నిమజ్జనాలకు అనుమతి లేదనడంతో హైదరాబాద్‌లో ఆగమాగం..

14 Sep, 2021 15:02 IST|Sakshi

హైకోర్టు నిర్ణయం తెలియక అయోమయం

దూరప్రాంతాల నుంచి చెరువుల వద్దకు విగ్రహాలు

 విగ్రహాలను అక్కడే వదిలి వెళ్తున్న దైన్యం

పోలీసులతో వాగ్వాదాలు, ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్‌ జామ్‌లు

నేడు ఐదోరోజు కావడంతో పెరగనున్న నిమజ్జన ఇబ్బందులు

ఓ వైపు చెరువుల్లో పీఓపీ విగ్రహాలను నిమజ్జనం చేయొద్దంటూ నిబంధనలు...మరోవైపు తెచ్చిన విగ్రహాన్ని ఎలాగైనా నిమజ్జనం చేయాలనే ఆరాటం మధ్య భక్తులు ఒత్తిడికి గురవుతున్నారు. పోలీసుల కంటపడకుండా నానా ఇబ్బందులు పడుతూ దొడ్డిదారిలో వెళ్లి విగ్రహాలను నిమజ్జనం చేస్తున్నారు. ఇందుకు నిదర్శనంగా సోమవారం ట్యాంక్‌బండ్‌పై ఇలా ప్రమాదపుటంచున నిమజ్జనం చేయడం కనిపించింది.  

సాక్షి, హైదరాబాద్‌: గణేశ్‌ నిమజ్జనాలకు సంబంధించి ప్రభుత్వ యంత్రాంగం నుంచి స్పష్టమైన సూచనలు లేకపోవడం..హైకోర్టు ఆదేశాల గురించి ప్రజలకు తెలియకపోవడంతో నగరంలోని పలు ప్రాంతాల్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. చెరువుల్లో ప్లాస్టర్‌ ఆఫ్‌ పారిస్‌ (పీఓపీ)తో చేసిన, కెమికల్స్‌తో కూడిన రంగుల విగ్రహాలను నిమజ్జనం చేయరాదనే హైకోర్టు ఆదేశాలు తెలియని ప్రజలు ప్రతి సంవత్సరం మాదిరిగానే తాము ఎప్పుడూ నిమజ్జనం చేసే ప్రాంతాలకు విగ్రహాలతో వెళ్తున్నారు. కానీ ఆయా విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు పోలీసులు అనుమతించడం లేదు. దీంతో ఆ విగ్రహాలను నీళ్లలో వేయలేక.. అక్కడే వదిలి వెళ్లలేక వారంతా అయోమయానికి గురవుతున్నారు. వందలాది మంది దూర ప్రాంతాల నుంచి వాహనాల్లో విగ్రహాలను తీసుకువచ్చి...తీరా నిమజ్జనానికి అనుమతి లేదని తెలిసి అవాక్కవుతున్నారు.  
చదవండి: హుస్సేన్‌సాగర్‌లో ‘నిమజ్జనం’పై సుప్రీంకు..

పోలీసులకు తలనొప్పులు 
సరూర్‌నగర్, ట్యాంక్‌ బండ్‌ తదితర ప్రాంతాల్లోని చెరువుల వద్దకు బ్యాండు మేళాలతో డ్యాన్సులు చేస్తూ వెళ్తున్న భక్త జనం విగ్రహాలను నిమజ్జనం చేయకుండా అక్కడే వదిలేస్తున్నారు. ఈ వ్యవహారం పోలీసులకు తలనొప్పిగా మారింది. సాధారణంగా నాలుగు రోజుల వరకు చిన్న విగ్రహాలు మాత్రమే నిమజ్జనం చేయడం, ఐదో రోజునుంచే మూడు నాలుగు అడుగులు, అంతకంటే ఎక్కువ ఎత్తు విగ్రహాలను నిమజ్జనం చేయడం తెలిసిందే. దీంతో ఐదోరోజైన మంగళవారం పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారే అవకాశాలున్నాయి. కొన్ని చెరువుల వద్ద మాత్రం ఎలాంటి ప్రతికూలత లేకపోవడంతో నిమజ్జనాలు చేసి వెళ్తున్నారు.  
చదవండి: హైదరాబాద్‌: వినాయక నిమజ్జనం ఎక్కడ?

అధికారుల మల్లగుల్లాలు 
విగ్రహాల నిమజ్జనాలకు సోమవారం హైకోర్టు నుంచి సానుకూల స్పందన వస్తుందని అధికారులు ఆశించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించేది లేదని హైకోర్టు స్పష్టం చేయడంతో వివిధ శాఖల అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించారు. కోర్టు అనుమతించిన బేబీ పాండ్స్‌ (ప్రత్యేక నిమజ్జన కొలను)లోనే నిమజ్జనాలకు పూర్తిస్థాయి ఏర్పాట్లు చేసే ప్రయత్నాల్లో మునిగారు. 

భారీ గణపతులు సైతం బేబీ పాండ్స్‌లోనే... 
► ఖైరతాబాద్, బాలాపూర్‌ వంటి పెద్ద వినాయక విగ్రహాలను సైతం బేబీ పాండ్స్‌లోనే నిమజ్జనం  చేసేందుకు యోచిస్తున్నట్లు సమాచారం. 
సంజీవయ్యపార్కు, నెక్లెస్‌రోడ్‌ వద్ద హుస్సేన్‌సా గర్‌ నీటిలోనే రెండు బేబీపాండ్స్‌ ఉన్నాయి. పెద్ద విగ్రహాలను కూడా వాటిల్లో నిమజ్జనం చేసేందుకు అధికారులు యోచిస్తున్నట్లు తెలిసింది.

► మరోవైపు హైకోర్టు ఆదేశాలపై సుప్రీంకోర్టుకు వెళ్లనున్నట్లు కూడా తెలుస్తోంది. ఏదేమైనా , తగిన  ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో జీహెచ్‌ఎంసీ, తదితర అధికారులు బిజీబిజీగా ఉన్నారు. ఏం చేస్తున్నారన్నది మాత్రం స్పష్టంగా వెల్లడించడం లేరు.

► బేబీపాండ్స్‌లోనే అన్నివిగ్రహాల నిమజ్జనం జరగాలంటే ఎక్కువ రోజులు పడుతుందని అంచనా వేస్తున్నారు. జాప్యం జరగకుండా ఉండేందుకు బేబీపాండ్స్‌ను పూర్తిగా నీటితో నింపి, వాటిల్లో విగ్రహాలను తడిచేలా ముంచి వెంటనే తొలగించే చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. తద్వారా వేగంగా జరగడంతోపాటు పెద్ద విగ్రహాలవి కూడా పూర్తిచేయాలని భావిస్తున్నారు.  

బేబీ పాండ్లు నిర్మించారిలా.. 
జీహెచ్‌ఎంసీ నిరి్మంచిన బేబీ పాండ్లు 26 అడుగుల పొడవు, 24 అడుగుల వెడల్పు, 12– 15 అడుగుల లోతు ఉన్నాయి. వీటిల్లో కొన్నింటికి పవర్‌ బోర్లతో నీరు నింపే సదుపాయం ఉంది. లేనివాటికి  ట్యాంకర్లతో నీటిని నిండుగా నింపే యోచనలో ఉన్నారు.  

దిగువ ప్రాంతాల్లోనే..   
అంబీర్‌చెరువు (కూకట్‌పల్లి), రంగధాముని చెరువు (కూకట్‌పల్లి), బోయిన్‌చెరువు (హస్మత్‌పేట్‌), ఊరచెరువు (కాప్రా), చెర్లపల్లిచెరువు, పెద్దచెరువు(గంగారం), వెన్నెల చెరువు(జీడిమెట్ల), మల్కచెరువు(రాయదుర్గం), నల్లగండ్ల చెరువు, పెద్దచెరువు(మన్సూరాబాద్‌),పెద్దచెరువు(నెక్నాంపూర్‌),లింగంచెరువు(సూరారం), ముండ్లకత్వ (మూసాపేట), నాగోల్‌ చెరువు, కొత్తచెరువు(అల్వాల్‌),నల్లచెరువు(ఉప్పల్‌), పత్తికుంట(రాజేంద్రనగర్‌), గురునాథ్‌చెరువు(మియాపూర్‌), గోపిచెరువు(లింగంపల్లి), రాయసముద్రం(ఆర్‌సీపురం), కైదమ్మ కుంట (హఫీజ్‌పేట), దుర్గంచెరువు, బండచెరువు (మల్కాజిగిరి), హుస్సేన్‌సాగర్‌లో రెండు పాండ్లు ఉన్నాయి.  

మరిన్ని వార్తలు