కరోనా వ్యాక్సిన్‌: కోటి డోసులు కావాలి

20 May, 2021 05:49 IST|Sakshi

 వ్యాక్సిన్‌ కోసం రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్‌ టెండర్‌ 

రేపు టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ వెబ్‌సైట్లో అప్‌లోడ్‌ 

టెండర్ల దాఖలుకు చివరి తేదీ జూన్‌ 4 

అదే రోజు తెరవనున్న సాంకేతిక బిడ్స్‌

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ సంస్థల నుంచి కరోనా వ్యాక్సిన్‌ డోసులు సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్‌ టెండర్లను ఆహ్వానించింది. కోటి డోసుల కోసం స్వల్ప కాలిక టెండర్‌ను పిలిచింది. తెలంగాణ వైద్య సేవలు, మౌలిక వసతుల కల్పన సంస్థ (టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) జారీ చేసిన ఈ టెండర్‌లో రాబోయే 6 నెలల కాలంలో ఈ డోసులు పంపిణీ చేయాలని స్పష్టం చేసింది. ప్రతినెలా కనీసం 15 లక్షల డోసులు సరఫరా చేసే సామర్థ్యం టెండర్‌ వేసే సంస్థకు ఉండాలని పేర్కొంది.

ఈనెల 21వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు టెండర్‌ను తమ సంస్థ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేస్తామని తెలిపింది. అదే రోజు  సాయంత్రం ఆరున్నర గంటల నుంచి టెండర్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని వెల్లడించింది. వచ్చేనెల 4వ తేదీ టెండర్ల దాఖలుకు చివరి తేదీగా నిర్ణయించింది. ఆ రోజు సాయంత్రం ఆరు గంటల వరకు టెండర్లు దాఖలు చేయొచ్చని, అదే రోజు సాయంత్రం ఆరున్నర గంటలకు సాంకేతిక బిడ్స్‌ తెరవనున్నట్లు పేర్కొంది. ఈ వ్యాక్సిన్‌కు సంబంధించి ప్రీబిడ్‌ మీటింగ్‌ను ఈనెల 26వ తేదీన జూమ్‌ మీటింగ్‌ ద్వారా నిర్వహించనున్నట్లు టెండర్‌ షెడ్యూల్‌లో పేర్కొంది.  

రాష్ట్రంలో మొత్తం 18–44 మధ్య వయసు వారందరికీ టీకాలు ఇవ్వాలంటే.. కనీసం మూడున్నర కోట్ల డోసులు అవసరం ఉంటుంది. అయితే కేంద్రం 45 సంవత్సరాలకు పైబడిన వారికి మాత్రమే టీకా డోసులు ఇస్తోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు దాదాపు 56 లక్షల వరకు వ్యాక్సిన్‌ డోసులు వేయగా.. అందులో మొదటి డోసు తీసుకున్న వారు 42 లక్షల మంది.. రెండో డోసు తీసుకున్న వారు 12 లక్షల మంది ఉన్నారు. రాష్ట్రంలో వ్యాక్సిన్‌ డోసులు లేకపోవడంతో గత శనివారం నుంచి వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ప్రభుత్వం నిలిపేసింది.

రాష్ట్రంలో 1.86 లక్షల డోసులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని వైద్య శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలో, కరోనా కట్టడిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్వహించిన సమీక్షలోనూ వ్యాక్సిన్‌ కోసం గ్లోబల్‌ టెండర్లు పిలవాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ టెండర్లు పిలిచింది. 

మరిన్ని వార్తలు