కోవిడ్‌: 20 లక్షలు ఖర్చు చేసినా దక్కని ప్రాణాలు

3 Jun, 2021 08:18 IST|Sakshi
సాంబమూర్తి–మహిమలత(ఫైల్‌) 

అనాథలైన ఇద్దరు కూతుళ్లు

సాక్షి, పెద్దపల్లి: ‘పిల్లలూ త్వరలోనే ఆరోగ్యంగా ఇంటికి వస్తా.. భయపడొద్దు’.. అంటూ ధైర్యం చెప్పిన తల్లిని కరోనా కాటేసింది. కరోనాతో నాన్న చనిపోయిన విషయం అమ్మకు తెలియనివ్వలేదని, చికిత్సకు రూ.20లక్షలు పెట్టినా అమ్మానాన్న తమకు దక్కలేదని ఇద్దరు కూతుళ్లు బోరున విలపించారు. వారం వ్యవధిలో కరోనా భార్యాభర్తలను బలి తీసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. సుల్తానాబాద్‌ మండలం రేగడిమద్దికుంట గ్రామానికి చెందిన అయిల సాంబమూర్తి (48) హైదరాబాద్‌లో ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల అతడికి కరోనా సోకడంతో ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గత నెల 27న మృతిచెందాడు. ఈక్రమంలో అతడి భార్య మహిమలత (46) కూడా వైరస్‌ బారినపడింది.


కూతుళ్లు సుశ్మిత, హర్షిత 

కొన్ని రోజులు ఇంట్లోనే ఉంటూ మందులు వాడింది. పరిస్థితి విషమించడంతో ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం మృతిచెందింది. వీరి ఇద్దరు కూతుళ్లు సుశ్మిత, హర్షిత భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారింది. వైద్య ఖర్చులకు తోటి ఉద్యోగులు, హైదరాబాద్‌లో నివాసం ఉంటున్న కాలనీ వాసులు డబ్బులు సమకూర్చారని, దంపతులిద్దరికీ దాదాపు రూ.20లక్షలు ఖర్చు పెట్టినా బతకలేదని బంధువులు తెలిపారు. అనాథలైన ఇద్దరు పిల్లలను ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. కాగా గత మార్చి 14న సాంబమూర్తి–మహిమలత వివాహ వార్షికోత్సవాన్ని ఓదెల మండలం కొలనూర్‌ హైస్కూల్‌లో క్లాస్‌మెట్స్‌ ఘనంగా జరిపారు. దీనిని స్మరించుకుంటూ క్లాస్‌మెంట్స్‌ ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

కోవిడ్‌కు మరో ముగ్గురు బలి
రామగిరి మండలం సెంటినరికాలనీకి చెందిన చిరు వ్యాపారి మంచాల శ్రీనివాస్‌ కరోనాతో బుధవారం మృతిచెందాడు. గోదావరిఖని ప్రశాంత్‌నగర్‌కు చెందిన యాదగిరి గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలో, సంజయ్‌నగర్‌కు చెందిన కృష్ణ కరీంనగర్‌లో చికిత్స పొందుతూ మృతిచెందారు. 

చదవండి: Lockdown: కష్టాలు.. ట్రక్‌ డ్రైవర్‌గా మారిన నటి 

మరిన్ని వార్తలు