వేపా.. వేపా.. ఎందుకు ఎండుతున్నావ్‌?

1 Nov, 2021 00:50 IST|Sakshi
చౌటుప్పల్‌లో తెగులు సోకి ఎండిపోయిన వేపచెట్టు

చీడపీడలకు విరుగుడుగా పనిచేసే వేపపైనే తెగుళ్ల దాడి 

‘టీ మస్కిటో బగ్‌’ఫంగల్‌ వ్యాధి సోకి మాడిపోతున్న వైనం  

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కలకలం  

వాతావరణ మార్పుల ప్రభావమూ ఓ కారణమంటున్న నిపుణులు

సాక్షి, హైదరాబాద్‌: కాలుష్యం జడలు విప్పుతోంది. ఫలితంగా జీవవైవిధ్యం దెబ్బతింటోంది. అనూహ్య వాతావరణ మార్పులు అనంతజీవరాశి మనుగడపై ప్రభావం చూపుతున్నాయి. వాతావరణ మార్పుల ప్రభావం దేన్నీ వదలడం లేదు. చీడపీడలకు విరుగుడుగా ఉపయోగపడే చెట్లు కూడా క్రమంగా కొత్త వ్యాధులు, తెగుళ్ల బారిన పడుతున్నాయి. చిన్నపిల్లలకు అమ్మవారు పోస్తే అది నయం కావడానికి వేప ఆకులు, వేపమండలపై వారిని పడుకోబెట్టడం, వేపాకులు, పసుపునీళ్లతో స్నానం చేయించడం వంటి వి చేయిస్తుంటారు.

అలాంటి వేప చెట్టుకు సాధారణంగా రోగాలు, తెగుళ్లు దరిచేరవనేది జనంలో ఒక అభిప్రాయం ఉంది. అయితే ఇటీవల వేపచెట్టుకు తెగుళ్లు ఏర్పడటంతో ఆకులు, కొమ్మలు ఎండిపోవడం, కొన్నిచోట్ల గోధుమ వర్ణంలోకి మారడం కనిపిస్తోంది. ఇలా తెగుళ్లు సోకి మూడునెలల్లోనే వేపచెట్టు నిర్జీవంగా తయారవుతోంది. జీవాయు«ధంగా పేరు గాంచిన వేపచెట్లు ఇటీవల రెండు తెలుగు రాష్ట్రాల్లో చీడపీడలు, తెగుళ్ల బారిన పడి మాడిపోతున్నాయి. ముఖ్యంగా తేయాకు తోటల్లో కనిపించే తెగులు ఈ వేపచెట్లపై దాడి చేస్తున్నట్లు నిపుణులు గుర్తించారు.  

వివిధ రకాల ఫంగస్‌లతో... 
మలేరియా, ఫంగస్, వైరల్‌ జ్వరాలపై పోరాడేతత్వమున్న వేపచెట్లను కొత్తగా ‘ట్విగ్‌ బ్లైట్‌ అండ్‌ డై బాక్‌’, ‘టీ మస్కిటో బగ్‌’తదితర ఫంగల్‌ వ్యాధులు అతలాకుతలం చేస్తున్నాయి. గాలి ద్వారా ఓ రకమైన బ్యాక్టీరియా వ్యాప్తి చెందడం వల్ల ఇది వేగంగా విస్తరిస్తున్నట్టుగా వెల్లడైంది. సాధారణంగా తేయాకు తోటల్లో కనిపించే ‘టీ మస్కిటో బగ్‌’తెగుళ్లు, ఫంగస్‌ వ్యాధులు ఇప్పుడు వేపచెట్లపై ప్రతాపం చూపుతున్నాయి. ఈ తెగుళ్లకు కారణమైన ఈ కీటకాల జీవితకాలం 25–32 రోజులు మాత్రమే.

ఇవి కోకొవా, అల్లనేరేడు, చింత, మిరియాలు, పత్తి, చెక్క, తదితర రకాలను సైతం ప్రభావితం చేస్తున్నాయి. ఔషధ విలువలున్న వేపచెట్లను కాపాడుకుని పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో కనిపిస్తున్న విధంగా డైబ్యాక్‌ డిసీజ్‌ విస్తృతంగా వ్యాప్తి చెం దితే వేపచెట్లు తీవ్రంగా ప్రభావితమౌతాయని తెలంగాణ వ్యవసాయ వర్సిటీ బాటనీ అధ్యాపకులు, వ్యవసాయ పశుసంవర్థక శాఖ అధికారులు చెబుతున్నారు.

చీడపీడలు, తెగుళ్లు సోకిన మేరకు వేప కొమ్మలను నరికి బాబిస్టిన్‌ను పిచికారి చేయడం లేదా గోరింటాకును ముద్దగా చేసి నరికిన కొమ్మలకు అంటించడం ద్వారా వీటి వ్యాప్తిని నియంత్రించి చెట్టు అవసాన దశకు చేరకుండా అడ్డుకోవచ్చని సూచిస్తున్నారు.  

వేప చెట్లను కాపాడండి: గూడూరు 
రాష్ట్రంలో అంతుచిక్కని తెగులు, వ్యాధితో ఎండిపోతున్న వేపచెట్లను కాపాడేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని బీజేపీ నేత గూడూరు నారాయణరెడ్డి ఒక ప్రకటనలో కోరారు. రాష్ట్రంలోని పలుచోట్ల వేపచెట్లు, వాటి ఆకులు, కొమ్మలు ఎండిపోయి పసుపు, గోధుమ రంగులోకి మారుతూ క్షీణించడంపై ఆందోళన వ్యక్తం చేశారు. వేపచెట్లు చాలా ఔషధ విలువలు కలిగి ఉన్నందున పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

‘గత మూడు రోజుల్లో తమ ఇంటి ప్రాంగణంలో మూడు వేప చెట్లు అకస్మాత్తుగా ఎండిపోయాయి’అని పేర్కొన్నారు. అటవీ శాఖ తక్షణమే ముందుకు వచ్చి ఈ పరిణామాలకు గల కారణాలను గుర్తించాలని కోరారు. హరితహారం కార్యక్రమానికి ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నప్పటికీ గాలిని శుద్ధి చేయడంలో కీలకపాత్ర పోషిస్తున్న వేపచెట్లను సంరక్షించడం లేదని, వేప చెట్లను సంరక్షించకుంటే హరితహారం కార్యక్రమం వృథా అని పేర్కొన్నారు.  

మరిన్ని వార్తలు