తాగకపోయినా పెరుగుతున్న ఫ్యాటీ లివర్‌ బాధితులు

10 Jun, 2022 14:43 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆల్కహాల్‌ తీసుకునే అలవాటు లేకున్నా, ఫ్యాటీ లివర్‌ బాధితులు పెరుగుతున్నారని ఓ అధ్యయనంలో తేలింది. నగరానికి చెందిన ఏఐజీ ఆసుపత్రి తమ రూరల్‌ అవుట్‌ రీచ్‌ ప్రోగ్రామ్, క్లినికల్‌ డేటాల విశ్లేషణ ద్వారా నిర్వహించిన అధ్యయనం ఫలితాలను వివరించింది. ప్రతి 10మందిలో నలుగురికి ఫ్యాటీ లివర్‌ సమస్య ఉందని తేలింది. అంతర్జాతీయ నాన్‌ ఆల్కహాలిక్‌ స్టీటో హెపటైటిస్‌ (నాష్‌) దినాన్ని పురస్కరించుకుని ఈ అధ్యయన వివరాలను ఏఐజీ ఆసుపత్రి గురువారం విడుదల చేసింది.

ఈ సందర్భంగా ఆసుపత్రి ఛైర్మన్, డైరెక్టర్‌ డా.నాగేశ్వర్‌రెడ్డి  మాట్లాడుతూ శారీరక శ్రమ లేని జీవనశైలి, అపసవ్య ఆహారపు అలవాట్ల వల్ల నాన్‌ ఆల్కహాలిక్‌ ఫ్యాటీ లివర్‌ వ్యాధి మన దేశంలో విస్తరిస్తోందన్నారు. అయితే  ఎక్కువ లక్షణాలు లేకపోవడం వల్ల అనుకోకుండా మాత్రమే ఇది బయటపడుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో తాము నిర్వహించిన పరీక్షల్లో 20శాతం మందికి గుర్తించామని, దీనితో పట్టణ ప్రాంతాల్లో డేటాను పోల్చి చూసినప్పుడు అదే స్థాయిలో సమస్య తీవ్రత ఉందని గుర్తించామన్నారు.  ఈ నేపథ్యంలో ప్రజల్లో అవగాహన పెంచేందుకు తాము ప్రత్యేకంగా ఫ్యాటీ లివర్‌ కేర్‌ విభాగాన్ని ప్రారంభిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో ఆసుపత్రి హెపటాలజీ డైరెక్టర్‌ డా.మిథున్‌ శర్మ ఎఐజీ ఆసుపత్రి ఒబెసిటీ, మెటబాలిక్‌ థెరపీ డైరెక్టర్‌ డా.రాకేష్‌ కలాపాల తదితరులు పాల్గొని మాట్లాడారు.

(చదవండి: గుడ్‌న్యూస్‌: గెస్ట్‌ లెక్చరర్ల వేతనాలు.. గంటకు రూ. 90 పెంపు)

మరిన్ని వార్తలు