కల్లుప్రియుల్లారా లొటలొట తాగేసేయండి

7 Mar, 2021 02:17 IST|Sakshi

లొట్టిలేయాల్సిందే!

‘ట్రెండ్‌’గా మారిన వెంకటాపూర్‌(పీటీ)లోని ఈతవనం

మూడున్నర ఎకరాల్లో రెండు వేల ఈతచెట్ల పెంపకం

అటవీ వాతావరణాన్ని ఎంజాయ్‌ చేస్తున్న పలువురు

హైదరాబాద్, ఇతర ప్రాంతాల నుంచి కల్లుప్రియుల రాక

సాక్షి, మెదక్‌: తూప్రాన్‌-నర్సాపూర్‌ రోడ్డులోని బ్రాహ్మణపల్లి రైల్వేట్రాక్‌ పక్కన మూడున్నర ఎకరాల్లో ఏపుగా పెరిగిన ఈతచెట్ల వనం.. అడవిని తలపిస్తున్నా అక్కడంతా కోలాహలంగా ఉంది. అడపాదడపా కార్లు.. మరెంతోమంది బైక్‌లపై అక్కడికి వచ్చిపోతున్నారు. లోపలికి వెళ్తే.. కొంతమంది ఈతచెట్లపై నుంచి కల్లు తీస్తున్నారు. అక్కడికి వచ్చిన వారు అప్పుడే తీసిన కల్లును ఇష్టంగా తాగుతున్నారు. ఇంకొందరు కల్లు తీసుకుని వెళ్తున్నారు. ఈ ఈతవనం యజమాని లచ్చాగౌడ్‌ది వెంకటాపూర్‌ (పీటీ) గ్రామం. మొదట్లో వ్యవసాయంతోపాటు కల్లు గీసేవాడు. 2007లో కల్లు గీత సొసైటీలో సభ్యత్వం కోసం ప్రయత్నిస్తే.. దొరకలేదు. పిల్లల చదువులు మధ్యలో ఉన్నాయి. ఈ క్రమంలో బ్రాహ్మణపల్లిలో తన మూడున్నర ఎకరాల భూమిలో ఈతమొక్కలు నాటాలని నిర్ణయించాడు. అటవీ శాఖలో పనిచేసే పరిచయస్తుడైన బాలేశ్‌గౌడ్‌ సాయంతో సదాశివపేట, తాండూరు, చేవెళ్ల, మరెన్నో ప్రాంతాలు తిరిగాడు. చివరకు నాటి ఉమ్మడి మెదక్‌ జిల్లాలోని పెద్దాపూర్‌లో ఒక్కోటి రూ.30 చొప్పున.. 2 వేల ఈతమొక్కలు కొన్నాడు. ఒక్కో మొక్కకు ఆరడుగుల దూరం, ఒక్కో వరుస మధ్య పన్నెండు అడుగుల దూరం ఉండేలా నాటాడు. 2012లో కల్లు పారడం మొదలైంది.

ఎందరికో జీ‘వన’ ఉపాధి 
ఈతవనం నాలుగు గీత కార్మిక  కుటుంబాలకు ఉపాధి కల్పిస్తోంది. ఒక్కొక్కరికి నెలకు రూ.12 వేల చొప్పున జీతం ఇస్తుండగా.. రోజుకు రూ.300 కూలీకి మరో ఇద్దరు మహిళలు పనిచేస్తున్నారు. ఖర్చులన్నీ పోను నెలకు రూ.50 వేల వరకు ఆదాయం ఉంటుందని లచ్చాగౌడ్‌ తెలిపారు. లచ్చాగౌడ్‌కు భార్య బాలమణి, నలుగురు కుమారులు. వారూ తండ్రితో పాటు ఈతవనాన్ని చూసుకుంటున్నారు. ఈతవనం చేతికందిన దశలో ఎక్సైజ్‌ అధికారులు, కొందరు స్థానికులు అడ్డుతగిలారు. దీంతో లచ్చాగౌడ్‌ కుమారులు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు ఎక్సైజ్‌ అధికారులు లచ్చాగౌడ్‌తో పాటు కుమారులకు సైతం లైసెన్స్‌ జారీచేశారు.

ఇక్కడి నుంచే ‘ట్రెండ్‌’ మొదలు
ఒకేచోట ఈతవనాలను పెంచడం.. అక్కడే కల్లు అమ్మడం అనే ట్రెండ్‌ బ్రాహ్మణపల్లి నుంచి మొదలుకాగా, రాష్ట్రంలోని పలుచోట్ల ఇటువంటివి ఏర్పాటవుతున్నాయి. మెదక్‌ జిల్లా శివ్వంపేట మండలంలోని పలు గ్రామాల్లో గౌడ కులస్తులే కాకుండా ఇతర వర్గాలు సైతం ఆదాయ మార్గంగా ఈతవనాల పెంపకం చేపట్టాయి. దొంతి, గుండ్లపల్లి, చండి, చిన్నగొట్టుముక్కుల, చెన్నపూర్, నవాబుపేట గ్రామాల్లో వీటి పెంపకం ఊపందుకుంది. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 40 ఎకరాల్లో ఈతచెట్ల పెంపకం సాగుతోంది. చేగుంట మండలం కర్నాల్‌పల్లిలో గౌడ సొసైటీకి చెందిన ఎకరంన్నర స్థలంలో రెండు దఫాలుగా 500 చొప్పున వెయ్యి ఈతచెట్లు పెట్టారు. తొలుత పెట్టిన చెట్లకు కల్లు పారుతోంది. ఏడాదికి పది కుటుంబాల చొప్పున సంరక్షణ, అమ్మకపు బాధ్యతలు తీసుకుంటున్నాయి.

అప్పటికప్పుడు స్వచ్ఛమైన కల్లు
అప్పటికప్పుడు చెట్ల నుంచి తీసిన కల్లు విక్రయించడం, చుట్టూ అడవిలో ఉన్న భావన.. ఇవి కల్లుప్రియుల్ని ఇక్కడకు రప్పిస్తున్నాయి. సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, సిద్దిపేటతోపాటు హైదరాబాద్‌ నుంచి ఇక్కడకు పెద్దసంఖ్యలో వస్తున్నారు. లీటర్‌ కల్లు రూ.50కి విక్రయిస్తున్నారు. ఇక, ఒకే చెట్టుకు కట్టిన లొట్టి నుంచి ఆ సమయానికి ఎంత కల్లు లభిస్తే అంత.. రూ.200 పలుకుతోంది. వీకెండ్‌లో నగరం నుంచి వచ్చే వారితో రద్దీగా ఉంటుంది. ఇక్కడ సీజన్‌తో సంబంధం లేకుండా కల్లు పారుతోంది. ఒక్కో చెట్టు నుంచి రోజుకు 2 నుంచి 5 లీటర్ల కల్లు వస్తోంది. వేసవిలో రోజుకు 300 చొప్పున.. అన్‌సీజన్‌లో 150 చొప్పున చెట్లు గీస్తామని, సీజన్‌లో రోజూ రూ.20 వేల వరకు అమ్మకాలు సాగుతున్నాయని లచ్చాగౌడ్‌ చెబుతున్నారు.
 
తలరాత మార్చుకున్నా.. 
ఈతవనం పెంపును మొదట్లో ఇంటోళ్లు వద్దన్నారు. అయితే, ఈ తరం వాళ్లకు ప్రకృతి వరప్రసాదమైన స్వచ్ఛమైన కల్లు అందించాలనే సంకల్పంతో ఈతవనం పెంచా. అడ్డంకులెదురైనా హైకోర్టు అండగా నిలిచింది. నాకొచ్చిన ఆలోచనతో నా తలరాత మార్చుకున్నా.
- లచ్చాగౌడ్‌

ఎకరంలో ఈతవనం పెట్టా..
ఎకరా పొలంలో మూడేళ్ల క్రితం ఉపాధి హామీ ద్వారా 500 ఈత మొక్కలు నాటాను. ఆరేళ్లకు కల్లు తీసే అవకాశం ఉంటుంది. కులవృత్తిని కాపాడుకోవడానికి ఇదో అవకాశంగా మారింది.
- బాలాగౌడ్, చండి, శివ్వంపేట

మరిన్ని వార్తలు