తెలంగాణలో భానుడి భగ భగలు.. కారణం ఇదేనా!

1 Apr, 2021 02:18 IST|Sakshi

రాష్ట్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలు 

42 డిగ్రీలకు చేరిన గరిష్ట ఉష్ణోగ్రత.. 

చాలాచోట్ల 40 డిగ్రీలకు పైనే నమోదు 

ఉత్తరాది నుంచి వడగాడ్పులు.. పెరిగిన ఉక్కపోత 

మరో నాలుగు రోజులు ఇదే తరహా వాతావరణం 

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల మేర ఎక్కువగా నమోదవుతున్నాయి. ఇదే సమయంలో వడగాడ్పులు, ఉక్కపోత పెరగడంలో జనం విలవిల్లాడుతున్నారు. బుధవారం భద్రాచలంలో రాష్ట్రంలోనే అధికంగా 42.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైందని.. ప్రస్తుత సీజన్‌లో ఇదే అత్యధికమని వాతావరణ శాఖ ప్రకటించింది. గతేడాది ఇదే సమయంలో 38.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు కాగా.. ఇప్పుడు ఏకంగా 3.9 డిగ్రీలు ఎక్కువగా నమోదుకావడం గమనార్హం. హైదరాబాద్, వరంగల్, దుండిగల్, హకీంపేట కేంద్రాల్లో మినహా రాష్ట్రమంతటా 40 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఇక కనిష్ట ఉష్ణోగ్రతల్లో ఆదిలాబాద్‌లో తక్కువగా 19.2 డిగ్రీలు నమోదైంది. మిగతా అంతటా 20 డిగ్రీల కంటే ఎక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 

ఉత్తరాది నుంచి వడగాడ్పులు 
రాష్ట్రానికి ఉత్తర దిశ నుంచి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయని.. ఎత్తు తక్కువగా ఉండడం, వాతావరణంలో తేమశాతం తగ్గడంతో ఇవి వడగాడ్పులుగా మారుతున్నాయని వాతావరణ శాఖ పేర్కొంది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్‌ గ్రామీణం, వరంగల్‌ పట్టణం, జనగామ, మహబూబ్‌ నగర్, నాగర్‌ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది. మరో నాలుగు రోజులు ఇదే తరహా వాతావరణం ఉంటుందని, గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల మేర ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించింది. 

జాగ్రత్తగా ఉండాలి.. 
మండుతున్న ఎండలు, వడగాడ్పుల ప్రభావం నేపథ్యంలో ప్రజలంతా జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఎండలో ఎక్కువ సమయం గడిపేవారు వడదెబ్బ బారినపడే అవకాశం ఉందని పేర్కొంది. వడదెబ్బ తగిలిన వారికి తక్షణమే చికిత్స అందించాలని.. చల్లటి గాలి తగిలే ప్రదేశంలో ఉంచి విశ్రాంతి ఇవ్వాలని సూచించింది. ఉప్పు, పంచదార కలిపిన చల్లటి నీళ్లను తాగించాలని.. వైద్యుల దగ్గరికి తీసుకెళ్లాలని పేర్కొంది. ఎండల తీవ్రతను తట్టుకొనేందుకు.. నూలు దుస్తులు ధరించడం, కళ్లజోడు పెట్టుకోవడం, బయటికి వెళ్లినప్పుడు గొడుగుని ఉపయోగించడం, చర్మానికి సన్‌స్క్రీన్‌ లోషన్‌ రాసుకోవడం వంటివి చేయాలని వైద్యులు సూచిస్తున్నారు. రోజువారీ ఆహారంలో ఆకుకూరలు, పండ్లు, ద్రవపదార్థాలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని చెప్తున్నారు. 

తెలుగు రాష్ట్రాల్లో ఎండలు కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరిక 
 ఆగ్నేయ బంగాళాఖాతం, దక్షిణ అండమాన్‌ సముద్రంలో తుపాను ప్రభావం కారణంగా వాతావరణంలో పలు మార్పులు జరుగుతున్నాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ప్రకటించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో రానున్న రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింతగా పెరుగుతాయని హెచ్చరించింది. తుపాను ప్రభావంతో అండమాన్‌ నికోబార్‌ దీవులు, ఆగ్నేయ బంగాళాఖాతం, ఈశాన్య రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లోనూ ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని వెల్లడించింది. ఏప్రిల్‌ 2, 3, 5 తేదీల్లో కోస్తా ఆంధ్ర, యానాంలలో ఉరుములతో కూడిన వర్షాలు పడతాయిని.. 30, 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.  

మరిన్ని వార్తలు