వీధి కుక్కలన్నింటికీ ‘స్టెరిలైజేషన్‌’ 

24 Feb, 2023 02:27 IST|Sakshi

పట్టణాల్లో వాటి బెడద నివారణకు సర్కారు యాక్షన్‌ ప్లాన్‌ 

కుక్కలను పట్టుకునే బృందాలు, వాహనాల సంఖ్య పెంపు... ఈ విషయంలో వచ్చే ఫిర్యాదులపై 

తప్పనిసరిగా స్పందించేలా చర్యలు 

వీధి కుక్కల విషయంలో జాగ్రత్తలపై విద్యార్థులకు అవగాహన... జీహెచ్‌ఎంసీ సహా 142 పురపాలికల్లో అమలుకు ఆదేశాలు 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా నగరాలు, పట్టణాల్లో వీధికుక్కల నియంత్రణ కోసం పకడ్బందీ కార్యాచరణ చేపట్టాలని పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. హైదరాబాద్‌లోని అంబర్‌పేట్‌లో వీధి కుక్కల దాడిలో చిన్నారి ప్రాణం కోల్పోయిన ఘటన కలకలం రేపడం, దీనితోపాటు రాష్ట్రవ్యాప్తంగా కుక్కకాటు ఘటనలు జరుగుతుండటంతో ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్‌ బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఆయన ఆదేశాల మేరకు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ రాష్ట్రవ్యాప్తంగా 129 మున్సిపాలిటీలు, జీహెచ్‌ఎంసీ సహా 13 కార్పొరేషన్లలో చేపట్టాల్సిన చర్యలపై యాక్షన్‌ ప్లాన్‌ను రూపొందించింది. ఈ కార్యాచరణకు తగినట్టుగా చర్యలు చేపట్టాలని రాష్ట్రంలోని అన్ని పురపాలికల కమిషనర్లను ప్రభుత్వం ఆదేశించింది. 

మార్గదర్శకాలు ఇవీ.. 
► అన్ని పట్టణాలు, నగరాల్లో 100 శాతం వీధి కుక్కలకు సంతాన నియంత్రణ ఆపరేషన్లు (స్టెరిలైజేషన్‌) చేయాలి. 
► వీధికుక్కలకు సంబంధించిన ఫిర్యాదులకు అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా స్పందించాలి. 
► కుక్కలను పట్టుకునే బృందాలను, వాహనాల సంఖ్యను పెంచాలి. 
► వీధికుక్కలు అధికంగా ఉన్న ప్రాంతాలు, కుక్కకాటు ఘటనలు అధికంగా జరిగే ప్రాంతాలను గుర్తించి స్థానిక కాలనీలు, బస్తీ సంఘాల సహకారంతో చర్యలు చేపట్టాలి. 
► మాంసాహార దుకాణాలు, ఫంక్షన్‌హాల్స్, హాస్టళ్లు ఉన్న చోట మాంసపు వ్యర్థాలను, మిగిలిన ఆహారాన్ని వీధికుక్కలు తిరిగే చోట్ల పడేయకుండా చర్యలు చేపట్టాలి. 
► వీధికుక్కల నియంత్రణకు స్వయం సహాయక బృందాలు, పారిశుధ్య సిబ్బంది, మెప్మా సిబ్బంది సేవలను వినియోగించుకోవాలి. 
► వీధికుక్కల విషయంలో ఎలా ప్రవర్తించాలనే దానిపై విద్యార్థులకు అవగాహన కల్పించాలి. దీనిపై ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో కరపత్రాలను పంపిణీ చేయాలి. 
► అన్ని పట్టణాలు, నగరాల్లో ప్రజలను చైతన్యపరచాలి. 
► వేసవి కాలంలో వీధికుక్కల ఆగడాలను తగ్గించేందుకు తగిన సంఖ్యలో నీటి తొట్లను ఏర్పాటు చేయాలి.   

మరిన్ని వార్తలు