యశస్వి ఆత్మహత్య.. పాఠశాల సీజ్‌ 

13 Feb, 2021 13:00 IST|Sakshi
స్కూల్‌ను సీజ్‌ చేస్తున్న ఎంఈఓ శశిధర్‌

కేసు నమోదు చేసిన పోలీసులు

అఖిలపక్షం, విద్యార్థి సంఘాల ఆందోళన

కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే పరామర్శ

నేరేడ్‌మెట్‌: పదో తరగతి విద్యార్థిని యశస్విని ఆత్మహత్య ఘటన నేపథ్యంలో అఖిలపక్ష నాయకులతోపాటు విద్యార్థి సంఘాల నేతలు  శుక్రవారం నేరేడ్‌మెట్‌ ఠాణా పరిధిలోని రవీంద్రభారతి పాఠశాల ఎదుట బైఠాయించి ఆందోళన నిర్వహించారు. పాఠశాల వద్దకు   మల్కాజిగిరి మండల విద్యాశాఖ అధికారి శశిధర్‌ రావడంతో ఉద్రికత్త నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. విద్యార్థి ఆత్మహత్యకు కారణమైన  పాఠశాల నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని నాయకులు డిమాండ్‌ చేశారు. ఫీజు చెల్లించాలని ఒత్తిడి వల్లనే విద్యార్థిని మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్టు తల్లిదండ్రులు చెప్పారని, ఈమేరకు జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాలతో పాఠశాలను సీజ్‌ చేసి, సీలు వేసినట్టు ఎంఈఓ తెలిపారు.

ప్రస్తుతం స్కూల్‌ నిర్వాహకులు విజయలక్ష్మిరెడ్డి  అందుబాటులో లేరని,  ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు చేస్తున్నామని ఎంఈఓ వివరించారు.  విజయలక్ష్మిరెడ్డిపై కేసు నమోదు చేసినట్టు నేరేడ్‌మెట్‌ సీఐ నర్సింహ్మాస్వామి తెలిపారు. మల్కాజిగిరి తహసీల్ధార్‌ వినయలత స్కూల్‌ను పరిశీలించారు. అనంతరం విద్యార్థి తల్లిదండ్రులతో మాట్లాడారు. ప్రభుత్వ పరంగా ఆర్ధిక సహాయం అందేలా చూస్తానని చెప్పారు.

విద్యార్థిని యశస్విని తల్లిదండ్రులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే మైనంపల్లి 
విద్యార్థి కుటుంబానికి ఎమ్మెల్యే రూ.2లక్షల సాయం 
శుక్రవారం మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ఈస్ట్‌కాకతీయనగర్‌లోని విద్యార్థిని యశస్విని ఇంటికి వెళ్లి  తల్లిదండ్రులను పరామర్శించారు.   ఫీజు చెల్లించాలని స్కూల్‌ యజమాన్యం యశస్వినితో తనకు ఫోన్‌ చేయించారని, ఒత్తిడి చేయడంతో మనస్థాపం చెంది ఆత్మహత్య చేసుకున్నట్టు విద్యార్థిని తండ్రి హరిప్రసాద్‌ ఎమ్మెల్యేతో వాపోయారు. ఈ విషయంపై ఎమ్మెల్యే మంత్రి కేటీఆర్‌తో మాట్లాడి బాధిత కుటుంబానికి న్యాయంచేస్తామని హామీ ఇచ్చారు.  

నేతల రూ.3లక్షల సాయం 
బీజేపీ కార్పొరేటర్‌ రాజ్యలక్ష్మి, టీఆర్‌ఎస్,బీజేపీ నేతలు బద్ధం పరుశురామ్‌రెడ్డి,సతీష్‌కుమార్, ప్రసన్ననాయుడుతోపాటు పలువురు నాయకులు కలిపి రూ.3లక్షలను అందజేస్తామన్నారు. స్కూల్‌ యాజమాన్యం తరపున రూ.5లక్షల ఆర్థిక సహాయం అందేలా చూస్తానని ఎమ్మెల్యేకు స్కూల్‌ బిల్డింగ్‌ యజమాని చెప్పారు.   

 చదవండి: ఫీజు వేధింపులకు విద్యార్థిని బలి

మరిన్ని వార్తలు