స్వల్పంగా పెరిగిన విద్యార్థుల హాజరు

3 Sep, 2021 02:25 IST|Sakshi

గురువారం ప్రభుత్వ స్కూళ్లలో హాజరు శాతం 38.82

ప్రైవేట్‌ స్కూళ్లలో హాజరు 21.74 శాతం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో విద్యా సంస్థలు ప్రారంభమైన రెండోరోజు గురువారం విద్యార్థుల హాజరు స్వల్పంగా పెరిగింది. ప్రైవేట్‌ పాఠశాలలతో పోలిస్తే.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు ఎక్కువగా హాజరయ్యారు. అధిక శాతం ప్రైవేట్‌ పాఠశాలలు ఆన్‌లైన్‌ పాఠాలకే మొగ్గు చూపాయి. ఆన్‌లైన్‌ పాఠాలకు ప్రభుత్వం అనుమతించడంతో విద్యార్థులు దీన్నే ఆప్షన్‌గా ఎంచుకున్నారు. ఫలితంగా ప్రైవేటు సంస్థల్లో విద్యార్థుల హాజరు తక్కువగా ఉంది. నగరాల్లో కంటే గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులు పాఠశాలలకు ఎక్కువగా హాజరవుతుండటం గమనార్హం.

మహబూబాబాద్‌ జిల్లాల్లో 50 శాతం మంది విద్యార్థులు ప్రత్యక్ష బోధనకు హాజరయ్యారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం గురువారం ప్రభుత్వ స్కూళ్ళలో 38.82 శాతం, ప్రైవేటు స్కూళ్ళలో 21.74 శాతం, ఎయిడెడ్‌ పాఠశాలల్లో 15.04 శాతం హాజరు నమోదైంది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు స్కూళ్లు కలిపి సగటు హాజరు శాతం 25.2గా నమోదైందని విద్యాశాఖ అధికారులు తెలిపారు. బుధవారం సగటున 21.77 శాతం హాజరు నమోదైంది. ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్‌ స్కూళ్ళలో విద్యార్థుల సంఖ్య 52,22,174 మంది కాగా గురువారం 14,76,874 మంది హాజరయ్యారు. 

హాజరు క్రమంగా పెరిగే అవకాశం! 
పట్టణ, గ్రామీణ ప్రాంతాలు రెండింటిలోని ప్రభుత్వ స్కూళ్ళలో విద్యార్థుల హాజరు శాతం ఆశాజనకంగా ఉంది. తల్లిదండ్రుల నుంచి పెద్దగా అభ్యంతరాలు వ్యక్తం కావడం లేదని ఉపాధ్యాయులు చెబుతున్నారు. సీజనల్‌ జ్వరాలు, ఇతరత్రా అస్వస్థతతో ఉన్న వాళ్ళను మాత్రం స్థానిక ప్రజాప్రతినిధులు కట్టడి చేశారు. విద్యార్థుల హాజరు శాతం క్రమంగా పెరిగే అవకాశం ఉందని అధికారవర్గాలు భావిస్తున్నాయి.  

టీచర్‌కి కరోనా.. పాఠశాల మూసివేత 
వారం రోజులు సెలవులు ప్రకటించిన ఎంఈవో  
పినపాక: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలంలోని గోవిందాపు రం మండల పరిషత్‌ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలికి కరోనా నిర్ధారణైంది. బుధవారం విధులకు హాజరై న ఆమెకు గురువారం నలతగా ఉం డటంతో పరీక్ష చేయించుకున్నారు. అం దులో కోవిడ్‌ పాజిటివ్‌గా తేలడంతో ఆమె వెంటనే ఎంఈవో వీరస్వామికి సమాచారమిచ్చారు. దీంతో పాఠశాలకు వారంరోజులు సెలవులు ప్రకటించినట్లు వీరస్వామి తెలిపారు. పాఠశాల సిబ్బందితో పాటు విద్యార్థుల్లో ఎవరికైనా లక్షణాలుంటే వెంటనే పరీక్ష చేయించుకోవాలని సూచించారు. 

మరిన్ని వార్తలు