అడ్డగోలు దందా కుదరదు 

10 Apr, 2022 03:07 IST|Sakshi

డ్రగ్స్‌తో పట్టుబడితే పీడీ యాక్ట్‌.. అవసరమైతే నగర బహిష్కరణ

పబ్‌లలో సీసీ కెమెరాలు ఎక్సైజ్‌ విభాగానికి అనుసంధానం

పబ్‌ యజమానుల సమావేశంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌

సనత్‌నగర్‌(హైదరాబాద్‌): ‘అడ్డగోలుగా పబ్‌లను నడిపిస్తామంటే హైదరాబాద్‌లో ఉండొద్దు.. వేరే రాష్ట్రమో, దేశమో వెళ్లిపోండి. ఇక్కడ ఉండి డ్రగ్స్‌ దందా చేస్తామంటే కుదరదు. డ్రగ్స్‌తో పట్టుబడితే పీడీ యాక్ట్‌ నమోదు చేయడమే కాకుండా అవసరమనుకుంటే నగర బహిష్కరణ చేస్తాం’అని ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తీవ్రంగా హెచ్చరించారు.

పబ్‌ల ద్వారా వచ్చే ఆదాయం ప్రభుత్వానికి ముఖ్యంకాదని, అవసరమైతే ఒక్క జీఓతో అన్నీ మూసివేయిస్తామని స్పష్టంచేశారు. చేతనైతే నిబంధనల మేరకు నడిపించాలని, అక్రమ పద్ధతిలో చేయాలను కుంటే బంద్‌ చేసుకోవాలని చెప్పారు. శనివారం హైదరాబాద్‌ పబ్‌లు, బార్‌ అండ్‌ రెస్టారెంట్ల యజమానులతో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడారు. 

డ్రగ్స్‌రహిత రాష్ట్రంగా... 
తెలంగాణలో 40% ఏరియా జీహెచ్‌ఎంసీ పరిధిలోకి వస్తుందని, విదేశీయులు పెట్టుబడులు పెట్టాలంటే భద్రతాపరంగా హైదరా బాద్‌ ఏవిధంగా ఉంది, ఇక్కడ పాలసీలు ఎలా ఉన్నాయనే అంశాలను ప్రధానంగా తీసుకుంటారని శ్రీనివాస్‌గౌడ్‌ చెప్పారు. ఈ క్రమంలోనే డ్రగ్స్‌రహిత రాష్ట్రాన్ని నిర్మించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు డ్రగ్స్, గుడుంబా, గంజాయి వినియోగం, అ మ్మకాలపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు.

అయితే అక్కడక్కడ ర్యాడిసన్‌ పబ్‌ లాం టి చీడ పురుగులు డబ్బుకు కక్కుర్తిపడి రా ష్ట్రానికి చెడ్డ పేరు తెస్తున్నాయని చెప్పారు. ర్యాడిసన్‌ పబ్‌పై ఎవరో చెబితే తమ డిపార్ట్‌మెంట్‌ దాడి చేయలేదని, డ్రగ్స్‌ దందాను అరికట్టే క్రమంలో అధికారులే కస్టమర్ల మాదిరి వెళ్లి దాడులు చేశారని స్పష్టంచేశారు. డ్రగ్స్‌ దందా వెనుక ఎవరి ప్రమేయం ఉన్నా వదిలిపెట్టబోమని హెచ్చ రించారు. అయితే అక్కడ ఉన్నవారం తా దోషులుగా పేర్కొనడం సరికాదన్నారు.  

అన్ని కోణాల్లో సీసీ కెమెరాలు.. 
నగరంలో ఉన్న 65 పబ్‌ల్లో అన్ని కోణాల్లో సీసీ కెమెరాలు ఉండాలని, అలా లేని పబ్‌లను తాత్కాలికంగా మూసివేసి సీసీ కెమెరాలను అమర్చుకునేలా చర్యలు తీసుకోవాలని శ్రీనివాస్‌గౌడ్‌ అధికారులను ఆదేశించారు. ఆయా సీసీ కెమెరాలను ఎక్సైజ్ విభాగానికి అనుసంధానమయ్యేలా చూడాలన్నారు. తద్వారా పబ్‌ల్లో ఏమి జరుగుతుందో అధికారులు ఆన్‌లైన్‌లోనే పర్యవేక్షించే వీలుంటుందన్నారు.  

పబ్‌ లకు సంబంధించి ఎలాంటి లోపాలు ఉన్నా సంబంధిత సీఐ, ఏఈఎస్, ఈఎస్‌లను బాధ్యులను చేస్తామన్నారు. సమావేశంలో ఎక్సైజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ కమిషనర్‌ సర్ఫరాజ్, అదనపు కమిషనర్‌ అజయ్‌రావు, జాయింట్‌ కమిషనర్‌ ఖురేషీ, రం గారెడ్డి జిల్లా డీసీ డేవిడ్‌రాజు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు