ఇంటి గోడలే బ్లాక్‌బోర్డు

22 Aug, 2021 03:29 IST|Sakshi

ఉపాధ్యాయురాలి వినూత్న ఆలోచన 

విద్యార్థుల ఇంటి గోడలపైనే రంగులతో అఆలు, అంకెలు.. 

వాటిని చూస్తూ ఇంటి వద్దే చదువుకునేలా ఏర్పాటు 

మహబూబ్‌నగర్‌ ఎడ్యుకేషన్‌: కరోనా కారణంగా బడులు మూతపడటంతో విద్యార్థులంతా ఇళ్లకే పరిమితమైపోయారు. దీంతో నెలలతరబడి పాఠాలు చెప్పకపోతే..ఇన్నాళ్లు వారు నేర్చుకున్న అంశాలన్నీ మర్చిపోయే అవకాశముంది. ఈ నేపథ్యంలో మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మండలం పోచమ్మగడ్డతండాలో ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయురాలు కళావతి ఓ వినూత్న ఆలోచనతో ముందుకొచ్చారు. చిన్నారుల ఇంటిగోడలనే బ్లాక్‌బోర్డుగా మార్చారు. వారు గతంలో నేర్చుకున్న ఓనమాలు, గుణింతాలు, ఏబీసీడీలు, అంకెలు, ఎక్కాలు మర్చిపోకుండా తానే పెయింటర్‌లా మారి రోజుల తరబడి శ్రమించి విద్యార్థుల ఇంటి గోడలపై అక్షరాలు రాశారు.

ఆ పాఠశాలలో మొత్తం 24 మంది విద్యార్థులు చదువుతుండగా.. అందరికీ అందుబాటులో ఉండే విధంగా కొన్ని ఇళ్లను ఎంపిక చేసుకుని వాటి గోడలపై విద్యార్థులకు అవసరమయ్యే అక్షరాలను రాశారు. కొంతమంది ఇంటి గోడలపై పెయింట్‌ పాడైపోతుందని వాదించినా వారికి సర్దిచెప్పారు. మరికొంత మంది ఇంటి గోడలకు ఫ్లెక్సీలపై ఓనమాలు ప్రింట్‌ చేయించి వేలాడదీశారు. అంతేకాకుండా సాయంత్రం వేళల్లో ఇంటికి చేరువలో ఉన్న పాఠశాల సీనియర్‌ విద్యార్థులతో చిన్నారులకు తరగతులు బోధించే విధంగా గ్రామస్తుల సహకారంతో ఏర్పాటు చేశారు. 

ఓనమాలు మర్చిపోవద్దనే..
‘ఆన్‌లైన్‌లో పాఠాలపై చిన్నారులకు పెద్దగా అవగాహన ఉండటం లేదు. వారు నేర్చుకున్న అంశాలు మర్చిపోకుండా ఉండేందుకే విద్యార్థుల ఇంటి గోడలపై అక్షరాలను పెయింట్‌తో రాయించాను. విద్యార్థుల తల్లిదండ్రులు ఒప్పుకుంటే వారి ఇళ్లలో కూడా అక్షరాలు రాయాలని ఉంది.’’ 
– కళావతి, ఉపాధ్యాయురాలు, పీఎస్‌ పోచమ్మగడ్డతండా  

మరిన్ని వార్తలు