ప్లాస్టిక్‌ కాలుష్య కొండల్లో కాంతి రేఖ

1 Aug, 2021 02:19 IST|Sakshi

పీపీఈ కిట్లు, కోవిడ్‌ వినియోగ వ్యర్థాల రీసైక్లింగ్‌కు చర్యలు

రీ యూజబుల్‌ పీపీఈ కిట్లను తయారు చేసిన మెక్సికో విద్యార్థిని తమార

వాడేసిన పీపీఈ కిట్లతో ఇటుకలు తయారుచేస్తున్న బినిష్‌ దేశాయ్‌

సాక్షి, హైదరాబాద్‌: కరోనా విసిరిన సవాళ్లకు ఎదుర్కొనేందుకు పలు రూపాల్లోని ప్లాస్టిక్‌ వస్తువులు, పరికరాలు, సామగ్రి ఎంతో ఉపకరించాయి. ఫ్రంట్‌లైన్‌ వారియర్లకు పీపీఈ కిట్లు, మాస్కులు, గ్లౌజులు ఎంతో భద్రత కల్పించాయి. ప్రపంచవ్యాప్తంగా వీటి వినియోగం భారీగా పెరగడంతో ప్లాస్టిక్‌ వ్యర్థాలు ప్రకృతికి, పర్యావరణానికి నష్టం కలుగుతోంది. ప్లాస్టిక్‌ కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు మెక్సికోకు చెందిన 21 ఏళ్ల యువ వ్యాపారవేత్త, విద్యార్థిని తమార ఛాయో రీ యూజబుల్‌ పీపీఈ కిట్లు తయారు చేశారు. దీంతో ప్లాస్టిక్‌ కాలుష్య కొండల్లో కాంతిరేఖ విరిసినట్లు అయ్యింది.

3 రోజుల పాటు వైరస్‌
వాడి పారేసిన పీపీఈ కిట్ల ద్వారా ప్లాస్టిక్‌ కాలుష్యంతో పాటు వాటిపై మూడు రోజుల పాటు సజీవంగా ఉండే వైరస్‌తోనూ ముప్పేనని నిపుణులు చెబుతున్నారు. కెమికల్‌ ఇంజనీరింగ్‌ విద్యార్థిని తమార ఛాయో గతేడాది సహ స్థాపకురాలిగా ఓ సంస్థ ప్రారంభించి, పీపీఈ కిట్ల కొరత ఏర్పడినప్పుడు ఎంఈడీయూ ప్రొటెక్షన్‌ అభివృద్ధి చేశారు. వైరల్‌ రీసెర్చి ల్యాబ్స్‌లో ఉపయోగించే కోటింగ్‌ త రహాలో ఉన్న వస్త్రంతో ఆమె ఈ దుస్తులు తయారు చేశారు. ఈ కిట్‌ను 50 సార్ల వరకు ఉతికి ఉపయోగించొచ్చని, అయినా తన రక్షణ గుణాలు కోల్పోదని తమారా చెబుతోంది. ఈ దుస్తులకు క్యూఆర్‌ కోడ్‌ను కూడా అంతర్భాగంగా చేయడం ద్వారా దీన్ని ధరించే వారికి స్మార్ట్‌ఫోన్‌ యాప్‌ ద్వారా దాన్ని ఎన్ని సార్లు ఉపయోగించారన్న సమాచారం వస్తుంది. దానిని 50 సార్లు ఉపయోగించాక ప్యాకేజింగ్‌ ఉత్పత్తులకు సంచులుగా వాడుకోవచ్చు.

ఆస్పత్రి ప్లాస్టిక్‌ వ్యర్థాలతో ఇటుకలు
భారత్, బ్రిటన్‌ తదితర దేశాల్లోని వ్యాపారవేత్తలు ప్లాస్టిక్‌ పీపీఈ కిట్లు, మాస్కులను ఎలా రీసైకిల్‌ చేయాలన్న దానిపై నూతన ఆవిష్కరణలు చేస్తున్నారు. ఇంగ్లండ్‌లోని వేల్స్‌లో థర్మల్‌ కంపాక్షన్‌ గ్రూప్‌ (టీసీజీ) హాస్పిటల్‌ గౌన్లు, మాస్కులు, వార్డు కర్టెన్లు తదితరాలను ప్లాస్టిక్‌ ఇటుకలుగా తయారు చేసే మెషీన్లను రూపొందించింది. ఇలా ఉత్పత్తి చేసే ప్లాస్టిక్‌ ద్వారా పాఠశాలల కుర్చీలు, త్రీడీ ప్రింటర్‌ ఫిలమెంట్లు, దుస్తుల తయారీకి ఉపయోగించే దారంగా కూడా వాడుకోవచ్చని చెబుతున్నారు. టీసీజీ గ్రూపు కెనడా, ఆస్ట్రేలియా, హంగేరీ దేశాలకు తమ యంత్రాలను ఎగుమతి చేసేందుకు సన్నద్ధమౌతోంది. 

రీసైకిల్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా..
వాడేసిన పీపీఈ కిట్లతో ఇటుకలు, కన్‌స్ట్రక్షన్‌ ప్యానెళ్లు తయారు చేసి తక్కువ ఖర్చులో హౌసింగ్, స్కూళ్ల నిర్మాణానికి భారత్‌లో 27 ఏళ్ల బినిష్‌ దేశాయ్‌ అనే వ్యాపారవేత్త దోహదపడుతున్నాడు. యుక్తవయసు నుంచే వ్యర్థాల నుంచి ఇటుకల తయారీ నేర్చుకున్నాడు. డిస్‌ఇన్ఫెక్ట్‌ చేసిన, ముక్కలు చేసిన మాస్కులు, పీపీఈ కిట్లు, ఇతర వస్తువులను, కాగితం మిల్లు వ్యర్థాలు, బైండర్‌తో మిక్స్‌ చేసి కొత్త ఇటుకలు తయారు చేయడాన్ని కనుగొన్నాడు. దేశాయ్‌ను ది రీసైకిల్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా అని పిలుచుకుంటున్నారు.  

మరిన్ని వార్తలు