కొత్త మెడికల్‌ కాలేజీల్లో 200 పోస్టులు

18 Oct, 2021 05:13 IST|Sakshi

నోటిఫికేషన్‌ జారీ.. 28 వరకు దరఖాస్తులు

31వ తేదీన తుది జాబితా ప్రకటన 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కొత్తగా నెలకొల్పనున్న ఎనిమిది ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో పనిచేయడానికి 200 వైద్యుల పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసింది. వనపర్తి, నాగర్‌కర్నూలు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జగిత్యాల, సంగారెడ్డి, మంచిర్యాల, రామగుండం మెడికల్‌ కాలేజీల్లో తాత్కాలిక ప్రాతిపదికన ఏడాది కాలానికి నియమిస్తారు.

ఆసక్తి కలిగిన అభ్యర్థులు ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని వైద్య విద్య సంచాలకుడు (డీఎంఈ) డాక్టర్‌ రమేశ్‌రెడ్డి కోరారు. అభ్యర్థులు నిర్దేశిత రూపంలో తమ దరఖాస్తులను ఈ నెల 28లోగా ఆన్‌లైన్లో సమర్పించాలని కోరారు. అర్హత కలిగిన అభ్యర్థుల తుది జాబితాను 31వ తేదీన ప్రకటిస్తారు. 

వచ్చేనెల 7లోగా విధుల్లోకి చేరాలి 
ఎంపికైన అభ్యర్థులు నిర్దేశిత కాలేజీల్లో వచ్చే నెల ఏడో తేదీలోగా చేరాల్సి ఉంటుంది. ప్రొఫెసర్లకు నెలకు రూ.1.90 లక్షలు, అసోసియేట్‌ ప్రొఫెసర్లకు నెలకు రూ. 1.50 లక్షలు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు నెలకు రూ. 1.25 లక్షలు వేతనంగా చెల్లిస్తామని రమేశ్‌రెడ్డి తెలిపారు.

అనాటమీ, ఫిజియోలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, పెథాలజీ, మైక్రోబయోలజీ, ఫొరెన్సిక్‌ మెడిసిన్, కమ్యూనిటీ మెడిసిన్, జనరల్‌ మెడిసిన్, డెర్మటాలజీ, సైకియాట్రీ, ఆర్థోపెడిక్స్, అనెస్థిసియోలజీ, రేడియోడయాగ్నసిస్, ఎమర్జెన్సీ మెడిసిన్లలో ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టులను భర్తీ చేస్తామని ఆయన తెలిపారు.  

మరిన్ని వార్తలు