రెండు ఊపిరితిత్తుల మార్పిడి.. ప్రపంచంలో అరుదైన ట్రాన్స్‌ప్లాంట్‌

14 Oct, 2023 02:27 IST|Sakshi

విజయవంతంగా రెండు ఊపిరితిత్తుల మార్పిడి

పురుగుల మందు తాగిన యువకుడికి నిర్వహణ

ప్రపంచంలో 4వ అరుదైన ట్రాన్స్‌ప్లాంట్‌

యశోద ఆస్పత్రి ఘనత  

సికింద్రాబాద్‌, రాంగోపాల్‌పేట్‌: విషం తాగి తీవ్ర ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లిన ఓ యువకుడికి యశోద ఆస్పత్రి వైద్యులు అరుదైన ఆపరేషన్‌తో ప్రాణం పోశారు. ఒకేసారి డబుల్‌ లంగ్స్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ను విజయవంతంగా చేసి చరిత్ర సృష్టించారు. ప్రపంచంలో ఇలాంటి శస్త్ర చికిత్స నాలుగవది కావడం గమనార్హం. శుక్రవారం సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆస్పత్రి డైరెక్టర్‌ గోరుకంటి పవన్, సీనియర్‌ ఇంటర్వెన్షనల్‌ పల్మనాలజిస్టు డాక్టర్‌ హరికిషన్‌లు వివరాలను వెల్లడించారు.

మహబూబాబాద్‌ జిల్లా మర్రాయిగూడెంకు చెందిన 23 ఏళ్ల రోహిత్‌ గత నెలలో వ్యక్తిగత కారణాలతో పురుగుల మందు తాగి, ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లడంతో అతన్ని సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రిలో చేర్చారు. విషం ఊపిరితిత్తుల్లోకి వెళ్లి కోలుకోలేని పల్మనరీ ఫైబ్రోసిస్‌ పరిస్థితి ఏర్పడింది. అలాగే కిడ్నీలు, కాలేయం కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఆయనకు మెకానికల్‌ వెంటిలేటర్స్‌ వైద్యం అందించిన తర్వాత 20 రోజులకు పైగానే ఎక్మోపై చికిత్స అందించారు. అయినా ఊపిరితిత్తుల పనితీరు మెరుగుపడలేదు. దీంతో రెండు ఊపిరితిత్తులను మారిస్తేనే యువకుడి ప్రాణాలు నిలబెట్టవచ్చని వైద్యులు బావించారు.

కానీ భారతదేశంలో ఇలాంటి కేసుల్లో ఎక్మో వరకు వెళ్లి ప్రాణాలతో బయటపడిన వాళ్లు లేరు. శరీరంలో ఎటువంటి పురుగుల మందు అవశేషాలు లేవని నిర్ధారించుకున్నాక ఊపిరితిత్తుల మారి్పడి కోసం జీవన్‌దాన్‌లో నమోదు చేశారు. జీవన్‌దాన్‌ చొరవతో ఇంటర్వెన్షనల్‌ పల్మనాలజిస్టు డాక్టర్‌ హరికిషన్, థొరాసిక్‌ లంగ్‌ ట్రాన్స్‌ప్లాంట్‌ సర్జన్‌ డాక్టర్‌ కేఆర్‌ బాల సుబ్రహ్మణ్యం, డాక్టర్‌ మంజునాథ్‌ బాలే, డాక్టర్‌ చేతన్, డాక్టర్‌ శ్రీచరణ్, డాక్టర్‌ మిమి వర్గీస్‌లతో కూడిన బృందం ఆరు గంటల పాటు శ్రమించి విజయవంతంగా రెండు ఊపిరితిత్తులను మార్చారు. సంపూర్ణమైన ఆరోగ్యంతో రోహిత్‌ను డిశ్చార్జ్‌ చేసినట్లు వైద్యులు తెలిపారు.
 

మరిన్ని వార్తలు