ప్రవేశ పరీక్షలు రాసేదెలా?

27 Dec, 2020 12:01 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌:  సీనియర్‌ ఇంటర్‌ విద్యార్థులకు టెన్షన్‌ పెరిగిపోతోంది. కరోనా మూలంగా ఇంకా కాలేజీలే మొదలు కాలేదు... అప్పుడే ఏడునెలల విలువైన కాలం గడిచిపోయింది. మరోవైపు ఎంట్రన్స్‌ ఎగ్జామ్స్, వార్షిక పరీక్షలు దగ్గరపడుతున్నాయి. దాంతో రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ, బైపీసీ చదివే దాదాపు 3 లక్షల మంది విద్యార్థులకు ప్రవేశ పరీక్షల భయం పట్టుకుంది. ప్రత్యక్ష బోధన లేక, డిజిటల్‌/ఆన్‌లైన్‌ బోధన అర్థంకాక తలపట్టుకుంటున్న విద్యార్థులను... ఒక్కొక్కటిగా ప్రవేశపరీక్షల నోటిఫికేషన్ల జారీ షురూ కావడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే జేఈఈ మెయిన్‌ నోటిఫికేషన్‌ జారీ, దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కావడంతో తమ చదువులెలా? అన్న ఆవేదనలో విద్యార్థులు పడ్డారు. ప్రత్యక్ష బోధన లేని ప్రస్తుత పరిస్థితుల్లో జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలే కాదు.. ఎంసెట్‌ వంటి రాష్ట్ర ప్రవేశ పరీక్షల్లోనైనా నెగ్గుకు రాగలుగుతామా? అన్న భయం వారిని వెంటాడుతోంది. 

ఏపీ విద్యార్థుల నుంచే ప్రధాన పోటీ
జేఈఈ మెయిన్‌, జేఈఈ అడ్వాన్స్‌డ్, నీట్‌ వంటి జాతీయ పరీక్షలకు సిద్ధం కావాలన్నా, ఎంసెట్‌ లాంటి రాష్ట్ర స్థాయి పరీక్షలు రాయాలన్న ప్రత్యక్ష బోధన ఉండాల్సిందేనని అధ్యాపకులే చెబుతున్నారు. రాష్ట్రంలో సెపె్టంబర్‌ 1 నుంచి ఆన్‌లైన్‌/ డిజిటల్‌ బోధన చేపట్టినా ఫలితం అంతంతేనంటున్నారు. విభజన చట్టం ప్రకారం విద్యా సంస్థల్లోని ఓపెన్‌ కోటా 20% సీట్లలో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు పోటీ పడతారు.

ఎంసెట్‌లో తీవ్ర పోటీ ఉంటుంది. హైదరాబాద్‌లో టాప్‌ కాలేజీ లు ఎక్కువగా ఉండటంతో ఏపీ విద్యార్థులు తెలం గాణ ఎంసెట్‌పై ప్రత్యేక దృష్టి సారిస్తారు. ఏపీలో నవంబర్‌ 2 నుంచే ప్రత్యక్ష బోధన ప్రారంభమైంది. దాదాపు 30% సిలబస్‌ కూడా పూర్తయినట్లు ఇంటర్‌ బోర్డు అధికారులు చెబుతున్నారు. తెలంగాణతో పోలిస్తే ప్రిపరేషన్‌ మెరుగ్గా ఉంది కాబట్టి ఓపెన్‌ కోటాలో ఏపీ విద్యార్థులకు ఎక్కువ శాతం సీట్లు దక్కే అవకాశం ఉంటుంది. 

వార్షిక పరీక్షలూ కష్టమే
రాష్ట్రంలో సెపె్టంబర్‌ 1 నుంచి ఆన్‌లైన్‌/డిజిటల్‌ విద్యా బోధన ప్రారంభమైంది. అయితే విద్యార్థులంతా డిజిటల్‌ పాఠాలను వినడం లేదని అధ్యాపకులే చెబుతున్నారు. టీశాట్‌లో వీడియోపాఠాలు ప్రసారం చేస్తున్నా విద్యార్థులకు అర్థం కావడం లేదని, ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచిన వీడియో పాఠాలపై అనుమానాలు వస్తే నివృత్తి చేసుకునే అవకాశం లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడతున్నారు. మొత్తానికి 50 శాతం మంది విద్యార్థులు అంతంతగానే పాఠాలు నేర్చుకునే పరిస్థితి నెలకొనగా, 30 శాతం మంది విద్యార్థులు అసలు పాఠాలే వినడం లేదని ఆన్‌లైన్‌/డిజిటల్‌ బోధనను పర్యవేక్షిస్తున్న లెక్చరర్లు చెబుతున్నారు. మరోవైపు వచ్చే ఏప్రిల్‌లో ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షలను నిర్వహించేలా ఇప్పటికే ఇంటర్మీడియట్‌ బోర్డు అకడమిక్‌ కేలండర్‌ను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో వీడియో పాఠాలు అర్థంకాక, కొంత మంది పాఠాలే వినలేని పరిస్థితుల్లో వార్షిక పరీక్షలు ఎలా రాస్తారన్న ఆందోళన తల్లిదండ్రుల్లో నెలకొంది.

నిర్ణయం తీసుకునేదెప్పుడు? 
ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులను ఎలాగోలా పాస్‌ చేసినా, ఇంటరీ్మడియట్‌ విషయంలో ప్రత్యక్ష బోధన లేకుండా ఎలా ముందుకు సాగాలన్నది ప్రధాన ప్రశ్నగా మారింది. అంతేకాదు ఇంటర్‌ పూర్తి చేసిన విద్యార్థులు జాతీయ, రాష్ట్రస్థాయి ప్రవేశ పరీక్షలు రాసి, మెరుగైన ర్యాంకులు సాధిస్తేనే వివిధ వృత్తి, సాంకేతిక విద్యా సంస్థల్లో ప్రవేశాలను పొందగలుగుతారు. అయితే ప్రత్యక్ష విద్యా బోధన లేకుండా విద్యార్థులు ఎలా ప్రవేశ పరీక్షలకు సిద్ధం అవుతారని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. అయినా నిర్ణయం తీసుకోవడంలో ప్రభుత్వం జాప్యం చేస్తోంది. కాలేజీలు తెరిచేందుకు గతంలోనే ప్రతిపాదనలను పంపించినా వాటికి మోక్షం లభించకపోవడంతో ఇంటర్‌బోర్డు, ఇంటరీ్మడియట్‌ విద్యాశాఖ చేతులు ముడుచుకొని కూర్చోవాల్సి వస్తోంది.

పాఠాలు అర్థం కావడం లేదు 
కెమిస్ట్రీ సబ్జెక్టుకు సంబంధించిన అధ్యాపకులు టీవీలో ఏకధాటిగా చెబుతూ వెళ్తుండటం, చెప్పింది అర్థం కాకపోవడం ఇబ్బంది కలిగిస్తోంది. నోట్స్‌ రాసుకునే సమయం  ఇవ్వడం లేదు. టీవీలో పాఠం వింటూ వేగంగా నోట్స్‌ రాసుకోవడమే తప్ప.. తిరిగి వారిని డౌట్‌లు అడిగే వీలు లేదు. – మనీష, ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం, నయాబజార్‌ కళాశాల, ఖమ్మం

అనుమానాలు నివృత్తి చేసుకునే అవకాశం లేదు 
ఆన్‌లైన్‌లో పాఠాలు వింటున్నా. అయితే క్లాస్‌రూమ్‌లో వింటున్న అనుభూతి.. డౌట్‌ వస్తే అధ్యాపకులను అడిగి నివృత్తి చేసుకునే వెసులుబాటు లేదు. డిజిటల్‌ క్లాసులు వేగంగా కొనసాగుతున్నాయి. పాఠం అర్థమైందో..లేదో తెలుసుకునే అవకాశం అధ్యాపకులకు లేదు.  – ఉష, బైపీసీ, ద్వితీయ సంవత్సరం, నయాబజార్‌ కళాశాల, ఖమ్మం

వన్‌వే బోధనతో లాభం లేదు
మొదట్లో 80 శాతం మంది పాఠాలు విన్నారు. ఇప్పుడది చాలా వరకు తగ్గిపోయింది. నెట్‌వర్క్, ఇతరత్రా సమస్యలతో వినడం లేదు. ఆన్‌లైన్‌/ డిజిటల్‌ బోధన ప్రత్యక్ష బోధనకు ప్రత్యామ్నాయం కాదు. విద్యార్థి– అధ్యాపకుల మధ్య ఉన్న అనుబంధం లేకుండా పోయింది. వన్‌వే వల్ల విద్యార్థుల్లో నేర్చుకోవాలనే ఆసక్తి పోయింది. –కృష్ణకుమార్, ప్రభుత్వ కాలేజీల ప్రిన్సిపాళ్ల సంఘం అధ్యక్షుడు

విద్యార్థులకు తీవ్ర నష్టం
ఇంటర్‌లో ప్రత్యక్ష విద్యా బోధనపై ప్రభుత్వం త్వరగా నిర్ణయం తీసుకోవాలి. లేదంటే రాష్ట్ర విద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. ప్రత్యక్ష బోధనకు డిజిటల్‌ బోధన సాటిరాదు. డిజిటల్‌ బోధన వల్ల విద్యార్థులకు పాఠాలు అర్థం అయ్యేది అంతంతే. ప్రత్యక్ష బోధన లేకుండా విద్యార్థులకు పరీక్షల నిర్వహణ కష్టమే. – డాక్టర్‌ పి.మధుసూదన్‌రెడ్డి, ప్రభుత్వ జూనియర్‌ లెక్చరర్ల సంఘం అధ్యక్షుడు

మరిన్ని వార్తలు