రిల్‌ నెలాఖరు కల్లా జిల్లాల వారీగా నివేదికలు తయారు చేసి రాష్ట్ర కార్యాలయాలకు పంపించాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1,550 సంక్షేమ వసతిగృహాలున్నాయి. పోస్టుమెట్రిక్‌ హాస్టళ్లలో విద్యార్థుల సంఖ్య సంతృప్తికరంగా ఉన్నప్పటికీ చాలాచోట్ల ప్రీమెట్రిక్‌ హాస్టళ్లలో మాత్రం విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉంది. దీంతో కొన్ని జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రభుత్వ అనుమతితో ప్రీమెట్రిక్‌ హాస్టళ్లను పోస్టుమెట్రిక్‌ హాస్టళ్లుగా మార్పు చేశారు.

ఇంకా విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న వాటిని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే అంశంపై జిల్లా స్థాయిలో ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వానికి సమర్పించాలని మంత్రులు సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. 

మరిన్ని వార్తలు