సూయజ్‌కు ఎందుకంత ప్రాధాన్యం, మీకీ విషయాలు తెలుసా?

29 Mar, 2021 04:54 IST|Sakshi

సూయజ్‌ కెనాల్‌లో ఒక్క భారీ నౌక చిక్కుకుపోతే ప్రపంచమంతటా సంచలనంగా మారింది. ఇది జరిగి ఆరేడు రోజులే.. ఒకప్పుడైతే కొన్ని నౌకలు ఏకంగా ఎనిమిదేళ్లపాటు అక్కడ చిక్కుకుపోయాయి.. ఆ విషయం మీకు తెలుసా?  

1967 జూన్‌లో 14 కార్గో నౌకలు సూయజ్‌ కాల్వలో ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా పొరుగు దేశాలైన ఇజ్రాయెల్, ఈజిప్టు మధ్య యుద్ధం మొదలైంది. యుద్ధం జరిగింది కొన్ని రోజులే.. కానీ కాల్వ మూసేయడంతో నౌకలు మాత్రం ఎనిమిదేళ్లు అక్కడే చిక్కుకుపోయాయి. 

ఇంతకీ జగడమెందుకు?
సూయజ్‌ కెనాల్‌.. కేవలం సరుకు రవాణాకే కాదు.. సుమారు శతాబ్దం పాటు ప్రపంచ రాజకీయాల్లో ఆధిపత్యానికీ కేంద్రంగా నిలిచింది. ఇంగ్లాండ్, ఫ్రాన్స్, డచ్‌ వంటి యూరప్‌ దేశాలు వ్యాపారం పేరిట ఆసియా దేశాలను ఆక్రమించినప్పటి సమయం అది. ఆ దేశాల వారు ఆఫ్రికా ఖండం చుట్టూ తిరిగి దక్షిణాసియా దేశాలకు చేరాల్సి వచ్చేది. ఈ ప్రయాణానికి చాలా సమయం పట్టేది. ఖర్చు ఎక్కువగా అయ్యేది.

ఆ క్రమంలోనే మధ్యధరా సముద్రం నుంచి హిందూ మహా సముద్రానికి మార్గం కలిపేందుకు.. 1859లో ఈజిప్ట్‌ మీదుగా 193 కిలోమీటర్ల పొడవునా భారీ కాల్వ తవ్వడం మొదలుపెట్టారు. దీనికోసం ఫ్రాన్స్‌ ఎక్కువగా ఖర్చుపెట్టింది, బ్రిటన్‌ కూడా జత కలిసింది. 1869 నుంచి నౌకలు వెళ్లడం మొదలైంది. అప్పటి నుంచీ సూయజ్‌ కాల్వ మీద ఫ్రాన్స్, బ్రిటన్‌ల పెత్తనం కొనసాగింది. 1956లో ఈజిప్ట్‌ అధ్యక్షుడు నాజర్‌ సూయజ్‌ కాల్వను పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు. ఆ టైంలోనే ఈజిప్ట్‌పై ఆంక్షలు, పొరుగు దేశాలతో యుద్ధాలు వంటివి జరిగాయి.
(చదవండి: సూయజ్ కెనాల్‌లో అడ్డం తిరిగిన భారీ నౌక.. గంటకు 3వేల కోట్ల నష్టం)

కాల్వలో పడవలు ముంచి.. 
యుద్ధం తర్వాతి ఉద్రిక్తతలు ఎఫెక్ట్‌ సూయజ్‌ కెనాల్‌పై పడింది. కాల్వను మూసేయాలని ఈజిప్ట్‌ నిర్ణయించింది. కొన్ని పడవలను ముంచేసి, మట్టి, ఇసుక వంటివి వేసి అక్కడక్కడా కాల్వలో అడ్డంకులు కల్పించారు. దాంతో అప్పటికే ప్రయాణిస్తున్న నౌకలన్నీ కాల్వ మధ్యలో చిక్కుకుపోయాయి. గాలుల వల్ల పక్కనే ఉన్న ఎడారి నుంచి వచ్చిన ఇసుక, దుమ్ముతో నౌకలు నిండిపోయాయి. దీనినే ‘ది యెల్లో ఫ్లీట్‌ (పసుపు దళం)’గా పిలుస్తారు.

మళ్లీ యుద్ధంతోనే తెరుచుకుని.. 
యుద్ధంతో మూతపడిన సూయజ్‌ కాల్వ తిరిగి తెరుచుకోవడానికి కూడా మరో యుద్ధమే కారణమైంది. 1973లో ఈజిప్ట్, ఇజ్రాయెల్‌ మధ్య మరోసారి యుద్ధం జరిగి.. రెండు దేశాలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో పడిపోయాయి. ఆ దెబ్బతో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ పరిస్థితే 1975లో కెనాల్‌ను తిరిగి ఓపెన్‌ చేయడానికి మార్గం సుగమం చేసింది. 

ఏడు వేల కిలోమీటర్లు తిరిగిపోవాలి 
ప్రపంచంలో 70 శాతానికిపైగా జనాభా ఉన్న యూరప్, ఆసియా దేశాల మధ్య వాణిజ్యానికి సూయజ్‌ కాల్వ ఎంతో కీలకం. మొత్తం ప్రపంచ వాణిజ్యంలో 15 శాతం వరకు ఈ కాల్వ మీదుగానే జరుగుతుంది. ఈ కాల్వ లేకుంటే ఆసియా, యూరప్‌ ఖండాల మధ్య ప్రయాణించే నౌకలు.. మొత్తంగా ఆఫ్రికా ఖండం చుట్టూ వేల కిలోమీటర్లు అదనంగా తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. ఆ మార్గాన్ని ‘కేప్‌ ఆఫ్‌ గుడ్‌ హోప్‌’ రూట్‌ అంటారు.

మన ముంబై నుంచి లండన్‌కు సూయజ్‌ కాల్వ మీదుగా వెళితే 11,600 కిలోమీటర్ల దూరం వస్తుంది. వాతావరణం, ఇతర అంశాల పరంగా ఇది భద్రమైన మార్గం. అదే కేప్‌ ఆఫ్‌ గుడ్‌ హోప్‌ మీదుగా వెళితే ఏకంగా 19,800 కిలోమీటర్లకుపైగా ప్రయాణించాల్సి ఉంటుంది. అంతేకాదు ఆ మార్గంలో తుపానులు, ఇతర సమస్యలు ఎన్నో ఉంటాయి. నౌకలకు ప్రమాదకరం కూడా. అందుకే సూయజ్‌ కాల్వకు ఇంత ప్రాధాన్యత.  
– సాక్షి సెంట్రల్‌ డెస్క్‌ 

మరిన్ని వార్తలు