330 చదరపు అడుగులు!

11 Apr, 2022 02:46 IST|Sakshi

సొంత జాగాలో ఇల్లు కట్టుకునేవారికి ఆర్థిక సాయం పథకానికి నిబంధనలు?

ఇళ్లకు కనిష్ట, గరిష్ట విస్తీర్ణం పరిమితులు విధించాలని ఆలోచిస్తున్న సర్కారు

ప్రధానమంత్రి ఆవాస్‌యోజన నిబంధనలతో సరిపోలేలా ఏర్పాట్లు

తేడా వస్తే కేంద్ర నిధులు ఆగిపోతాయని టెన్షన్‌

సాక్షి, హైదరాబాద్‌: పేదలకు సొంత గూడు కల్పిం చేందుకు ప్రారంభించిన 2 పడక గదుల గృహాల పథకంలో మార్పులు జరగబోతున్నాయి. పథకం కొనసాగిస్తూనే.. సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకు నే లబ్ధిదారులకు డబ్బు సాయం అందిస్తామని ఇటీ వల బడ్జెట్‌లో ప్రకటించిన పథకానికి కొన్ని నిబంధనలు విధించాలని రాష్ట్ర సర్కారు ఆలోచిస్తోంది. సొంత స్థలంలో చేపట్టే ఇళ్ల కనిష్ట, గరిష్ట విస్తీర్ణం ఎంతుండాలో నిబంధనలు రూపొందించనున్నట్టు తెలుస్తోంది. కనీస విస్తీర్ణం 330 చదరపు అడుగుల కంటే తక్కువ ఉండకుండా చూడాలని ఇప్పటికే సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు సమాచారం. గరిష్ట విస్తీర్ణం పరిధిని ఇంకా నిర్ధారించాల్సి ఉంది. 

బడ్జెట్‌లో ఇళ్లకు రూ. 12 వేల కోట్లు
ఇటీవలి బడ్జెట్‌లో ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం రూ.12 వేల కోట్లను ప్రతిపాదించింది. ఇందులో సొంత స్థలంలో లబ్ధిదారులే నిర్మించుకునే ఇళ్లకు రూ.7,350 కోట్లను, ఇంతకాలం కొనసాగుతున్న  రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణానికి రూ.4,650 కోట్లను ప్రతిపాదించింది. సొంత జాగాలో నిర్మాణానికి నియోజకవర్గానికి 3 వేలు చొప్పున ఇళ్లను కేటాయించింది. మరో 43 వేల ఇళ్లను సీఎం విచక్షణాధికారం పరిధిలో ఉంచింది.

ఒక్కో ఇంటికి రూ. 3 లక్షలను ప్రభుత్వం సాయంగా అందిస్తుంది. కాగా, ఈ ఆర్థిక సంవత్సరంలో ప్రధానమంత్రి ఆవాస్‌యోజన (పీఎంఏవై)  పథకం కింద కేంద్రం నుంచి 4 లక్షల ఇళ్లు మంజూరవుతాయిని ప్రభుత్వం ఆశిస్తోంది. ఇందులో పట్టణ ప్రాంతాల ఇంటి యూనిట్‌ ధర రూ.2 లక్షలుండగా గ్రామీణ ప్రాంతాల్లో రూ.72 వేలుగా ఉంది. ఆ నిధులకు సొంత నిధులు కలిపి రాష్ట్ర ప్రభుత్వం సాయం అందిస్తుంది.

కేంద్రం పథకం విధి విధానాల్లో ఇంటి నిర్మాణ పరిధి 330 చదరపు అడుగులకు తగ్గకూడదన్న నిబంధన ఉంది. ఇదే నిబంధనను ‘సొంత స్థలంలో ఇళ్లకు’ విధించాలని రాష్ట్ర సర్కారు ఆలోచిస్తోంది. తేడా వస్తే కేంద్రం నిధులు ఆగిపోతాయని భావిస్తోంది. ఇక లబ్ధిదారులెవరైనా సొంత నిధులు కలిపి పెద్దగా ఇంటిని నిర్మాణం చేపట్టి మధ్యలో నిధులు సరిపోక చేతులెత్తేస్తే కేంద్ర నిధులకు ఇబ్బంది వస్తుంది. అలాంటి ఇళ్లను పరిగణనలోకి తీసుకోకుండా అంతమేర నిధుల్లో కేంద్రం కోత పెడుతుంది. దీంతో ఖర్చు మరీ ఎక్కువయ్యేలా పెద్దగా ఇళ్ల నిర్మాణం చేపట్టకుండా గరిష్ట పరిధిని కూడా నిర్ధారించే విషయాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. 

జనానికి భారమే
కనిష్ట పరిమితిపై నిబంధన విధిస్తే లబ్ధిదారుల జేబుపై భారం పడబోతోంది. కనీసం 330 చదరపు అడుగుల విస్తీర్ణం ఉండాలంటే ప్రస్తుత లెక్కల ప్రకారం ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.4.50 లక్షలు ఖర్చవుతుంది. కానీ ప్రభుత్వం ఇచ్చేది రూ.3 లక్షలే. అంటే దాదాపు రూ. లక్షన్నర మేర లబ్ధిదారులే సొంతంగా ఖర్చు చేయాల్సి రానుంది.

కొంతమంది ప్రస్తుతమున్న ఇంటికి కొనసాగింపుగా పక్కనే ఉండే ఖాళీ స్థలంలో ఒకట్రెండు గదులు నిర్మించుకుంటుంటారు. ఈ కొత్త నిర్మాణాన్ని ప్రభుత్వ పథకం కింద చూపుతారు. అలాంటి అనుబంధ నిర్మాణాలు 330 చదరపు అడుగుల కన్నా తక్కువ విస్తీర్ణంలో ఉంటే కొత్త నిబంధన అమలులోకి వస్తే వాటికి అనుమతి రాదు.  

మరిన్ని వార్తలు