ఆహారశుద్ధి పరిశ్రమలకు ప్రోత్సాహం

13 Aug, 2020 01:13 IST|Sakshi

జల విప్లవంతో గులాబీ, శ్వేత, నీలి విప్లవాలు

ఆహారశుద్ది పరిశ్రమలకు రాయితీలు ఇస్తాం: కేటీఆర్

ఫుడ్‌ ప్రాసెసింగ్, లాజిస్టిక్స్‌ పాలసీలపై మంత్రుల భేటీ

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో మారుతున్న పంటల సరళిని దృష్టిలో పెట్టుకుని ఆహారశుద్ధి పరిశ్రమలను ప్రోత్సహించాలని మంత్రులు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న ఫుడ్‌ ప్రాసెసింగ్, లాజిస్టిక్‌ పాలసీపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు బుధవారం ప్రగతిభవన్‌లో ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పాలసీ ద్వారా ఆహారశుద్ధి రంగంలో చిన్న యూనిట్లతోపాటు గ్రామీణ ప్రాంత యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయని పేర్కొన్నారు. అలాగే ప్రజలకు కూడా కల్తీ లేని, నాణ్యతతో కూడిన ఆహార ఉత్పత్తులు లభిస్తాయని తెలిపారు. రాష్ట్రంలో జల విప్లవం ఫలితంగా లక్షలాది ఎకరాలు సాగులోకి రావడంతోపాటు నీలి విప్లవం(మత్స్య పరిశ్రమ), గులాబీ విప్లవం (మాంస ఉత్పత్తి పరిశ్రమ) శ్వేత విప్లవం (పాడి పరిశ్రమ) అభివృద్ధి చెందుతున్నాయని కేటీఆర్‌ పేర్కొన్నారు. సీఎం సూచనల మేరకు గ్రామం, మండలం, జిల్లా స్థాయిలో క్రాప్‌ మ్యాపింగ్‌ పూర్తి చేసినట్లు వెల్లడించారు. వరి, పత్తి, మొక్కజొన్న, పప్పుధాన్యాలు, సుగంధ ద్రవ్యాల ఉత్పత్తితో పాటు గొర్రెలు, చేపల పెంపకం కూడా గణనీయంగా పెరిగిందని వివరించారు.

భవిష్యత్తులో సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉండటంతో ఆహారశుద్ధి రంగంలో పరిశ్రమలను ప్రోత్సహించడం ద్వారా రైతులకు ఆర్థిక స్వావలంబన, యువతకు ఉపాధి లభిస్తుందని వెల్లడించారు. రాష్ట్రంలో ఆహారశుద్ధి పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు అవసరమైన రాయితీలు, ప్రోత్సాహకాలను నూతన పాలసీలో ప్రతిపాదిస్తున్నామని ఆయన తెలిపారు. స్వయం సహాయక సంఘాలు, సహకార సంఘాలు, దళిత, గిరిజన, మైనారిటీ, యువత, మహిళలకు ప్రత్యేక రాయితీలు ఉంటాయని వివరించారు. బాల్కొండ నియోజకవర్గంలోని స్పైస్‌ పార్క్‌లో పసుపు ఆధారిత పరిశ్రమలు నెలకొల్పాలని, ఆర్మూర్‌ నియోజకవర్గంలోని లక్కంపల్లి సెజ్‌లో సోయా, మక్కల ఆహారశుద్ధి కర్మాగారాలు ఏర్పాటు చేయాలని మంత్రులు కేటీఆర్‌ను కోరగా.. ఆయన సుముఖత వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్, ప్రణాళిక బోర్డు వైస్‌ చైర్మన్‌ వినోద్‌ కుమార్, ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌ శర్మ తదితరులు పాల్గొన్నారు.

మంత్రులు చేసిన సూచనలివే..

  • పౌల్ట్రీ, మాంసం ఉత్పత్తి, చేపల ప్రాసెసింగ్‌ రంగాలకు సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెంచడంతో పాటు ఆయా రంగాల్లో యాంత్రీకరణ ప్రోత్సహించాలి. గిరిజన ప్రాంతాల్లో చిన్నతరహా ఆహార శుద్ధి పరిశ్రమలను ప్రోత్సహించడంతో పాటు దళిత, మహిళా పారిశ్రామికవేత్తలకు అవకాశాలు దక్కేలా చూడాలి.
  • తెలంగాణ బ్రాండ్‌ పేరిట నాణ్యమైన ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అయ్యేలా చూడటంతో పాటు, ఆహార కల్తీని అరికట్టాలి. పాలు, పాల ఉత్పత్తుల రంగంలో ఉన్న అవకాశాలను ఉపయోగించుకోవాలి.
  • నూనె గింజల ఉత్పత్తిని పెంచడంతో పాటు ఆధునిక నూనె మిల్లులకు ప్రోత్సాహం ఇవ్వాలి. పళ్లు, కూరగాయల ప్రాసెసింగ్‌ పరిశ్రమల స్థాపన ద్వారా వృ«థా తగ్గి రైతులకు లాభం జరుగుతుంది.
మరిన్ని వార్తలు