ఆన్‌లైన్‌ చదువులు సాగేనా ! 

31 Aug, 2020 08:37 IST|Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌: కరోనా నేపథ్యంలో విద్యా వ్యవస్థ స్తంభించిపోయింది. దీంతో ప్రభుత్వం పేద విద్యార్థులు చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో ఆన్‌లైన్‌ బోధనకు శ్రీకారం చుట్టింది. సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ తరగతులు జరగనున్నాయి. ప్రభుత్వ నిర్ణయం మంచిదే అయినప్పటికీ ఎంతమందికి ఈ విద్య చేరువ అవుతుందనే ప్రశ్న తలెత్తుతోంది. అక్షరాస్యతతో పాటు ఆర్థికంగా ఆదిలాబాద్‌ జిల్లా వెనుకంజలో ఉంది. ఏజెన్సీ ప్రాంతాల్లోని గూడెలు, తండాల్లో నివసించే చాలా మందికి స్మార్ట్‌ ఫోన్లు, టీవీలు లేకపోవడంతో వీరికి ఆన్‌లైన్‌ బోధన ఎలా సాగుతుందని పలువురు ప్రశ్నిస్తున్నారు. అయితే అందరికి ఆన్‌లైన్‌ విద్య అందే విధంగా చర్యలు చేపడుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.

జిల్లాలో..
జిల్లాలో మొత్తం 1420 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 139 ప్రైవేట్‌ పాఠశాలలు ఉన్నాయి. డీఈవో పరిధిలో 677 పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 455 ప్రాథమిక పాఠశాలలు, 100 ప్రాథమికోన్నత పాఠశాలలు 102 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. అదేవిధంగా 17 కేజీబీవీలు, 6 మోడల్‌ స్కూళ్లు, ఒక యూఆర్‌ఎస్‌ పాఠశాల ఉంది. దాదాపు 65వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఐటీడీఏ పరిధిలో 54 ఆశ్రమ పాఠశాలలు ఉండగా, 12వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. సెప్టెంబర్‌ 1 నుంచి ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభమవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కరోనా ప్రభావం ఎక్కువ ఉండడంతో ఆన్‌లైన్‌ ద్వారా విద్యార్థులకు విద్యను చేరువ చేసేందుకు ప్రభుత్వం సమాయత్తమైంది. ఈనెల 27న విధుల్లో చేరిన ఉపాధ్యాయులు ఆన్‌లైన్‌ తరగతులకు సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.

ఏజెన్సీ ప్రాంతాల్లో భిన్న పరిస్థితి..
ఐటీడీఏ పరిధి ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో చదివే విద్యార్థుల పరిస్థితి భిన్నంగా ఉంది. జిల్లాలో 54 గిరిజన ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. 12వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. అయితే 1397 మంది విద్యార్థుల తల్లిదండ్రులకు స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. అదేవిధంగా 3 నుంచి 4వేల మంది విద్యార్థుల ఇళ్లలో మాత్రమే టీవీలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. కాగా ఏజెన్సీ ప్రాంతాల్లోని పాఠశాలల్లో చదివే విద్యార్థుల నివాసాలు గూడాలు, తండాల్లో ఉండటం, వారి వద్ద అండ్రాయిడ్‌ఫోన్‌లు, టీవీలు లేకపోవడం సమస్యగా మారింది. కొన్ని గ్రామాలకు కనీసం విద్యుత్‌ సౌకర్యం లేని పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో కొంతమంది విద్యార్థులకు ఆన్‌లైన్‌ బోధన పూర్తిస్థాయిలో అందకుండా పోతుందని పలువురు అభిప్రాయ పడుతున్నారు. అయితే ఐటీడీఏ అధికారులు వారికోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.

అధికారుల సర్వే..
ఆన్‌లైన్‌ తరగతులు ప్రారంభం కానున్న నేపథ్యంలో విద్యాశాఖ అధికారులతో పాటు ఐటీడీఏ పరిధిలో పనిచేసే ఉపాధ్యాయులు సర్వే చేపడుతున్నారు. డీఈవో పరిధిలోని పాఠశాలలకు సంబంధించి 3 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు 43,371 మంది ఉన్నారు. టీవీ, డీటీహెచ్‌ కనెక్షన్లు ఉన్నవారు 13,321 మంది, టీవీతో పాటు కేబుల్‌ కనెక్షన్‌ ఉన్నవారు 20,734 మంది, ఆండ్రైడ్‌ ఫోన్‌లు ఉన్నవారు 906 మంది, కంప్యూటర్లు, ల్యాప్‌టాప్, ఇంటర్నెట్‌ కనెక్షన్‌లు ఉన్నవారు 153 మంది ఉన్నారు. అయితే జిల్లాలో అండ్రాయిడ్‌ ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టీవీలు లేనివారు 5,818 మంది విద్యార్థులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఐటీడీఏ పరిధిలో సుమారు 4వేల విద్యార్థులకు పైగా ఇళ్లలో టీవీలు లేవని అధికారులు చెబుతున్నారు. అయితే టీవీలు ఉన్న విద్యార్థుల ఇంట్లో కాని, గ్రామ పంచాయతీ కార్యాలయంలో కాని వీరికి ఆన్‌లైన్‌ పాఠాలు వీక్షించేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు.

ఆన్‌లైన్‌ విద్య అందేలా చర్యలు
ప్రతీ విద్యార్థికి ఆన్‌లైన్‌ బోధన అందే విధంగా చర్యలు చేపడుతున్నాం. జిల్లాలో 5,818 మందికి టీవీలు, కేబుల్‌ కనెక్షన్, అండ్రాయిడ్‌ ఫోన్‌లు లేవు. వీరికి పక్కన ఉన్న విద్యార్థుల ఇంటి వద్ద ఆన్‌లైన్‌ తరగతులు అందేలా చూస్తాం. వీరిపై ఉపాధ్యాయుల పర్యవేక్షణ ఉంటుంది. అదేవిధంగా లోకల్‌ ఛానల్‌ ద్వారా లైవ్‌ పాఠాలను విషయ నిపుణులతో బోధించడం జరుగుతుంది. – రవీందర్‌రెడ్డి, డీఈవో  

సర్వే కొనసాగుతోంది
జిల్లాలో 54 గిరిజన ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. ఆన్‌లైన్‌ తరగతులకు సంబంధించి సర్వే కొనసాగుతోంది. దాదాపు 4వేల మంది విద్యార్థులకు టీవీలు లేవు. 1397 మంది విద్యార్థులకు స్మార్ట్‌ ఫోన్‌లు ఉన్నాయి. వీరికి మే నుంచే బోధన జరుగుతుంది. టీవీలు లేని వారికి ఇతర ఏర్పాట్లు చేస్తాం. 
– చందన, డీడీ, ఐటీడీఏ  

మరిన్ని వార్తలు