అనూహ్యంగా పెరిగిన చలి.. అఫెలియన్‌ ఎఫెక్ట్‌పై సోషల్‌ మీడియాలో పోస్ట్‌ వైరల్‌ 

12 Jul, 2022 08:32 IST|Sakshi

దగ్గు, జలుబు, గొంతునొప్పితో ఇబ్బందులు

అసాధారణం కాదు అంటున్న నిపుణులు

సాక్షి, సిటీబ్యూరో: 'వాతావరణంలో ఏర్పడుతున్న ప్రత్యేక పరిస్థితి కారణంగా గత శుక్రవారం నుంచి అనూహ్యంగా చలి పెరిగింది. ఈ చలి తీవ్రత వల్ల  నెలన్నర రోజుల పాటు ప్రజలకు రకరకాల అనారోగ్య సమస్యలు తలెత్తనున్నాయి’. ఈ మేరకు వాట్సాప్, ఫేస్‌బుక్‌ తదితర మాధ్యమాలలో సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. అందుకు తగ్గట్టే ఆకస్మికంగా తీవ్రమైన చలి, దగ్గు, జలుబు ఇతరత్రా ఆరోగ్య సమస్యలు కనిపిస్తున్న నేపథ్యంలో ఈ పోస్టు చర్చనీయాంశంగా మారింది.

భూమితో సహా అన్ని గ్రహాలు సూర్యుని చుట్టూ తిరుగుతాయనేది తెలిసిందే. అలా తిరిగే క్రమంలో  సంవత్సరానికి ఒకసారి సూర్యుడి నుంచి భూమి నిర్ధిష్ట దూరం కన్నా ఎక్కువ దూరంగా జరుగుతుంది.  దీనిని అఫెలియన్‌ స్థితి అని పేర్కొంటారు. 

చలి పెరిగి...అనారోగ్యం కలిగి.. 
సూర్యుడి నుంచి భూమి  దూరంగా కదులుతున్న నేపథ్యంలో  చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం సహజంగానే ఉంటుంది. ఈ రకమైన అఫెలియన్‌ స్థితి గురువారం ఉదయం 5.27 గంటలకు ప్రారంభమైందనీ, ప్రాంతాలను బట్టి ఒక్కో చోట ఒక్కో సమయంలో దీని ప్రభావం ప్రారంభమవుతుందని సోషల్‌ సందేశాలు చెబుతున్నాయి.

అలాగే ఈ పరిస్థితి  ఆగస్ట్‌ 22న ముగుస్తుందనీ అంటున్నారు. భూమికి సూర్యునికి మధ్య దూరం సాధారణం కంటే 6.6 శాతం ఎక్కువ కావడం  వల్ల ఈ అఫెలియన్‌ కాలంలో చలి బాగా పెరిగి, దీంతో ఒళ్లు నొప్పులు, జ్వరం, దగ్గు, శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయని చెబుతున్నారు.  కావున  వెచ్చని వస్త్రాలు ధరించాలని, రోగనిరోధక శక్తిని పెంచడానికి విటమిన్లు,  సప్లిమెంట్లను వినియోగించాలని సూచనలు కూడా జోడిస్తున్నారు.  

వాస్తవం ఉందా? శాస్త్రవేత్తలు ఏమంటున్నారు? 
దీనిపై నగరానికి చెందిన వాతావరణ నిపుణులొకరు మాట్లాడుతూ...ఇప్పటికే నాసా దీనిపై స్పష్టత ఇచ్చిందన్నారు. నేషనల్‌ ఏరోనాటిక్స్‌ అండ్‌ స్పేస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (నాసా) ప్రకారం, భూమికీ సూర్యునికీ మధ్య సగటు దూరం దాదాపు 150 మిలియన్‌ కిమీ కాగా, అఫెలియన్‌ సమయంలో అది దాదాపు 152 మిలియన్‌ కి.మీ.కి చేరుతుందనీ, ఈ వ్యత్యాసం ఉష్ణోగ్రతపై ప్రభావం చూపడానికి సరిపోదన్నారు.  నిజానికి అఫెలియన్‌ అనేది  ఏటేటా సర్వసాధారణంగా ఏర్పడే పరిస్థితేనన్నారు.

భూమి దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరుగుతున్నందున, సూర్యుడు భూమి మధ్య దూరం సంవత్సరం పొడవునా మారుతూ ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. అదేవిధంగా, భూమి సాధారణం కన్నా ఎక్కువగా సూర్యుడికి దగ్గరగా వచ్చినప్పుడు  పెరిహెలియన్‌ స్థితి అంటారనీ , అఫెలియన్‌ సాధారణంగా ప్రతి సంవత్సరం జూలై 6న ప్రారంభమైతే,  జనవరి 2వ తేదీన పెరిహెలియన్‌ ప్రారంభమవుతుందని వెల్లడించారు. వీటివల్లనే ఆరోగ్య సమస్యలు వస్తాయనేందుకు ఎటువంటి రుజువులు లేవన్నారు.  

వాతావరణ మార్పులతోనే ఆరోగ్య సమస్యలు 
బంజారాహిల్స్‌: వానాకాలంలో వాతావరణ మార్పుల వల్ల విస్తరించే వైరస్‌లను ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సోమవారం జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం. 36లోని ‘మా’ఈఎన్‌టీ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈఎన్‌టీ చీఫ్‌ సర్జన్‌ డాక్టర్‌ కే.ఆర్‌. మేఘనాథ్‌ మాట్లాడారు. ప్రస్తుతం జ్వరం, జలుబు, చెవి, గొంతు నొప్పి, దగ్గులకు  వైరస్‌ కారణంగా ఆయన చెప్పారు.  మాస్క్‌ ధరించే అలవాటు కొనసాగించడం వల్ల  ఈ వైరస్‌  వ్యాప్తి చెందదన్నారు. జలుబు, దగ్గు తదితర సమస్యలు తీవ్రంగా లేకపోతే ఆవిరి పట్టడం, కషాయం వంటివి ఉపకరిస్తాయన్నారు.  మనం తినే ఆహారంలో విటమిన్లు, మినరల్స్‌ ఉండేలా చూసుకుంటే రోగాలతో పోరాడేందుకు మరింత శక్తి సమకూరుతుందన్నారు. 
- డాక్టర్‌ కేఆర్‌ మేఘనాథ్‌

>
మరిన్ని వార్తలు