వరదగూడు..  కనువిందు చేసెను చూడు! 

3 Jun, 2021 03:34 IST|Sakshi

ఆకాశంలో ఆవిష్కృతమైన అద్భుతం 

సూర్యుడి చుట్టూ ఏర్పడిన ఇంద్ర ధనుస్సు 

కాంతి వక్రీభవనం వల్లే ఏర్పడిందంటున్న శాస్త్రవేత్తలు

సాక్షి, హైదరాబాద్‌: ఆకాశంలో అద్భుతం చోటుచేసుకుంది. ప్రచండ భానుడి చుట్టూ సప్తవర్ణశోభితమైన సుందర వలయం ఏర్పడింది. రాష్ట్రంలో సూర్యుడి చుట్టూ రంగురంగుల ఇంద్ర ధనుస్సు(సన్‌హాలో) బుధవారం మధ్యాహ్నం సుమారు గంట పాటు కనువిందు చేసింది. దీన్ని ప్రజలు తమ మొబైల్‌ ఫోన్లలో బంధించి, సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్‌ చేశారు. ‘వరదగూడు’గా పిలిచే ఈ పరిణామంతో ఈ వర్షాకాలంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయంటూ జనం చర్చించుకున్నారు. వాతావరణం గురించి తెలియని రోజుల్లో హాలో ఏర్పడితే వచ్చే 24 గంటల్లో వర్షం పడొచ్చని కూడా చెప్పుకొంటున్నారు. 

సన్‌ హాలో అంటే?
సూర్యుడి చుట్టూ వలయం ఏర్పడటాన్ని సన్‌ హాలో లేదా ‘22 డిగ్రీ హాలో’అని పిలుస్తారు. వాతావరణంలో ఉండే లక్షలాది షట్భుజాకారపు మంచు స్ఫటికాల గుండా కాంతి ప్రయాణించినప్పుడు వక్రీభవనం చెందడం వల్ల ఈ వలయాలు ఏర్పడతాయి. సూర్యుడి చుట్టూ దాదాపు 22 డిగ్రీల వ్యాసార్థంతో వలయం ఏర్పడుతుంది కాబట్టి దీనికి ‘22 డిగ్రీ హాలో’అని పేరు. 

ఎక్కడ ఏర్పడతాయి?
ఆకాశంలో సిర్రస్‌ రకం మేఘాలు ఉన్నప్పు డు సన్‌హాలో ఏర్పడే అవకాశాలు ఎక్కువ. ఈ మేఘాలు పలుచగా, పోగుల్లా ఉంటాయి. వాతావరణంలో దాదాపు 20 వేల అడుగుల ఎత్తులో ఈ మేఘాలు ఉంటాయి. వర్ణ పట్టక ప్రయోగం చిన్నప్పుడు చేసే ఉంటాం. త్రికోణాకారపు గాజు పట్టకం ఒకవైపు నుంచి కాంతి ప్రయాణించినప్పుడు ఇంకోవైపు ఉంచిన తెరపై ఏడు రంగులు కనపడటం గమనిస్తాం. ఇప్పుడు సూర్యుడి కిరణాలు పైనుంచి కిందకు వస్తున్న మార్గంలో సిర్రస్‌ మేఘాలను ఊహించుకోండి. ఆ మేఘాల్లోని ఒక్కో మంచు స్ఫటికం ఒక పట్టకంలా ప్రవర్తిస్తుంది. అంటే పైనుంచి వస్తున్న సూర్యకాంతి ఏడు రంగులుగా విడిపోతుంది. అదే సమయం లో పక్కపక్కన ఉన్న మంచు స్ఫటికాల ద్వారా ఈ కాంతి ప్రతిఫలిస్తుంది. వక్రీభవనం, ప్రతిఫలించడం అన్న రెండు దృగ్విషయాల కారణంగా కాంతి ఒక నిర్దిష్ట దిశలో ప్రయాణించి హాలో ఏర్పడుతుందన్నమాట. 

జాబిల్లి చుట్టూ కూడా.. 
హాలోలు ఏర్పడటం సూర్యుడికి మాత్రమే పరిమితం కాదు. రాత్రివేళల్లో జాబిల్లికీ ఏర్పడుతుంటాయి. వాయు కాలుష్యమో.. లేదా ఇంకో కారణమో స్పష్టంగా తెలియదు కానీ.. ఇటీవల జాబిల్లి చుట్టూ ఏర్పడే హాలోలు చాలా అరుదు. ఇంద్రధనుస్సు మాదిరిగానే హాలోలను కూడా నేరుగా చూడొచ్చు. కొంతవరకు తెల్లగా కనిపించినా తగిన కోణం నుంచి చూసినప్పుడు సప్తవర్ణాలు ఆవిష్కృతం అవుతాయి.  
 

మరిన్ని వార్తలు