ఆన్‌లైన్‌ పాఠాలు అర్థం కావట్లేదు

9 Dec, 2020 03:32 IST|Sakshi

జూన్‌దాకా పరీక్షలొద్దు.. ప్రత్యక్ష తరగతులు ప్రారంభించండి కేంద్ర మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌కు విద్యార్థుల విజ్ఞప్తి

ఈనెల 10న ట్విట్టర్‌ వేదికగా చర్చిస్తానన్న మంత్రి

రేపు జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలపై నిర్ణయం

కరోనా వేళ నాకు ఆన్‌లైన్‌ బోధన అందుబాటులో లేదు. పుస్తకాలు కొనుక్కునే పరిస్థితీ లేదు. అందుకే ఇప్పట్లో పరీక్షలు వద్దు. ఆఫ్‌లైన్‌ తరగతుల తర్వాతే పరీక్షలు పెట్టండి.’
– కరుణ శర్మ, 12వ తరగతి
ఆన్‌లైన్‌ బోధన అర్థం కావట్లేదు. అభ్యసనపై సంతృప్తిగా లేదు. ప్రత్యక్ష విద్యా బోధన కావాలి. ఆ తర్వాతే పరీక్షలు పెట్టండి. పరీక్షలన్నీ జూన్‌ వరకు వాయిదా వేయండి. 
– అబు అనస్, విద్యార్థి

సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియట్‌లో ప్రత్యక్ష విద్యా బోధన ప్రారంభం, పరీక్షల నిర్వహణ, జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలపై విద్యార్థులు నుంచి వ్యక్తమైన అభిప్రా యాలు. ప్రత్యక్ష విద్యా బోధన, సిలబస్‌ కుదింపుపైనా దేశవ్యాప్తంగా విద్యార్థులు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌కు అనేక విజ్ఞ ప్తులు, సూచనలు చేశారు. జేఈఈ మెయిన్, నీట్‌ వంటి ప్రవేశ పరీక్షలు, సీబీఎస్‌ఈ 11, 12 తరగతుల పరీక్షలకు సంబంధించి విద్యార్థులు తల్లిదండ్రులతో ఈనెల 10న 10 గంటలకు ట్విటర్‌ వేదికగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని మంత్రి ప్రకటించగా వేల మంది స్పందించారు. 

పరీక్షలు ఇప్పట్లో వద్దని 99 శాతం మంది స్పష్టం చేశారు. ప్రత్యక్ష బోధనపై చర్యలు చేపట్టాకే ముందుకు సాగాలని సూచించారు. మరికొంత మంది విద్యార్థులైతే 12వ తరగతి పరీక్షలు చాలా కీలకమని, అయితే ప్రస్తుతం కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రత్యక్ష విద్యా బోధన కంటే ఆన్‌లైన్‌ బోధన కొనసాగించాలని, పరీక్షలను కూడా ఆన్‌లైన్‌లోనే నిర్వహించాలని కోరారు. ప్రస్తుత ఆందోళనకర పరిస్థితుల్లో సిలబస్‌ను తగ్గించాలని సూరజ్‌ అనే విద్యార్థి విజ్ఞప్తి చేశారు. ఇంకొంత మంది విద్యార్థులైతే ప్రాక్టికల్‌ పరీక్షల ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. 

నీట్‌ పరీక్షను కూడా జూన్‌ వరకు వాయిదా వేయాలని కోరారు. ఆన్‌లైన్‌ విద్యా బోధనకు అవసరమైన చాలామంది విద్యార్థులకు మొబైల్‌ ఫోన్లు, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు లేవని, అవి ఉన్నా కొందరు ఇంటర్నెట్‌ కనెక్షన్‌ సమస్యలతో విద్యా బోధన ఇబ్బందిగా మారిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ప్రత్యక్ష విద్యా బోధనతోనే ప్రయోజనం ఉంటుందని, ఆ దిశగా చర్యలు చేపట్టాలని కోరారు. ఆ తర్వాతే పరీక్షలపై నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ఈనెల 10న జరిగే ఆన్‌లైన్‌ చర్చా కార్యక్రమంలో తల్లిదండ్రులు, విద్యార్థుల నుంచి అభిప్రాయాలు తీసుకుని తుది నిర్ణయం వెల్లడించనున్నారు.

పరీక్షలకు ఉపయోగపడని ఆన్‌లైన్‌ బోధన
ఇంటర్మీడియెట్‌ విద్యలో ప్రస్తుతం నిర్వహిస్తున్న ఆన్‌లైన్‌ బోధన.. పరీక్షలకు ఏ మాత్రం ఉపయోగపడేలా లేదు. ఆన్‌లైన్‌ విద్యతో పరీక్షలు నిర్వహించడం సరికాదు. నేరుగా తరగతులు నిర్వహించకుండా పరీక్షలు నిర్వహించడం సాధ్యం కాదు. ప్రత్యక్ష విద్యా బోధన కనీసం 3 నెలలు నిర్వహించాల్సిందే.
– ప్రభుత్వ జూనియర్‌ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు పి.మధుసూదన్‌రెడ్డి 

మరిన్ని వార్తలు