మూలికా వైద్యం..కేరాఫ్‌ గంధసిరి

6 Mar, 2023 02:10 IST|Sakshi

సనాతన వైద్యంతో మొండి రోగాలు సైతం మాయం

దేశ, విదేశాల్లో  ప్రఖ్యాతి గాంచిన వైనం 

మొత్తం 364 వన మూలికలతో చికిత్స 

మాజీ ప్రధానులు, ప్రముఖుల నుంచి ప్రశంసలు 

సాధారణ ప్రజల మన్ననలూ  పొందుతున్నసహదేవరాజ్‌

అంతరించిపోతున్న సనాతన వనమూలికా వైద్యానికి ఓ గ్రామం నెలవుగా మారింది. మొండి రోగాలను సైతం ఈ వైద్యం మాయం చేస్తోంది. ఎన్నో ఏళ్లుగా దేశ, విదేశాలకు చెందిన ప్రముఖులను సైతం ఆకర్షిస్తూ వారి ప్రశంసలందుకుంటోంది. లక్షలాది మంది సాధారణ ప్రజల జబ్బులు సైతం తగ్గిస్తూ ఈ మూలికా వైద్యం అపర సంజీవనిగా నిలుస్తోంది. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలంలోని గంధసిరి గ్రామం ఇందుకు వేదికగా మారింది.

వనమూలికా వైద్యంలో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన, ఈ గ్రామానికి చెందిన పస్తం సహదేవరాజ్‌ తాను వైద్య సేవలందిస్తూనే, తన తెగకు చెందిన 150 మందికి ఇందులో శిక్షణ ఇచ్చారు. ఈ వైద్యం తనతోనే అంతరించి పోకుండా తన పిల్లలకు సైతం నేర్పించారు. 
– సాక్షి ప్రతినిధి, ఖమ్మం

తాతల కాలం నాటి విద్య.. 
శబరికోయ తెగకు చెందిన కొన్ని కుటుంబాలు ఏళ్ల క్రితం భద్రాచలం ప్రాంతం నుంచి గంధసిరి గ్రామానికి వలస వచ్చాయి. తమ తాతలు, తండ్రులు నేర్పిన మూలికా వైద్యాన్ని వంట బట్టించుకొని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైద్యం చేయడం ప్రారంభించాయి. ఈ కుటుంబాలకు చెందిన సహదేవరాజ్‌ 1979లో మొదలుపెట్టిన మూలికా వైద్యం దేశ విదేశాలకు విస్తరించింది.

దేశంలోని ఇతర ప్రాంతాలతో పాటు తొలిసారిగా 1996లో లండన్‌ వెళ్లారు. అక్కడ బ్రిటన్‌ రాణిని కూడా కలిశారు. ఈ క్రమంలోనే నేపాల్, స్విట్జర్లాండ్, ఆ్రస్టేలియా, మలేసియా, ఇండోనేసియా తదితర దేశాల్లోనూ వైద్య సేవలందించారు. మరోవైపు అమెరికా, కెనడా నుంచి కూడా పలువురు ఇక్కడకు వచ్చి మూలికా వైద్యం చేయించుకున్నారు. పక్షవాతం, ఆస్తమా, సోరియాసిస్, కీళ్లవాతం తదితర దీర్ఘకాల రోగాల నుంచి ఉపశమనం పొందుతున్నారు. 

అడవుల్లో సేకరించి  అనువుగా మార్చి.. 
ఈ వైద్య విధానంలో 364 రకాల మూలికలను ఉపయోగిస్తామని సహదేవరాజ్‌ చెబుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం, ఛత్తీస్‌గఢ్‌లోని కుంట, బస్తర్, శ్రీశైలం, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని అడవుల్లో వనమూలికలను సేకరించి గంధసిరి, కోయంబత్తూరులోని సహదేవరాజ్‌ ఆశ్రమాల్లో వైద్యానికి అనువుగా తయారుచేస్తారు. గ్రామానికి చెందిన 150 మంది ఆయన పర్యవేక్షణలో శిక్షణ పొంది అడవుల నుంచి మూలికలు తీసుకురావడంలో సహకరిస్తున్నారు.  

ఎలిజబెత్‌ రాణి  ప్రశంసలు.. 
గంధసిరి మూలికా వైద్యం సామాన్యులతో పాటు ప్రముఖుల మన్ననలు కూడా పొందింది. మాజీ ప్రధానులు ఇందిరాగాం«దీ, రాజీవ్‌గాం«దీ, చంద్రశేఖర్, మాజీ రాష్ట్రపతి జ్ఞానీ జైల్‌సింగ్, ఉమ్మడి ఏపీలోని పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు ఈ వైద్యం తీసుకున్నారు.

ఇక నాటి బ్రిటన్‌ రాణి ఎలిజబెత్‌–2 కూడా సహదేవ్‌రాజ్‌ ములికా వైద్యాన్ని ప్రశంసించారు. దీంతో ఆయన ఆ్రస్టేలియాలో బ్రాంచ్‌ ఏర్పాటు చేయగా మరిన్ని దేశాల్లో ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. మన దేశం, రాష్ట్రానికి చెందిన ప్రముఖులు కూడా ఆయన వద్ద వైద్యం పొందుతున్నారు. గంధసిరిలో ఈ నెల 6న వైద్య వనమూలిక ట్రస్ట్‌ ప్రారంభించేందుకు సహదేవ్‌రాజ్‌ ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన తెగకు చెందిన ఇంకొందరికి ఈ ట్రస్ట్‌ ద్వారా శిక్షణ ఇవ్వనున్నారు. 

ధన్వంతరి స్ఫూర్తిగా..
మా ముత్తాతలు, తాతలు, తండ్రులు చేసిన వైద్యాన్నే మేమూ చేస్తున్నాం. కుటుంబంలో ఎవరికి జబ్బుచేసినా అదే కుటుంబంలోని మరొకరు కాపాడటంతోనే ఈ మూలికా వైద్యం పుట్టింది. మాకు ధన్వంతరి భగవాన్‌ స్ఫూర్తి. దేశ, విదేశాలకు వెళ్లి ప్రముఖులకు చికిత్స చేశాం. ఈ విధానం అంతరించిపోకుకుండా దీన్ని మా పిల్లలకూ నేరి్పంచాం. మూలికా వైద్యంతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. 

నెలరోజుల్లో సైనస్‌ తగ్గింది..
నాకు సైనస్, మోకాళ్ల నొప్పులు, గ్యాస్ట్రిక్‌ సమస్యలు ఉండేవి. ఇవి తగ్గడానికి గతంలో వేల రూపాయలు ఖర్చు చేశా. ఫలితం లేకపోవడంతో గురూజీ సహదేవరాజ్‌ వనమూలిక వైద్యం గురించి తెలుసుకుని గత నెల గంధసిరికి వచ్చా. నాతోపాటు నా కుమారుడికి సైనస్, భార్యకు బీపీ, థైరాయిడ్‌కు సంబంధించి కూడా వనమూలికలు తీసుకున్నా. నాకు నెలరోజుల్లో సైనస్‌ తగ్గింది. వారికి కూడా ఉపశమనం కలిగింది. ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేకుండా మూలికా వైద్యం చాలా బాగుంది.     
– పసునూరు జయపాల్‌రెడ్డి,
ప్రసన్నాంజనేయస్వామి టెంపుల్‌ చైర్మన్, చంపాపేట, హైదరాబాద్‌ 

 

మరిన్ని వార్తలు