Telangana Liberation Day History: తెలంగాణా చరిత్రను మరో మలుపు తిప్పిన సెప్టెంబర్‌ 17.. అసలేం జరిగింది?

16 Sep, 2022 18:44 IST|Sakshi

హైదరాబాద్‌ సంస్థానం భారతదేశంలో విలీనం అయ్యిందా లేక విమోచనం లభించిందా? నిజాం రాజు పాలన ఎలా అంతమయ్యింది? సాయుధ పోరాటం ఏమేరకు నిజాంను గద్దె దించగలిగింది? హైదరాబాద్‌పై పోలీస్ యాక్షన్ పేరుతో జరిగింది ఏంటి? నిజాంపై యుద్ధం చేయడంలో నెహ్రూ-పటేల్ పాత్ర ఏంటి? అసలు సెప్టెంబర్‌-17న ఏంజరిగింది? 

సెప్టెంబర్-17. తెలంగాణా చరిత్రను మరో మలుపు తిప్పిన రోజు. శతాబ్దాల బానిస సంకెళ్లను తుంచేసిన ఉద్విగ్న సందర్భం. భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏడాది అయినా ఇంకా స్వేచ్ఛ కోసం ఎదురుచూస్తున్న జాతి చేసిన పోరాటం ఫలించిన క్షణం. రాజరికం పరిసమాప్తమై ప్రజాస్వామ్యం పరిఢవిల్లిన అద్భుత పరిణామం. సెప్టెంబర్ 17 తెలంగాణా సమాజం నిజాం కబంద హస్తాల నుంచి విమోచన పొందిన రోజు. నా దేశం భారతదేశం అని గర్వంగా ప్రతీ తెలంగాణా పౌరుడు నినదించిన తారీఖు సెప్టెంబర్-17. అందుకే తెలంగాణా చరిత్రలో ఈ తేదీ సువర్ణాక్షర లిఖితం. 

సెప్టెంబర్‌ -17న హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం అయిందా లేక తెలంగాణా ప్రజలకు నిజాం కబంధ హస్తాల నుంచి విమోచనం లభించిందా అనే అంశంపై భిన్న వాదనలున్నాయి. దీనిపై వాదించేవారు ఎవరైనా తమకు అనుకూలమైన వాదనలనే తెరమీదికి తీసుకువస్తారు. 1948 సెప్టెంబర్-17న పోలీసు చర్యతో నిజాం భారత ప్రభుత్వానికి లొంగిపోయాడు. దీంతో తెలంగాణా ప్రాంతం భారతదేశంలో విలీనమైనపోయినట్లేనని చాలా మంది వాదన. అందుకే సెప్టెంబర్-17ను విలీన దినోత్సవంగా జరపాలంటారు.

అయితే సెప్టెంబర్‌-17న తెలంగాణా పూర్తిగా భారతదేశంలో విలీనం కాలేదనేది కూడా అంతే వాస్తవం. సాంకేతికంగా 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చేవరకు తెలంగాణా నిజాం పాలనలోనే ఉంది. అయితే పేరుకే నిజాం ప్రభువు అయినప్పటికీ ఇక్కడ పౌరప్రభుత్వం ఏర్పాటు నుంచి సైనిక శక్తి అంతా భారత ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లిపోయింది. దీంతో నిజాం దుష్టపాలన నుంచి ఖాసీం రజ్వీలాంటి రజాకార్ నాయకుల నుంచి తెలంగాణా ప్రజలు విముక్తి పొందారు. అందుకే సెప్టెంబర్-17ను విమోచన దినంగా పరిగణించాలని మరికొందరివాదన. 

సెప్టెంబర్‌-17న తెలంగాణా  విలీనం జరిగిందా లేక విమోచన జరిగిందా అనే చర్చ సుదీర్ఘ కాలంగా కొనసాగుతూనే ఉంది. అయితే 1948 సెప్టెంబర్‌-13 నుంచి 17వ తేదీ వరకు జరిగిన పోలీసు చర్య వల్లే తెలంగాణా నిజాం పాలన నుంచి విముక్తి పొందిందనేది అందరూ అంగీకరించే వాస్తవం. హైదరాబాద్‌ సంస్థానంను చుట్టుముట్టిన భారత సైన్యం హైదరాబాద్‌ నగరానికి చేరుకుని నిజాంను లొంగదీసుకున్న ఆపరేషన్ పోలో తెలంగాణా చరిత్ర గతిని మార్చేసింది. తెలంగాణా ప్రజలకు స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ప్రసాదించింది. ఇంతటి కీలక పరిణామాలకు కేంద్రబిందువైన ఆపరేషన్ పోలోకు ముందు చాలా తతంగమే నడిచింది. అయితే ఆపరేషన్ పోలో 5 రోజుల్లో ముగిసిపోయినా సైనిక చర్య తప్పదనే సంకేతాలు 13 నెలల ముందే అంటే.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజునే కనిపించాయి.

మరిన్ని వార్తలు