Sunday-Funday : ట్యాంక్‌ బండ్‌పై మళ్లీ షురూ కానున్న సందడి

23 Sep, 2021 15:23 IST|Sakshi

ప్రత్యేక ఆకర్షణగా  తెలంగాణా పోలీస్‌ బ్యాండ్

తెలంగాణా జానపద కళల ప్రదర్శన

ఉచితంగా మొక్కల పంపిణీ

సాక్షి, హైదరాబాద్‌:  ట్యాంక్‌ బండ్‌పై ‘సండే-ఫన్‌డే’ సందడి మళ్లీ షురూ కానుంది. గణేష్ విగ్రహ నిమజ్జనం కారణంగా గత వారం నిలిపివేసిన సండే ఫండే  కార్యక్రమం ఈ ఆదివారం (సెప్టెంబరు 26) తిరిగి మొదలు కానుంది. ఇప్పటికే ప్రజాదరణ పొందిన ఈ ఈవెంట్‌ మరింత రంగులమయం అవనుంది. పర్యాటకులను ఆకర్షించేందుకు మరింత  ఆకర్షణగా తీర్చిదిద్దేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు అర్బన్ డెవలప్‌మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్  సోషల్‌ మీడియాలో పలు విషయాలను షేర్‌ చేశారు.

దీని ప్రకారం సెప్టెంబర్ 26, ఆదివారం సాయంత్రం 5 నుంmr రాత్రి 10 గంటల వరకు ట్యాంక్‌బండ్‌ సందర్శకులకు బాణాసంచా ప్రదర్శనతోపాటు తెలంగాణ సాంప్రదాయ జానపద కళల ప్రదర్శన కనులవిందు కానుంది. ముఖ్యంగా తెలంగాణ పోలీస్ బ్యాండ్, ఉత్తమ తెలుగు పాటలను అందించే ఆర్కెస్ట్రా ఉంటాయి. దీంతోపాటు ఒగ్గు డోలు, గుస్సాడి, బోనాలు కోలాటం వంటి జానపద కళల ప్రదర్శనల భారీ సందడి ఉండనుంది. 

అంతేకాదు తినుబండారాలు, చేనేత వస్త్రాలు, హస్తకళ స్టాల్‌లు, ప్రభుత్వం, హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ ద్వారా ఉచితంగా మొక్కలు పంపిణీ కూడా ఉంది. కాగా ట్యాంక్ బండ్ సందర్శకుల కోసం పార్కింగ్ ఏర్పాటు చేయడమే కాకుండా, ట్రాఫిక్ ఆంక్షలను కూడా అమలు చేస్తున్నారు. ఈ సమయంలో కేవలం పర్యాటకులను మాత్రమే అనుమతిస్తారు. వాహనాలకు అనుమతి ఉండదు. అయితే కోవిడ్‌-19 ప్రోటోకాల్‌ను కచ్చితంగా అమలు చేయాలని పలువురు సూచిస్తున్నారు.

ప్రత్యేక ఆకర్షణలు

  • తెలంగాణా పోలీస్ బ్యాండ్
  • ఆర్కెస్ట్రా - తెలుగు పాటలు
  • ఒగ్గు డోలు, గుస్సాడి , బోనాలు కోలాటం
  • బాణాసంచా వెలుగులు
  • తినుబండారాలు
  • చేనేత, హస్తకళల ప్రదర్శన
  • ఉచిత మొక్కలు పంపిణీ.. ఇంకా ఎన్నో
మరిన్ని వార్తలు