మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హత్య కుట్ర కేసు: కీలక విషయాలను వెల్లడించిన నిందితుడు

4 Mar, 2022 03:02 IST|Sakshi

మంత్రి హత్యకు కుట్ర వ్యవహారంలో రాఘవేందర్‌రాజు వెల్లడి! 

తప్పుడు కేసులు పెట్టించి, కుటుంబాన్ని బాధపెట్టాడని ఆరోపణ 

నిందితులను కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టులో పోలీసుల పిటిషన్‌ 

సాక్షి, హైదరాబాద్‌:  తన వ్యాపారాలను దెబ్బతీసి, ఆర్థికంగా నష్టం కలిగించడంతోనే మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హత్యకు కుట్ర పన్నినట్టుగా.. ఈ కేసులో కీలక నిందితుడు రాఘవేందర్‌రాజు వెల్ల డించినట్టు సమాచారం. ఈ మేరకు పోలీసుల విచారణలో కీలక అంశాలను బయటపెట్టినట్టు తెలిసింది. మంత్రి తనతోపాటు తన కుటుం బాన్ని అనేక రకాలుగా ఇబ్బందులకు గురిచేశాడని పేర్కొన్నట్టు సమాచారం. తన స్థిరాస్తి  వ్యాపారాన్ని దెబ్బతీశాడని, తనకున్న బార్‌ను మూసి వేయించాడని, తన ఆధార్‌ ఎన్‌రోల్‌మెంట్‌ సెంటర్‌ను రద్దు చేయించాడని వివరించినట్టు తెలిసింది. అంతేగాకుండా తనపై అక్రమంగా ఎక్సైజ్‌ కేసులు నమోదు చేయించినట్టుగా పేర్కొన్నట్టు  సమాచారం. ఈ క్రమంలోనే మంత్రి హత్యకు కుట్ర పన్నినట్టుగా నిందితుడు రాఘవేందర్‌రాజు వెల్లడించినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. కాగా.. ఈ కేసుకు సంబంధించి ఢిల్లీలో అరెస్టు చేసిన నిందితులు రాఘ వేందర్‌రాజు, రవి, మధుసూదన్‌రాజు, అమరేందర్‌రాజులను పేట్‌ బషీరాబాద్‌ పోలీసులు గురువారం ఉదయం కోర్టులో హాజరుపర్చారు. అనంతరం మంత్రి హత్యకు కుట్ర వ్యవహారంలో పూర్తి వివరాలు రాబట్టేందుకు ఎనిమిది మంది నిందితులను వారం రోజులు కస్టడీ కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు. 

మీడియాతో మాట్లాడకుండా..  
మంత్రి హత్యకు కుట్ర ఘటన, ఇతర అంశాలకు సంబంధించి పోలీసు అధికారులెవరూ మీడియాతో మాట్లాడలేదు. తమకు తెలియకుండా మీడియాకు ఎటువంటి సమాచారం ఇవ్వొద్దని ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చినట్టు పోలీసు వర్గాలు తెలిపాయి. కాగా ఫరూక్, హైదర్‌ అలీలపై హత్యయత్నానికి సంబంధించి సుచిత్ర చౌరస్తాలో లాడ్జిలో సీసీ పుటేజీ ఆధారాల కోసం పోలీసులు వెళ్లగా.. హార్డ్‌డ్రైవ్‌ పనిచేయడం లేదని గుర్తించినట్టు తెలిసింది. 

పోలీసుల రిపోర్టులో ఏముంది? 
మొదట ఫరూక్, హైదర్‌ అలీలపై జరిగిన హత్యాయత్నం, అనంతరం మంత్రి హత్యకు చేసిన కుట్ర బయటపడటం వరకు వివరాలను పేట్‌బషీరాబాద్‌ పోలీసులు తమ రిపోర్టులో పేర్కొన్నారు. ‘‘మహబూబ్‌నగర్‌కు చెందిన రాఘవేందర్‌రాజు, ఆయన సోదరుడు నాగరాజు కలిసి బార్‌ వ్యాపారం నిర్వహిస్తుంటాడు. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హత్యకు కుట్రకేసులో సైబరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేసిన అమరేందర్‌రాజు, మధుసూదన్‌రాజు కూడా వారి సోదరులే. మహబూబ్‌నగర్‌ టీచర్స్‌ కాలనీకి చెందిన బంగారం షాపు వ్యాపారి గులాం హైదర్‌అలీ జిల్లాకు చెందిన ఓ వీఐపీ మద్దతుతో రాఘవేందర్‌రాజు బార్‌ వ్యాపారాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు. తరచూ ఆబ్కారీ అధికారులకు ఫిర్యాదు చేయడం, ఆర్ధికంగా నష్టం కలిగించే చర్యలకు పాల్పడటం చేసేవాడు.

తన వ్యాపారాలకు హైదర్‌అలీ అడ్డు తగులుతుండటాన్ని సహించలేకపోయిన రాఘవేందర్‌రాజు ఎలాగైనా అతడిని అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇదే విషయాన్ని స్థానికులైన దండేకర్‌ విశ్వనాథ్‌రావు, వరద యాదయ్యలకు వివరించాడు. వారు అవసరమైన ఆయుధాలను సమకూర్చే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే గతేడాది నవంబర్‌ 18న మహబూబ్‌నగర్‌ ఎక్సైజ్‌ కోర్టు హాజరైన ఫరూక్‌ను రాఘవేందర్‌రాజు, నాగరాజు కలుసుకున్నారు. హైదర్‌అలీని చంపేందుకు ఆయుధాలు సమకూర్చాలని కోరారు. కానీ హైదర్‌అలీ తన స్నేహితుడే కావటంతో ఫరూక్‌ ఈ విషయాన్ని అతడికి తెలిపాడు. ఈ క్రమంలో వారిద్దరూ ప్రాణభయంతో గతనెల 23న హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్‌ లాడ్జిలో దిగారు. 25న వారిపై నాగరాజు, విశ్వనాథ్‌రావు, యాదయ్య హత్యాయత్నం చేయగా.. ఫరూక్, హైదర్‌అలీ తప్పించుకొని పేట్‌బషీరాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా.. రాఘవేందర్‌రాజు సూచన మేరకే హత్యకు ప్రయత్నించామని తెలిపారు. అదే సమయంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హత్యకు రాఘవేందర్‌రాజు కుట్ర పన్నుతున్నట్టు నాగరాజు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఫోన్‌ లొకేషన్ల ఆధారంగా రాఘవేందర్‌రాజు, అమరేందర్‌రాజు, మధుసూదన్‌రాజు, ఇతరులను ఢిల్లీలో అదుపులోకి తీసుకున్నారు.’’ అని పోలీసులు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు. 

ఆయుధాలు ఎవరి హత్య కోసం? 
నిందితులైన రాఘవేందర్‌రాజు నుంచి రెండు బుల్లెట్లు ఉన్న పిస్టల్, మున్నూరు రవి నుంచి ఆరు బుల్లెట్లు ఉన్న రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు ప్రకటించారు. అయితే ఈ ఆయుధాలను హైదర్‌ అలీని చంపేందుకు సిద్ధం చేసుకున్నారా? లేక మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హత్య కోసం కొనుగోలు చేసినవా అనేది పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది. అంతేగాకుండా ఈ వ్యవహారంలో మరో ఇద్దరు నేతల అనుచరుల హస్తమున్నట్టు ఆరోపణలున్నాయి. ఈ క్రమంలోనే నిందితులను కస్టడీలోకి తీసుకొని విచారించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. 
 
ఫరూక్‌ దొరికినప్పుడే బయటపడితే.. 
మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హత్యకు కుట్ర వ్యవహారంలో కీలకంగా ఉన్న ఫరూక్‌ అహ్మద్‌ కరుడుగట్టిన నేరగాడని పోలీసు వర్గాలు చెప్తున్నాయి. మంత్రి హత్య కోసం సుపారీ తీసుకున్న ఫరూక్‌.. ఆ తర్వాత నెల రోజులకే అక్రమ ఆయుధాలతో సైబరాబాద్‌ స్పెషల్‌ ఆపరేషన్‌ టీమ్‌కు (ఎస్‌ఓటీ) చిక్కాడు. ఎస్‌ఓటీ పోలీసులు గగన్‌పహాడ్‌లోని అతడి ఇంటిపై దాడి చేసి.. రెండు నాటు తుపాకులు, 44 తూటాలను కూడా స్వాధీనం చేసుకుని, ఫరూక్‌ను అరెస్టు చేశారు. తర్వాత అతను బెయిల్‌పై విడుదలయ్యాడు. అయితే ఫరూక్‌ ఆయుధాలు ఎందుకు వినియోగిస్తున్నాడు? వాటితో ఏం చేయదల్చుకున్నాడనే వివరాలు రాబట్టడంలో ఎస్‌ఓటీ, ఆర్‌జీఐఏ పోలీసులు నిర్లక్ష్యం వహించినట్టు విమర్శలు వస్తున్నాయి. లేకుంటే మంత్రి హత్యకు కుట్ర విషయం అప్పుడే బయటపడి ఉండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

కరుడుగట్టిన నేరస్తుడే.. 
ఫరూక్‌ అహ్మద్‌ అలియాస్‌ జావిద్‌ అలియాస్‌ సైతాన్‌ ఫరూఖ్‌ (44) స్వస్థలం మహబూబ్‌నగర్‌ అని.. కొన్నేళ్ల కింద హైదరాబాద్‌కు మకాం మార్చాడని పోలీసులు చెప్తున్నారు. స్థిరాస్తి వ్యాపారం పేరిట కొందరి నుంచి పెద్ద మొత్తంలో నగదు తీసుకొని మోసం చేసినట్టు స్థానికులు చెప్తున్నారు. 2016లో రాజేంద్రనగర్‌లో ఖదీర్‌ అనే వ్యక్తి నుంచి ఒక తుపాకీని కొనుగోలు చేసి.. ఒకేరోజు కల్వకుర్తి, మహబూబ్‌నగర్‌లో ఇద్దరు వ్యక్తులను హత్య చేసినట్టు ఆరోపణలున్నాయి. ఆ కేసులో జైలుకు వెళ్లి బెయిల్‌పై వచ్చిన ఫరూక్‌.. ఉత్తరప్రదేశ్‌ నుంచి ఆయుధాలను కొనుక్కొచ్చి, బెదిరింపులకు, దోపిడీలకు పాల్పడినట్టుగా వంగూరు, సైఫాబాద్, నాంపల్లి, జడ్చర్ల, హుమాయూన్‌నగర్, మహబూబ్‌నగర్, ఆర్‌జీఐఏ ఠాణాల్లో కేసులు నమోదయ్యాయి. 

మరిన్ని వార్తలు