Telangana: గ్రూప్‌–4కు కొత్త సర్వీస్‌ రూల్స్‌!

24 Jun, 2022 00:23 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్‌–4 కొలువులకు కొత్తగా సర్వీసు నిబంధనలను రూపొందిస్తోంది. రాష్ట్రంలో నూతన జోనల్‌ విధానం అమల్లోకి రావడంతో అందుకు అనుగుణంగా ప్రస్తుతమున్న సర్వీసు రూల్స్‌లో మార్పులు చేయనుంది. ఇదివరకు 80:20 నిష్పత్తిలో స్థానిక, జనరల్‌ కేటగిరీల్లో ఉద్యోగాలు భర్తీ చేయగా ఇప్పుడు 95:5 నిష్పత్తిలో చేపట్టనుంది. ఈ క్రమంలో సర్వీసు నిబంధనలు కూడా స్థానిక అభ్యర్థులకు అధిక లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వం మార్పులు చేస్తోంది. భవిష్యత్తులో ఉద్యోగులు పదోన్నతులు, ఇతర ప్రయోజనాలు పొందేందుకు కొత్త నిబంధనలు ఆధారం కానున్నాయి.

ఒకే దఫా నియామకాలతో...
రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 9 వేలకు పైబడిన గ్రూప్‌–4 ఉద్యోగాలను టీఎస్‌పీఎస్సీ ద్వారా ఒకే దఫాలో భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రూప్‌–4 కేటగిరీలో అత్యధికం జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులే ఉన్నాయి. పలు ప్రభుత్వ శాఖలకు సంబంధించి ఒకేసారి నియామకాలు చేపడుతుండటంతో ఉమ్మడి అంశాలకు తగినట్లుగా సర్వీసు నిబంధనలు ఉండే అవకాశం ఉంది.

ప్రస్తుతం నియామకాల సమయంలో సాధారణ నిబంధనలు అన్ని శాఖలకు ఒకే విధంగా ఉండనుండగా శాఖలవారీగా నియామకాలు పూర్తయి ఉద్యోగులు విధుల్లో చేరాక ఆయా శాఖలకు సంబంధించిన నిబంధనలు కూడా వర్తిస్తాయి. ఈ నేపథ్యంలో కామన్‌ సర్వీస్‌ రూల్స్‌పై దృష్టిపెట్టిన ప్రభుత్వం... అన్ని ప్రభుత్వ శాఖల నుంచి నిబంధనల వివరాలను సేకరిస్తోంది.

సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ మరికొన్ని శాఖల ఉన్నతాధికారులతో రెండ్రోజులుగా సమీక్షిస్తున్నారు. శాఖాధిపతుల నుంచి సమాచారం సేకరించినప్పటికీ లిఖితపూర్వక ఆధారాలను స్వీకరించాక ప్రత్యేక సమావేశం నిర్వహించాలని సీఎస్‌ తాజాగా నిర్ణయించినట్లు తెలిసింది. దీంతో అన్ని శాఖల నుంచి ప్రతిపాదనలు 4–5 రోజుల్లో ప్రభుత్వానికి అందనున్నాయి. అవి అందిన వెంటనే సమీక్షించి గ్రూప్‌–4 నూతన సర్వీసు రూల్స్‌ను ఖరారు చేసే అవకాశాలున్నాయి.

గజిబిజికి తెర పడేలా...
ఉమ్మడి రాష్ట్రంలో అమలు చేసిన సర్వీసు రూల్స్‌లో ఉన్న లొసుగులతో స్థానికులకు తీవ్ర అన్యాయమే జరిగింది. ఉద్యోగ నియామకాల సమయంలో కోటా ప్రకారం నియమితులైనప్పటికీ పదోన్నతుల్లో స్థానిక ఉద్యోగులు వెనుకబడిపోయారు. పదోన్నతుల ఖాళీలను మెరిట్‌ ప్రకారం భర్తీ చేసినప్పటికీ జనరల్‌ కేటగిరీలోని ఖాళీలను ఇష్టానుసారంగా ప్రమోట్‌ చేయడంతో స్థానిక కోటా ఉద్యోగులు నష్టపోయారు.

ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం నూతన జోనల్‌ విధానంలో స్థానికతకు ప్రాధాన్యత ఇచ్చింది. దీంతో 95 శాతం ఉద్యోగాలు స్థానికులతోనే భర్తీ కానున్నాయి. అలాగే ఓపెన్‌ కేటగిరీలోని 5 శాతం పోస్టుల్లోనూ స్థానికులకు వాటా దక్కనుంది. దీంతో మెజారిటీగా స్థానికులే ఉంటారు. ఫలితంగా ఉద్యోగుల పదోన్నతులు, ఇతర ప్రయోజనాల కల్పనలో స్థానికులకే ఎక్కువ లబ్ధి కలగనుంది.

తాజాగా రూపొందుతున్న కొత్త సర్వీసు రూల్స్‌తో ఉమ్మడి రాష్ట్రంలో ఏర్పడిన గజిబిజికి ఇక తెరపడినట్లే. మరోవైపు సర్వీసు రూల్స్‌ ఖరారయ్యాక గ్రూప్‌–4 ఉద్యోగ ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిన వెంటనే ప్రభుత్వం జీవోలు విడుదల చేయడం నుండి నియామక ఏజెన్సీకి స్పష్టమైన ఆదేశాలతో బాధ్యతలు సైతం అప్పగించనుంది.  

మరిన్ని వార్తలు