అగ్రిడేటా.. ఆవిష్కరణల బాట

17 Jun, 2022 01:18 IST|Sakshi

దేశంలోనే తొలిసారిగా అగ్రిడేటా మేనేజ్‌మెంట్‌ పాలసీ

వివిధ ప్రభుత్వ విభాగాల ద్వారా ఒకేచోట సమాచారం లభ్యత

ఆరోగ్యం, రవాణా, స్మార్ట్‌సిటీ రంగాల్లోనూ ఈ తరహా పాలసీలు

మరో పదిరోజుల్లో ఎమర్జింగ్‌ టెక్నాలజీ వింగ్‌ ద్వారా విడుదల

సాక్షి, హైదరాబాద్‌: వ్యవసాయ రంగంలో సాంకేతిక ఆవిష్కర ణలను ప్రోత్సహిం చేందుకు దేశంలోనే తొలి సారిగా ‘అగ్రికల్చర్‌ డేటా మేనేజ్‌మెంట్‌’ పాలసీని రూపొందిం చడంపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్ర ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ విభాగానికి అనుబంధంగా ఉండే ఎమర్జింగ్‌ టెక్నాలజీ వింగ్‌ ‘విధి ఇండియా’, వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం భాగస్వామ్యంతో ఈ పాలసీ విధివిధానాలను రూపొందిస్తోంది.

కొత్త పాలసీకి సంబంధించి ముసాయిదాను వివిధ ప్రభుత్వ విభాగాలు, సంబంధిత రంగాల నిపుణుల సలహాలు, సూచనల కోసం విడుదల చేశారు. ముసాయిదాకు తుదిరూపు ఇచ్చి మరో పదిరోజుల్లో విడుదల చేసేందుకు ఎమర్జింగ్‌ టెక్నాలజీ వింగ్‌ సన్నాహాలు చేస్తోంది. వ్యవసాయ రంగంలో ఎదురయ్యే సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు కనుగొనడంలో వివిధ ప్రభుత్వ విభాగాల సమాచారం అత్యంత కీలకం.

అయితే ఈ సమాచారం వివిధ ప్రభుత్వ విభాగాల నుంచి సేకరించాల్సిరావడం, సమా చారం ఇవ్వడంలో పారదర్శక విధానాలు లేకపోవడం అగ్రిటెక్‌ రంగానికి అవరోధంగా మారింది. ఈ నేపథ్యంలో వ్యవసాయ రంగంలో సాంకేతిక ఆవిష్కరణలు  ప్రోత్సహించేందుకు ప్రభుత్వ విభాగాలు డేటాను పంచు కోవడం లో బాధ్యతతో వ్యవహరించేందుకు ‘అగ్రి కల్చర్‌ డేటా మేనేజ్‌మెంట్‌ పాలసీ’ ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

వ్యవ సాయం, భూ పరిపాలన, నీటిపారుదల, ప్రణాళిక విభాగాలతోపాటు జయ శంకర్‌ యూనివర్సిటీ, తెలంగాణ రిమోట్‌ సెన్సింగ్‌ అప్లికేషన్స్‌ సెంటర్‌ (ట్రాక్‌) వంటి విభాగాల సమాచారం ఒకే చోట లభించేలా ఈ పాలసీ విధి విధానాలు ఉంటాయి.

అగ్రిటెక్‌ ఆవిష్కరణలకు అవకాశాలు ఎన్నో!
వ్యవసాయంలో పంటల ప్రణాళిక, వాటి రక్షణ, నీటిపారుదల, పోషకాల యాజ మాన్యం, యాంత్రీకరణ, సాగు విధానాలు, పంట నూర్పిళ్లు, పంటలబీమా, పంట రుణాలు, మార్కెటింగ్‌ వంటి ఎన్నో అంశాల్లో సాంకేతిక ఆవిష్కరణలకు అవకాశాలు ఉన్నాయి. రాష్ట్రంలో వ్యవసాయ సాంకేతికతను ప్రోత్సహించేందుకు రీసెర్చ్‌ ఇన్నోవేషన్‌ సర్కిల్‌ ఆఫ్‌ హైదరాబాద్‌(రిచ్‌) ఇటీవల నిర్వహించిన అగ్రి టెక్‌ సదస్సులో 83కుపైగా స్టార్టప్‌లు పాల్గొనగా, 90కి పైగా ఎమర్జింగ్‌ టెక్నాలజీ ఆధారిత పరిష్కారా లను సూచించాయి.

ఇప్పటికే కృత్రిమ మేథస్సు(ఏఐ) టెక్నాలజీ ఆధారంగా పంటల ప్రణాళిక, సాగు విధానాలు, మార్కెటింగ్‌ల్లో 30కి పైగా అగ్రిటెక్‌ ఆవిష్కరణలు రాష్ట్రంలో పురుడు పోసుకున్నాయి. సమా చారం వినియోగించే వారికి ఎదురయ్యే సమస్యలను పరిష్కరిం చేందుకు ఓ ప్రత్యేక యంత్రాంగం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నేపథ్యంలో వివిధ ప్రభుత్వ విభాగాల భాగస్వామ్యంతో రైతులు, భూముల వివరాలు, వాతావరణం, భూసారం, చీడపీడలు తదితర అన్ని అంశాలకు సంబంధించిన సమాచారాన్ని అందుబాటులోకి తెచ్చేలా ‘అగ్రికల్చర్‌ డేటా మేనేజ్‌మెంట్‌ పాలసీ’ఉంటుందని ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ ‘సాక్షి’కి వెల్లడించారు. ఇదిలా ఉంటే ‘అగ్రిటెక్‌ డేటా మేనేజ్‌మెంట్‌ తరహాలో ఆరోగ్యం, రవాణా, స్మార్ట్‌సిటీ రంగాల్లోనూ డేటా మేనేజ్‌మెంట్‌ అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. 

మరిన్ని వార్తలు