హైదరాబాద్‌: స్టేషన్‌ ఇక్కడ.. ఫైర్‌ఇంజిన్లు అక్కడ!

18 May, 2022 13:37 IST|Sakshi
నిర్మాణంలో ఉన్న హయత్‌నగర్‌ ఫైర్‌ స్టేషన్‌ భవనం

సాక్షి, హైదరాబాద్‌: అగ్ని ప్రమాదాలు, ఇతర విపత్తు సమయాల్లో ప్రజలను, వారి ఆస్తులను కాపాడేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫైర్‌స్టేషన్లు ఉన్నతాధికారుల అనాలోచిత నిర్ణయాల వల్ల సరైన సేవలు అందిచలేకపోతున్నాయి. ఫైర్‌స్టేషన్‌ను తమ పరిధికి దూరంగా తరలించడంతో ప్రమాద స్థలానికి అగ్నిమాపక సిబ్బంది సరైన సమయంలో చేరుకోలేకపోతున్నారు. దీంతో అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతున్నది.  

► హయత్‌నగర్‌ ఫైర్‌స్టేషన్‌ 20 ఏళ్ల క్రితం ఏర్పాటైంది. సొంత భవనం లేకపోవడంతో స్థానిక మండల పరిషత్‌ ఆవరణలో కొంత కాలం కొనసాగింది. అనంతరం విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ సమీపంలో ప్రభుత్వం స్థలం కేటాయించడంతో అక్కడ సొంత భవనం నిర్మించారు. భవనాన్ని లోతట్టు ప్రాంతంలో నిర్మించడంతో ప్రతి వర్షాకాలంలో ఫైర్‌ స్టేషన్‌ మునిగియి సిబ్బంది తీవ్రంగా ఇబ్బంది పడేవారు.  
చదవండి: ఫోన్‌లో బుకింగ్‌.. ర్యాపిడోపై డెలివరీ.. మూడోసారి దొరికిన మురుగేశన్‌

4 నెలల క్రితం భవన నిర్మాణం షురూ... 
అగ్నిమాపక సిబ్బంది పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు ఓ ప్రైవేట్‌ సంస్థ సహకారంతో నాలుగు నెలల క్రితం కొత్త భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.  ఫైర్‌ స్టేషన్‌ కూల్చి వేయడంతో సిబ్బందిని వాహనాలను ఇక్కడికి సుమారు 12 కిలోమీర్ల దూరంలో ఉన్న ఉప్పల్‌ స్టేషన్‌ (ఇంకా ప్రారంభం కాలేదు)కు తరలించారు.  

► అటు సరూర్‌నగర్‌ మండలం, ఇటు చౌటుప్పల్, సాగర్‌రోడ్డలో తుర్కయాంజాల్‌ వరకు హయత్‌నగర్‌ ఫైర్‌స్టేషన్‌ పరిధిలోకి వస్తాయి. ఆయా ప్రాంతాలలో జరిగే ప్రమాదాలను నివారించేందుకు ఇక్కడి సిబ్బంది వెళ్లాల్సి వస్తోంది.

► ప్రస్తుతం హయత్‌నగర్‌ ఫైర్‌ స్టేషన్‌ ఇక్కడి నుంచి తరలించడంతో ఆయా ప్రాంతాలలో జరిగే ప్రమాదాల నివారణకు సరైన సమయంలో వెళ్లలేక పోతున్నారు.  

► ఆటోనగర్‌లో ఇటీవల జరిగిన ప్రమాద స్థలానికి ఫైర్‌ సిబ్బంది ఆలస్యంగా వచ్చారనే ఆరోపణలు వినిపించాయి. స్టేషన్‌ పరిధికి సిబ్బంది దూరంగా ఉండటంతో ప్రమాదం జరిగిన తర్వాత బూడిదను ఆర్పడానికే సిబ్బంది వస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు.

అవకాశం ఉన్నా ఉపయోగించలేదు... 
ఫైర్‌ సిబ్బంది, వాహనాలు నిలిపేందుకు హయత్‌నగర్‌లో పలు చోట్ల అవకాశం ఉన్నా అధికారులు వాటిని ఉపయోగించుకోలేదని స్థానికులు ఆరోపి స్తున్నారు. మండల పరిషత్‌ ఆవరణ, పోలీస్టేషన్, రేడియో స్టేషన్, ప్రభుత్వ పాఠశాల, మదర్‌ డెయిరీతో పాటు పలు ప్రైవేట్‌ స్థలాల్లో సిబ్బంది ఉండేందుకు అవకాశం ఉంది. ఈ అవకాశాలను కాదని దూరంగా ఉన్న ఉప్పల్‌ స్టేషన్‌కు తరలించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

 ఎవరూ సహకరించలేదు 
ఫైర్‌ స్టేషన్‌ సిబ్బందికి, వాహనాలు నిలిపేందుకు అవసరమై వసతులు కల్పించాలని మండల పరిషత్‌ అధికారులతో పాటు ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులను కలిసి విజ్ఞప్తి చేశాం. ఎవరూ సహకరించలేదు. దీంతో సిబ్బందిని ఉప్పల్‌ స్టేషన్‌కు తరలించాల్సి వచ్చింది. నెల రోజుల్లో ఇక్కడ భవన నిర్మాణం పూర్తవుతుంది. వెంటనే సిబ్బందిని ఇక్కడికి తరలిస్తాం. 
-శీనయ్య, ఫైర్‌ స్టేషన్‌ అధికారి, హయత్‌నగర్‌       

మరిన్ని వార్తలు