ఇలా చేస్తే అడవి అంటుకోదు!

2 Mar, 2021 09:06 IST|Sakshi

 అగ్ని ప్రమాదాల నుంచి అడవిని కాపాడేందుకు కార్యాచరణ 

సమస్యాత్మక ప్రాంతాల్లో ఫైర్‌లైన్స్‌ ఏర్పాటు నిమిషాల్లో ప్రమాద స్థలానికి చేరుకునేలా చర్యలు 

అనుక్షణం అందుబాటులో 6 ప్రత్యేక బృందాలు 

జిల్లాలో 2,611.39 చ.కి.మీ., మేర విస్తరించిన నల్లమల 

నాగర్‌కర్నూల్‌: అనుకోకుండా అడవులకు నిప్పు అంటుకుంటే జరిగే నష్టం ఊహించలేనిది. కేవలం వృక్ష సంపదనే కాకుండా అడవుల్లో పెరిగే పశుపక్షాదులు, జంతువులను కూడా నష్టపోవాల్సి ఉంటుంది. ప్రతియేటా ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అక్కడక్కడా మంటలు చెలరేగి కొంత మేర నష్టం కలుగుతూనే ఉంది. ముఖ్యంగా ప్రతి వేసవిలో శ్రీశైలం వెళ్లేదారిలో అక్కడక్కడా కొంత మంది పర్యాటకులు, సమీప గ్రామాలకు చెందినవారు పశువులను మేపే సమయంలో చేసే చిన్నచిన్న పొరపాట్ల వల్ల మంటలు పుట్టుకురావడంతో వాటిని ఆర్పేందుకు అధికారులు నానా తిప్పలు పడాల్సిన పరిస్థితి నెలకొంటుంది. అసలే వేసవిలో రాలిన ఆకులు ఎండిపోయి ఉండడంతో వేగంగా మంటలు వ్యాపించే అవకాశం ఉంది. అయితే ఈసారి అటవీ శాఖాధికారులు జిల్లావ్యాప్తంగా పొంచి ఉన్న అటవీ ప్రాంతాల్లో ఫైర్‌లైన్స్‌ ఏర్పాటు చేసి అగ్నిప్రమాదాలకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపట్టారు.   

అతిపెద్ద టైగర్‌ రిజర్వ్‌ ప్రాజెక్టు 
దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద టైగర్‌ రిజర్వ్‌ ప్రాజెక్టుగా అమ్రాబాద్‌ అభయారణ్యం గుర్తింపు పొందింది. ఇది 2,611.39 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉండగా ఇందులో 2,166.37 చదరపు కిలోమీటర్లు అభయారణ్యం కాగా, 445.02 చదరపు కిలోమీటర్లు బఫర్‌జోన్‌గా ఉంది. అయితే గతంతో పోలిస్తే ఈ ఏడాది అటవీ ప్రాంతాన్ని సంరక్షించేందుకు అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి చర్యలు తీసుకున్నారు. ఎక్కడైనా అగ్గి రాజుకుంటే మంటలు వ్యాపించకుండా ఫైర్‌లైన్స్‌ను ఏర్పాటు చేశారు. 3 మీటర్లు, 5 మీటర్ల వెడల్పుగా ఉండే ఫైర్‌లైన్స్‌ను ఏర్పాటు చేశారు. కేవలం నల్లమల్ల అభయారణ్యం మాత్రమే కాకుండా అటవీ ప్రాంతం విస్తరించి ఉన్న కొల్లాపూర్, లింగాల, అచ్చంపేట, అమ్మాబాద్‌ వంటి సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి మొత్తం 1,200 కిలోమీటర్ల మేరకు ఈ ఫై¯ర్‌లైన్స్‌ను ఏర్పాటు చేశారు. అంతే కాకుండా శ్రీశైలం వెళ్లేదారిలో పర్యాటకులు రోడ్డు పక్కన సేద తీరడానికి, భోజనాలు చేసేందుకు దాదాపు 222 కిలోమీటర్ల మేర వీవ్‌లైన్స్‌ను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా నల్లమల పరిధిలో ఎక్కడైనా మంటలు అంటుకుంటే వాటిని ఆర్పేందుకు వెంటనే అక్కడికి చేరుకునేలా 6 టీంలను ఏర్పాటు చేశారు. ఒక్కో టీంలో 5 మంది సిబ్బంది ఉండగా వారికి ఒక వాహనంతోపాటు మంటలను ఆర్పేందుకు ఆధునిక యంత్రాలను అందించారు. ఇక అటవీ ప్రాంతాల్లో ఉండే ఆయా గ్రామాలకు సంంధించిన ప్రజలు పశువులను మేపేందుకు అడవుల్లోకి వెళ్లి ధూమపానం చేసేందుకు అగ్గిరాజేయడం, వాటిని ఆర్పకుండా నిర్లక్ష్యం వహించడం వల్ల కూడా అడవికి మంటలు అంటుకునే ప్రమాదం ఉంది. ఈ విషయంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే ఆయా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. అడవిలో అగ్ని ప్రమాదాలతో జరిగే నష్టాలు, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే విధించే శిక్షలపై అవగాహన కల్పించారు. ప్రతిఏటా రూ.లక్షల్లో నిధులు ఖర్చు చేస్తున్నా ఎక్కడో ఒకచోట ప్రమాదాలు జరుగుతూనే ఉండగా ఈసారి అధికారులు తీసుకునే చర్యలు ఎంతమేర ఫలిస్తాయో వేచిచూడాలి. 

అవగాహన కల్పించాం..
అడవిలో ఎలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా అన్నిరకాలుగా రక్షణ చర్యలు చేపడుతున్నాం. సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అవసరమైన చోట ఫైర్‌లైన్స్‌ ఏర్పాటు చేశాం. ఎక్కడైనా నిప్పంటుకుంటే వెంటనే అక్కడికి చేరుకుని ఆర్పేలా 6 ప్రత్యేక ఫైర్‌టీంలను ఏర్పాటు చేశాం. అటవీ పరిసర ప్రాంతాల్లోని గ్రామాల ప్రజలకు కూడా ఈ విషయమే అవగాహన కల్పించాం. 
- కృష్ణగౌడ్, డీఎఫ్‌ఓ, నాగర్‌కర్నూల్‌ 
అమ్రాబాద్‌, అడవీ ప్రాంతం, ఎండకాలం, మంటలు, రిజర్వ్‌లు, అవగాహన

మరిన్ని వార్తలు