బీఆర్‌ఎస్, కాంగ్రెస్ రాళ్లదాడి.. నారాయణపేటలో ఉద్రిక్తత

14 Nov, 2023 21:32 IST|Sakshi

నారాయణపేట: నారాయణపేట జిల్లా కోస్గి మండలం సర్జఖాన్ పేట గ్రామంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య రాళ్లదాడి జరిగింది. ఐదుగురు టీఆర్ఎస్ నాయకులు, ఇద్దరు కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం బాధితులు కోస్గీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియోద్దీన్ నేతృత్వంలో బీఆర్‌ఎస్ శ్రేణులు గ్రామంలో ప్రచారం నిర్వహిస్తుండగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు అడ్డు తగిలారు. దీంతో ఇరు వర్గాల మధ్య గొడవ చోటు చేసుకుంది. మొదట వాగ్వాదానికి దిగిన కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్‌ఎస్ వాహనాలపై రాళ్లురువ్వడంతో ఘర్షణ ప్రారంభమైంది. రెండు వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. వెంటనే పోలీసులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి కాస్త సద్దుమణిగింది. అయితే దాడిపై పోలీసులు చర్య తీసుకోవాలంటూ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి నేతృత్వంలో భారీ సంఖ్యలో బీఆర్‌ఎస్ నాయకులు కార్యకర్తలు కోస్గి పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించి ధర్నా చేపట్టారు.

ఈ పరిణామాల అనంతరం శినాజీ చౌరస్తాలో ఇరువర్గాలు మళ్లీ ఆందోళనకు దిగాయి. ఒకరిపై ఒకరు రాళ్లదాడి చేసుకున్నారు. పరిస్థితి మళ్లీ ఉద్రిక్త వాతావరణం ఏర్పడటంతో పోలీసులు లాఠీ ఛార్జీ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈ ఘర్షణల్లో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇరువర్గాలు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. 

ఇదీ చదవండి: ప్రజల ఆస్తుల్ని గుంజుకోవడానికి కేసీఆర్ పోటీ.. కామారెడ్డిలో రేవంత్ రెడ్డి

మరిన్ని వార్తలు