9 మందిని బదిలీ చేస్తే చదువెట్లా?

30 Dec, 2021 03:17 IST|Sakshi
మంచిర్యాల జిల్లా కిష్టాపూర్‌ వద్ద రాస్తారోకో చేస్తున్న విద్యార్థులు 

ఉపాధ్యాయుల కోసం రోడ్డెక్కిన విద్యార్థులు 

జన్నారం (ఖానాపూర్‌): అసలే ఉపాధ్యాయుల కొరత ఉన్న తరుణంలో ఒకేసారి తొమ్మిదిమందిని బదిలీచేస్తే తామెలా చదువుకునేదంటూ మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కిష్టాపూర్‌ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు బుధవారం రోడ్డెక్కారు. పాఠశాల నుంచి కిలోమీటరు దూరం నడుచుకుంటూ వచ్చి మందపల్లి ప్రధాన రహదారిపై బైఠాయించారు. వీరికి గ్రామ మాజీ సర్పంచ్‌ సీదర్ల రమేశ్, ఎన్‌ఎస్‌యూఐ మండల నాయకులు సోహెల్, అజ్మత్‌ఖాన్, పాఠశాల అభివృద్ధి కమిటీ చైర్మన్‌ గాజుల మల్లేశ్‌ తదితరులు మద్దతుగా కూర్చున్నారు.

విద్యార్థులు మహేందర్, నిక్షిత మాట్లాడుతూ పాఠశాలలో 650 మంది విద్యార్థులకు 28 ఉపాధ్యాయులు పనిచేయాల్సి ఉండగా.. 17 మంది మాత్రమే ఉన్నారని, వీరిలో ఇప్పుడు తొమ్మిదిమందిని బదిలీ చేశారని తెలిపారు. బదిలీ అయి న వారి స్థానంలో ఆరుగురే రానున్నారన్నారు. మరో మూడు నెలల్లో పరీక్షలున్నాయని, ఉపాధ్యాయుల్లేకుండా ఎలా చదువుకోవాల ని ప్రశ్నించారు. విషయాన్ని ఇదివరకే కలెక్ట ర్, జిల్లా విద్యాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేదన్నారు.

డీఈవో వచ్చి హామీ ఇచ్చే వరకు కదిలేది లేదని భీష్మించారు. ఎస్సై మధుసుదన్‌రావు, మండల విద్యాధికారి విజయ్‌కుమార్‌ ఎంత చెప్పినా విద్యార్థులు వినిపించుకోలేదు. ఎమ్మెల్యే పాఠశాల దుస్థితిని అర్థం చేసుకోవాలని ప్లకార్డులు ప్రదర్శించారు. మూడు గంటలపాటు రాస్తారోకో చేసిన విద్యార్థులకు ఎంఈవో నచ్చజెప్పడంతో చివరికి సాయంత్రం 5.20కి ఆందోళన విరమించారు. విద్యార్థుల ఆందో ళనతో కిలోమీటర్‌ మేర వాహనాలు నిలిచి ప్రయాణికులు ఇబ్బందులుపడ్డారు.

మరిన్ని వార్తలు