సందేహాలు తీరేదెలా? 

24 Aug, 2021 04:16 IST|Sakshi

ప్రశ్నలడిగే వీల్లేకుండా ఆన్‌లైన్‌ విద్య 

పాఠాలు అర్థంకాక ఇంటర్‌ విద్యార్థుల ఇక్కట్లు 

ప్రభుత్వ కాలేజీల్లో వేధిస్తున్న లెక్చరర్ల కొరత 

ఆన్‌లైన్‌ విద్యా విధానంపై సర్వత్రా అసంతృప్తి 

 సాక్షి, హైదరాబాద్‌: ఇంటర్మీడియెట్‌ ఆన్‌లైన్‌ విద్యా విధానంపై విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో సబ్జెక్టుపై బోధన వ్యవధిని ప్రభుత్వ కాలేజీలు కేవలం అరగంటకే పరిమితం చేశాయి. దీంతో అరకొరగా పాఠం వినడానికే సమయం సరిపోతోందని విద్యార్థులు అంటున్నారు. ప్రత్యక్ష బోధనలోనైతే పాఠం చెప్పిన వెంటనే ప్రశ్నలు అడిగే వీలుంటుంది. లెక్చరర్లు ప్రధానంగా దీనికే ప్రాధాన్యం ఇస్తారు. విద్యార్థి సృజనాత్మకత ఇక్కడే గుర్తిస్తామని లెక్చరర్లు అంటున్నారు.

ఆన్‌లైన్‌ క్లాసుల్లో ఎవరి సత్తా ఏంటనేది తెలుసుకునే వీల్లేకుండా పోతోందని కరీంనగర్‌కు చెందిన శేషుకుమార్‌ అనే లెక్చరర్‌ చెప్పారు. ‘సందేహాలు, సమాధానాలు’లేకపోతే బోధన అసంపూర్తిగానే ఉన్నట్టు అని ఆయన అభిప్రాయపడ్డారు. విద్యార్థుల నుంచీ ఇదే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా గణితంలో కఠినమైన ఫార్ములాల గురించి లెక్చరర్లతో సంభాషించే అవకాశం ఉండటం లేదని విద్యార్థులు వాపోతున్నారు. సవాలక్ష డౌట్లతో పాఠాలు సరిగా అర్థం కావడంలేదని విద్యార్థి సంఘాలు అంటున్నాయి. కార్పొరేట్, ప్రైవేటు కాలేజీల్లో చదివే విద్యార్థుల నుంచి ఈ ఫిర్యాదులు తక్కువగా వస్తున్నాయి. 

పుస్తకాలు మారినా...  
వాస్తవానికి ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం తెలుగు, మొదటి సంవత్సరం ఇంగ్లిష్‌ పుస్తకాలు మారాయి. విద్యాశాఖ మంత్రి ఈ మధ్యే వీటిని విడుదల చేసినా ప్రభుత్వ కాలేజీలకు పూర్తిస్థాయిలో చేరలేదు. కోవిడ్‌ కారణంగా ప్రింటింగ్‌ ఆలస్యమవుతోందని అధికారులు చెబుతున్నారు. నిజానికి మారిన పుస్తకాలను ముందుగా లెక్చరర్లు చదివి అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత విద్యార్థులకు చెప్పాలి. వారి నుంచి అనేక సందేహాలు వస్తుంటాయి. వీటిని మళ్లీ అధ్యయనం చేసి నివృత్తి చేయాల్సి ఉంటుందని అధ్యాపకులు అంటున్నారు.

విద్యా సంవత్సరం మొదలై రెండు నెలలైనా ఇంత వరకూ కొత్త పుస్తకాల మొఖమే చూడలేదని, ఇలాంటప్పుడు బోధనలో నాణ్యత ఎలా ఉంటుందని ప్రభుత్వ కాలేజీలు అంటున్నాయి. ఇతర సబ్జెక్టుల విషయంలోనూ ఇదే గందరగోళం కన్పిస్తోంది. పోటీ పరీక్షల కోణంలో విద్యార్థులకు లోతుగా చెప్పేందుకు ముందుగా వారికి ఉన్న సందేహాలను గుర్తించాల్సి ఉంటుందని అధ్యాపకులు చెబుతున్నారు.

బుర్రకెక్కడం లేదు
– అన్విత్‌ (విద్యార్థి), భద్రాద్రి కొత్తగూడెం  
ఇంటర్‌ ఫస్టియర్‌ ఆన్‌లైన్‌ క్లాసులు వింటున్నా. మేథ్స్‌ విన్నాక అనేక డౌట్స్‌ వస్తున్నాయి. కొత్త ప్రాబ్లమ్స్‌ చేయాలంటే కష్టంగా ఉంది. ఎంత ప్రయత్నించినా రావడం లేదు. కాలేజీలో అయితే లెక్చరర్‌ను అడిగి తెలుసుకునే వీలుంటుంది.  

ఇంత వరకూ ఇంగ్లిష్‌ బుక్‌ చూడలేదు
– పల్లవి (విద్యార్థి), హన్మకొండ  
ఇంగ్లిష్‌ పాత పుస్తకాలు చూశాం. కానీ బుక్‌ మారింది. కొత్త పుస్తకం చూడలేదు. పాఠాలూ జరగడం లేదు. పుస్తకాలూ అందుబాటులులో లేవు. ఇతర సబ్జెక్టుల్లోనూ డౌట్స్‌ వస్తున్నాయి. ఎవరిని అడగాలో తెలియడం లేదు. ఆన్‌లైన్‌ క్లాస్‌ తర్వాత లైన్‌ కట్‌ అవుతోంది.  

బోధకులేరీ? 
ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో ఈసారి ప్రవేశాలు పెరిగాయి. మునుపెన్నడూ లేనివిధంగా లక్షకు పైగా అడ్మిషన్లు వచ్చాయి. అయితే లెక్చరర్ల కొరత వేధిస్తోందని అధికారులు సైతం ఒప్పుకుంటున్నారు. రాష్ట్రంలో 405 కాలేజీలుంటే... రెగ్యులర్‌ లెక్చరర్లు ఉన్నది కేవలం 751 మంది మాత్రమే. 3,599 మంది కాంట్రాక్టు లెక్చరర్లు, 1,658 మంది గెస్ట్‌ ఫ్యాకల్టీ ఉన్నారు. ప్రతీ అకడమిక్‌ సంవత్సరానికి గెస్ట్‌ లెక్చరర్స్‌ సర్వీసును పొడిగిస్తారు. ఈసారి కొన్ని కోర్టు వివాదాల నేపధ్యంలో ఇంతవరకూ వారికి పొడిగింపు ఇవ్వలేదు. దీంతో 25 శాతం వరకూ లెక్చరర్ల కొరత ప్రభుత్వ కాలేజీల్లో ఉంది. ఇన్ని సమస్యలుంటే విద్యాబోధన సాఫీగా ఎలా సాగుతుందని అన్ని వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.   

మరిన్ని వార్తలు