సార్‌.. అన్నంలో పురుగులు ఎట్ల తినాలి?

8 Dec, 2022 13:07 IST|Sakshi

హైదరాబాద్: ‘సార్‌.. మధ్యాహ్న భోజనంలో పురు గులు వస్తున్నాయి.. ఎట్ల తినాలి’ అంటూ నాలుగో తరగతికి చెందిన ఓ విద్యార్థిని తన తల్లితో కలసి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. ఏఎస్‌ఐ తిరుపతయ్య కథనం ప్రకారం.. మీర్‌పేట సిర్లాహిల్స్‌కు చెందిన పూజిత స్థానిక ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో 4వ తరగతి చదువుతోంది. మంగళవారం పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేస్తుండగా.. అన్నంలో పురుగు రావడంతో  పడేసింది. ఇది గమనించిన ఉపాధ్యాయులు అన్నం ఎందుకు పడేశావని అడగ్గా పురుగు వచ్చిందని చెప్పింది.

 అన్నం తినేది ఉంటేనే పాఠశాలకు రావాలని..లేకపోతే రావొద్దని ఉపాధ్యాయులు మందలించారు. దీంతో పూజిత బుధవారం మధ్యా హ్నం తల్లి రాణితో కలిసి మీర్‌పేట సీఐ మహేందర్‌రెడ్డికి ఫిర్యాదు చేసింది. ఏఎస్‌ఐ తిరుపతయ్య     తనిఖీ చేయగా కూరగాయలు వారం రోజుల క్రితం తెచ్చినవి కావడంతో దాదాపు పాడైపోయి ఉండడం, బియ్యం కూడా నాణ్యతగా లేకపోవడాన్ని గుర్తించారు. ఈ విషయమై ప్రధానోపాధ్యాయుడు గంగాధర్‌ను వివరణ కోరగా బాలిక రెండురోజుల నుంచి పాఠశాలకు గైర్హాజరైందని తెలిపారు. 

పాఠశాలను తనిఖీ చేసిన ఎంఈఓ  
అన్నంలో పురుగులు వచ్చాయని బాలిక ఫిర్యాదు చేసిన విషయం తెలియగానే మండల విద్యాధికారి కృష్ణయ్య వెంటనే పాఠశాలను తనిఖీ చేశారు. కూరగాయలు, బియ్యం నాణ్యతగానే ఉన్నాయన్నారు. ఉపాధ్యాయులు బెదిరించినట్లు వస్తున్న ఆరోపణలపై వాస్తవాలు తెలియాల్సి ఉందన్నారు. మధ్యాహ్నం వరకే పాఠశాల ఉండటంతో విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోయారని, గురువారం విచారణ చేపడతామని తెలిపారు.    

మరిన్ని వార్తలు