హైదరాబాద్‌లో దేశంలోనే తొలి స్పెషల్‌ కేర్‌ క్లినిక్‌

13 Jul, 2021 02:43 IST|Sakshi

అలసట, బలహీనతతో బాధపడుతున్న 40% మంది కరోనా బాధితులు

పోస్ట్‌ కోవిడ్‌ సమస్యలపై ఏఐజీ ఆస్పత్రి ఆధ్వర్యంలో సర్వే: ఏఐజీ చైర్మన్‌ డా.నాగేశ్వర్‌రెడ్డి

దేశంలోనే తొలి స్పెషల్‌ కేర్‌ క్లినిక్‌

ఏఐజీ కోవిడ్‌ కేర్‌ క్లినిక్‌ ప్రారంభించిన సీఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు

సాక్షి, హైదరాబాద్‌: కోవిడ్‌ మహమ్మారి నుంచి కోలుకున్న 40 శాతానికి పైగా పేషెంట్లు బలహీనత, అలసట తదితర లక్షణాలతో బాధపడుతున్నట్లు వెల్లడైనట్లు ఏఐజీ ఆస్పత్రుల చైర్మన్‌ డా.డి.నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు. చాలామందిలో నిద్రలేమి, నాడీ, మానసిక సంబంధ సమస్యలు వెంటాడుతున్నట్లు పేర్కొన్నారు. 30 ఏళ్ల వయసు పైబడి కరోనా నుంచి కోలుకున్న వారికి అకస్మాత్తుగా గుండెపోటు, ఊపిరితిత్తులు, జీర్ణకోశ సమస్యలు, కీళ్లు, కండరాలు, ఇతర సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ఆస్పత్రుల్లో చేరిన వారిలో 34 శాతం మందికే ఆక్సిజన్, స్టెరాయిడ్స్‌ అందించాల్సి ఉండగా, 74 శాతం మందికి స్టెరాయిడ్స్‌ వినియోగించినట్లు తేలినట్లు పేర్కొన్నారు.

ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా మనదేశంలోనే మందుల దుకాణాల్లో ‘ఓవర్‌ ది కౌంటర్‌’ స్టెరాయిడ్స్‌ సులభంగా లభించడమే ఇందుకు కారణం కావొచ్చని చెప్పారు. ప్రస్తుతం ఎదురవుతున్న పోస్ట్‌ కోవిడ్‌ సమస్యలకు స్టెరాయిడ్స్‌ వినియోగం కారణంగా కనిపిస్తోందని, అందుకే దీనిపై లోతైన పరిశోధన జరపాల్సిన అవ సరం ఉందని వివరించారు.

ప్రస్తుతం దేశం థర్డ్‌వేవ్‌ ముంగిట ఉన్న నేపథ్యంలో ఏఐజీ ఆధ్వర్యంలో జీనోమ్‌ సీక్వెన్సింగ్, ఇతర అధ్యయనాలు చేస్తున్నట్లు తెలిపారు. దేశంలో 90 శాతం వరకు డెల్టా వైరస్‌ ప్రభావం చూపుతున్నట్లు అధ్యయనాల్లో స్పష్టమైనట్లు చెప్పారు. డెల్టా ప్లస్‌ లేదని తేలినట్లు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 5 వేల మందిపై ఆన్‌లైన్‌లో నిర్వహించిన సర్వేలో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయన్నారు. సోమవారం ఏఐజీ ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేసిన ‘పోస్ట్‌ కోవిడ్‌ కేర్‌ క్లినిక్‌’ను సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు ప్రారంభించారు. వర్చువల్‌గా మాట్లాడుతూ కోవిడ్‌ సమస్యలపై ప్రత్యేకంగా క్లినిక్‌ను ఏర్పాటు చేయడం దేశంలోనే ఇది తొలిసారని డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఈ క్లినిక్‌లో పలు విభాగాల స్పెషలిస్ట్‌ డాక్టర్లు అందుబాటులో ఉంటారని వివరించారు.

సర్కారు ఆస్పత్రుల్లోనూ పోస్ట్‌ కోవిడ్‌ కేర్‌: నర్సింగ్‌రావు
కోవిడ్‌ అనంతరం ఎదురయ్యే సమస్యలపై స్పష్టమైన అవగాహన వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ దీనికి అవసరమైన చికిత్స అం దించేలా చర్యలు చేపట్టాల్సి ఉంటుందని సీఎంవో ముఖ్యకార్యదర్శి నర్సింగ్‌రావు ఓ ప్రశ్నకు బదులిచ్చారు. పోస్ట్‌ కోవిడ్‌ చికిత్స కోసం ప్రత్యేక క్లినిక్‌ ఏర్పాటు అభినందనీయమని చెప్పారు. కరోనా నుంచి కోలుకున్నవారిలో స్వల్ప లక్షణాలున్న వారు నెలలో, మధ్యంతర సమస్యలున్న వారు నెల నుంచి 3 నెలల్లో, సుదీర్ఘకాలం పాటు సమస్యలున్న వారు కోలుకునేందుకు 6నెలలు పడుతున్నట్లు ఓ ప్రశ్నకు నాగేశ్వర్‌రెడ్డి సమాధానమిచ్చారు. శరీరంలో విటమిన్‌ డి, జింక్, ప్రో టీన్లు తగ్గిపోవడం వల్ల ఈ సమస్యలు వస్తున్నా యని పేర్కొన్నారు. కోవిడ్‌ వచ్చి తగ్గాక 3 నెలల తర్వాత వ్యాక్సిన్‌ తీసుకోవాలని కేంద్రం చెబుతున్నా.. తాను మాత్రం నెల తర్వాత ఒక డోస్‌ తీసుకుంటే పెద్దసంఖ్యలో యాంటీబాడీస్‌ ఏర్పడుతాయనే అభిప్రాయపడుతున్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు