గురువుకు టిఫిన్ సెంట‌ర్ పెట్టించిన విద్యార్థులు

31 Jul, 2020 16:21 IST|Sakshi

సాక్షి, జ‌గిత్యాల‌‌: ప‌్రాణం పోసిన త‌ల్లికి, పెంచిన తండ్రికి, స‌ద్బుద్ధులు నేర్పిన గురువుకు ఏమిచ్చి రుణం తీర్చుకోగ‌లం? కానీ క‌ష్ట‌కాలంలో ఉన్న ఓ గురువుకు కొంద‌రు విద్యార్థులు ఉడ‌తా భ‌క్తిగా సాయం చేసి మంచి మ‌న‌సు చాటుకున్న ఘ‌ట‌న జ‌గిత్యాల‌ జిల్లాలో చోటు చేసుకుంది. క‌రోనా కార‌ణంగా విధించిన లాక్‌డౌన్ వ‌ల్ల ఎంద‌రో ప్రైవేటు ఉపాధ్యాయుల ప‌రిస్థితి దారుణంగా త‌యారైంది. అందులో కోరుట్ల‌కు చెందిన‌ 52 ఏళ్ల హ‌నుమంతుల రఘు కూడా ఒక‌రు. మాయ‌దారి క‌రోనా వ‌ల్ల హ‌ఠాత్తుగా‌ త‌న టీచ‌ర్ వృత్తి కోల్పోవ‌డంతో అత‌ని కుటుంబానికి ఆర్థిక క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. అత‌ని కుమారుడు కూడా నిరుద్యోగి కావ‌డం మ‌రింత‌ క‌ల‌వ‌రప‌రిచే అంశం. దీంతో ఈ విష‌యం తెలుసుకున్న‌ కొంద‌రు విద్యార్థులు గురువుకు సాయం చేయాల‌ని భావించారు. (ఉపాధ్యాయుడే ఉపాధ్యాయినిపై..)

టిఫిన్ సెంట‌ర్ పెట్టుకునేందుకు కొంత స్థ‌లంలో ఓ షెడ్డును క‌ట్టిచ్చారు. వారి సాయానికి ఉప్పొంగిన ఉపాధ్యాయుడు ఆ టిఫిన్ సెంట‌ర్‌కు "గురుద‌క్షిణ" అని నామ‌క‌ర‌ణం చేశారు. దీని గురించి ఆయ‌న మాట్లాడుతూ.. 'నన్ను ఆదుకునేందుకు వ‌చ్చిన నా విద్యార్థుల‌కు ఎలా కృత‌జ్ఞ‌త‌లు చెప్పాలో తెలియ‌డం లేదం'టూ భావోద్వేగానికి లోన‌య్యారు. కాగా ఆయ‌న రుద్రంగి జిల్లాప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల‌లో ఆంగ్ల‌ము, జీవ‌శాస్త్రం పాఠాలు నేర్పేవారు. ప్ర‌స్తుతం ఆయ‌న‌కు సాయం చేసిన విద్యార్థులు 1997-98 బ్యాచ్‌కు చెందిన వారు. ఆదివారం నుంచి ప్రారంభం కానున్న ఈ టిఫిన్ సెంట‌ర్‌కు క‌స్ట‌మ‌ర్ల‌ను కూడా తీసుకొస్తామంటూ భ‌రోసా ఇస్తున్నారు స‌ద‌రు విద్యార్థులు. (‘ఇన్నేళ్ల గౌరవం క్షణాల్లో నాశనం అయ్యింది’)

మరిన్ని వార్తలు