తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం.. వ్యవసాయానికి 7 గంటలే! 

15 Apr, 2022 04:13 IST|Sakshi

రాష్ట్రంలో విద్యుత్‌ సరఫరా వేళల కుదింపు 

సంక్షోభం నేపథ్యంలో సర్కారు నిర్ణయం  

ఓ వైపు భారీగా పెరిగిన డిమాండ్‌ 

ఎక్స్చేంజీల్లో చుక్కలను తాకుతున్న యూనిట్‌ రేటు 

కోత పెట్టకతప్పడం లేదంటున్న అధికారులు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ సరఫరాను ఏడు గంటలకు కుదించింది. గ్రామీణ ప్రాంతాల్లో రోజులో 7గంటలు మాత్రమే త్రీఫేజ్‌ విద్యు త్‌ సరఫరా జరుగుతోంది. ముఖ్యంగా రోజూ రాత్రి 12 నుంచి ఉదయం 8 గంటల వరకు కేవలం సింగిల్‌ ఫేజ్‌ విద్యుత్‌ సరఫరా చేయాలని తాజాగా ఉత్తర తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎన్పీడీసీఎల్‌) క్షేత్రస్థాయి అధికారులకు రాతపూర్వకంగా ఆదేశాలు ఇచ్చింది.

జిల్లాల వారీగా 7 గంటల త్రీఫేజ్‌ విద్యుత్‌ సరఫరా షెడ్యూల్‌ను కచ్చితంగా పాటించాలని ఆదేశించింది. సాధారణంగా సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య త్రీఫేజ్‌ విద్యుత్‌ సరఫరాకు కోత పెడుతుంటారు. కానీ ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా రాత్రివేళల్లో త్రీఫేజ్‌ విద్యుత్‌కు కోతలు విధిస్తుండటం గమనార్హం. 

1,500 మెగావాట్ల వరకు కొరత 
రాష్ట్రంలో నెలరోజులుగా 1,000 నుంచి 1,500 మెగావాట్ల వరకు విద్యుత్‌ కొరత ఉంటోంది. గత నెలలో గరిష్ట విద్యుత్‌ డిమాండ్‌ ఎన్నడూ లేనట్టుగా 14,200 మెగావాట్లకు చేరి రికార్డు సృష్టించింది. యాసంగి పంటలు కోతకు రావడంతో రోజువారీ డిమాండ్‌ 12,500 మెగావాట్లకు తగ్గింది. ఇంకా కొరత నెలకొనడంతో.. మూడురోజులుగా వ్యవసాయ విద్యుత్‌ సరఫరాను 7 గంటలకు కుదించినట్టు అధికారులు వెల్లడించారు. అయితే కోతలు తాత్కాలికమేనని, వారం, పదిరోజుల్లో విద్యుత్‌ డిమాండ్‌ తగ్గి పరిస్థితి చక్కబడుతుందని తెలిపారు. 

కొందామన్నా దొరక్క.. 
ఎండలు తీవ్రం కావడంతో గత నెల చివరివారం నుంచి దేశవ్యాప్తంగా విద్యుత్‌ డిమాండ్‌ భారీగా పెరిగిపోయింది. దీనికితోడు ఉక్రెయిన్‌–రష్యా యుద్ధం వల్ల  అమ్మోనియం నైట్రేట్‌ (పేలుడు పదార్థం) కొరత ఏర్పడి బొగ్గు ఉత్పత్తి తగ్గింది. బొగ్గు కొరతతో ఓవైపు అకస్మాత్తుగా ధరలు పెరగడం, మరోవైపు విద్యుత్‌ ఉత్పత్తి తగ్గిపోవడంతో మరింత ప్రభావం పడింది. విద్యుత్‌ కొరతను తీర్చుకోవడానికి రాష్ట్రాలు పవర్‌ ఎక్సే్ఛంజీని ఆశ్రయించడంతో.. ధరలు యూనిట్‌కు రూ.20 వరకు పెరిగాయి.

ఈ క్రమంలో సెంట్రల్‌ ఎలక్ట్రిసిటీ అథారిటీ (సీఈఏ) రంగంలో దిగి యూనిట్‌ రేటు రూ.12కు మించకుండా నియంత్రణ విధించింది. పవర్‌ ఎక్సే్ఛంజీ నుంచి గతనెలలో రాష్ట్రం రూ.1,800 కోట్ల విద్యుత్‌ కొనుగోలు చేసింది. ప్రస్తుతం రోజుకు రూ.30కోట్ల నుం చి రూ.40కోట్ల మేర విద్యుత్‌ కొంటోంది. అదికూడా 1,000 మెగావాట్ల విద్యుత్‌ కొనేందుకు బిడ్‌ వేస్తే.. 100 నుంచి 150 మెగావాట్ల విద్యుత్‌ మాత్రమే లభిస్తోందని అధికారు లు చెప్తున్నారు. అందువల్ల కోతలు విధించడం తప్పడం లేదని స్పష్టం చేస్తున్నారు.

ఆలస్యంగా వేసిన పంటలకు కటకట 
యాసంగిలో బోర్లు, బావుల కింద ఆలస్యంగా వేసిన పంటలు ఇంకా చేతికి అందలేదు. వ్యవసాయ విద్యుత్‌ సరఫరాను అకస్మాత్తుగా 7 గంటలకు తగ్గించిన నేపథ్యంలో సదరు రైతులు ఆందోళనలో పడ్డారు. ఆ పంటలకు నెలాఖరు వరకు విద్యుత్‌ అవసరమని అంటున్నారు.

మరోవైపు యాసంగి పంటలన్నీ దాదాపు కోతకు వచ్చాయని, ప్రస్తుతమున్న పంటల్లో చాలావరకు కూరగాయలు, ఇతర మెట్ట పంటలు మాత్రమేనని అధికారులు అంటున్నారు. అందుకే వ్యవసాయ విద్యుత్‌ను 7గంటలకు కుదిస్తూ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంటున్నారు. ఈ కోతల అంశంపై ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు, ఎస్పీడీసీఎల్‌ సీఎండీ రఘుమారెడ్డిని వివరణ కోరేందుకు ప్రయత్నించినా.. వారు స్పందించలేదు.  

మరిన్ని వార్తలు