అల్లరి చేస్తున్నారని.. విద్యార్థులను చితకబాదిన హెచ్‌ఎం.. గది తలుపులు మూసి

31 Aug, 2022 10:47 IST|Sakshi
హెచ్‌ఎంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్న తల్లిదండ్రులు  

సాక్షి, ఖమ్మం: పలు ప్రాంతాల్లో ఉపాధ్యాయుల తీరుపై విమర్శలు వస్తున్నా... మిగతా వారిలో మార్పు రావడం లేదు. దండన లేని బోధన అందించాలని ప్రభుత్వం, విద్యారంగ నిపుణులు చెబుతున్నా ఉపాధ్యాయులు తీరు మార్చుకోవడం లేదు. ఖమ్మం 4వ డివిజన్‌ పాండురంగాపురం ప్రాథమిక పాఠశాలలో  మంగళవారం ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. పాఠశాలలోని 5వ తరగతిలో 22మంది విద్యార్థులు చదువుతున్నారు. అయితే, మంగళవారం మధ్యాహ్నం పిల్లలు అల్లరి చేస్తున్నారంటూ తరగతి గదికి చేరుకున్న హెచ్‌ఎం చంద్రు.. వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చితకబాదాడు.

ఆ సమయంలో గది తలుపులు మూసి మరీ కొట్టడంతో పిల్లలు కన్నీరుమున్నీరుగా రోదించారు. పిల్లలను విపరీతంగా కొట్టడంతో శరీరంపై వాతలు తేలగా పాఠశాల సమయం ముగిసినా ఇంటికి వెళ్లకుండా రోదిస్తూ కూర్చున్నారు. దీంతో కొందరు తల్లిదండ్రులు చేరుకోగా విషయం తెలియడంతో మిగతా వారికి కూడా సమాచారం ఇచ్చారు. ఈమేరకు తల్లిదండ్రులంతా చేరుకుని ప్రధానోపాధ్యాయుడు చంద్రుపై తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయారు.

కొందరు ఆయనపై చేయి కూడా చేసుకున్నట్లు తెలిసింది. చివరకు హెచ్‌ఎం దివ్యాంగుడని తోటి ఉపాధ్యాయులు నచ్చచెప్పడంతో తల్లిదండ్రులు రెండు గంటల అనంతరం శాంతించారు. ఇటీవలే ఆయన బదిలీల్లో భద్రాది కొత్తగూడెం జిల్లా నుండి పాండురంగాపురం వచ్చారు. ఈ ఘటనపై ఎంఈఓ శ్రీనివాస్‌ను ఫోన్‌ ద్వారా వివరణ కోరగా తనకు విషయం ఇప్పుడే తెలిసిందని, పూర్తిస్థాయిలో సమాచారం తెలుసుకుంటానని వెల్లడించారు.
చదవండి: పెంపుడు కుక్క చనిపోయిందని.. డిగ్రీ విద్యార్థి ఆత్మహత్య 

మరిన్ని వార్తలు