కాంగ్రెస్‌ నేతలపై ‘కన్ను’గోలు!

12 Jun, 2022 02:52 IST|Sakshi

నేతలవారీగా, నియోజకవర్గాల వారీగా రిపోర్టులు తయారు చేసే పనిలో సునీల్‌ కనుగోలు

రాష్ట్రకాంగ్రెస్‌ నేతల పనితీరుపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్న ఏఐసీసీ

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని ‘హస్త’గతం చేసుకోవడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న కాంగ్రెస్‌ అధిష్ఠానం తెలంగాణ కాంగ్రెస్‌ పరిణామాలపై ప్రత్యేక దృష్టి సారించింది. రాష్ట్రనేతల పనితీరుపై ఎప్పటికప్పుడు నివేది కలు తెప్పించుకుంటోంది. ఇందుకోసం పార్టీ పక్షాన నియ మించిన సునీల్‌ కనుగోలు రిపోర్టులు తయారు చేసే పనిలో బిజీగా ఉన్నారనే చర్చ గాంధీభవన్‌ వర్గాల్లో జరుగుతోంది. ముఖ్యంగా పార్టీ గెలిచే అవకాశాలున్న స్థానాల్లో నేతలు ప్రజల్లో ఏ మేరకు ఉంటున్నారు... పార్టీకి ఇంకా పట్టురావా ల్సిన ప్రాంతాల్లో చేయాల్సిన కార్యక్రమాలు ఏమిటనే అంశా లను ఫోకస్‌ చేస్తూ సునీల్‌ ఈ నివేదికలు తయారు చేసి అధిష్టానానికి పంపిస్తున్నారని సమాచారం. ఈ నివేదికలు ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల ఇన్‌చార్జి కేసీ వేణుగోపాల్‌ ద్వారా అగ్రనేత రాహుల్‌గాంధీ దృష్టికి వెళుతున్నాయని సమాచారం. 

‘రచ్చబండ’పై రోజువారీ నివేదికలు
రాహుల్‌ సమక్షంలో మే ఆరో తేదీన వరంగల్‌ సభలో ప్రకటించిన రైతు డిక్లరేషన్‌ ఏ మేరకు ప్రజ ల్లోకి వెళ్లిందన్న దానిపై వివరాలు సేకరిస్తోంది. ఈ డిక్లరేషన్‌ను రాష్ట్రంలోని 12 ఏళ్ల బాలుడికి కూడా అర్థమయ్యేలా విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాహుల్‌ రాష్ట్ర నేతలను ఇదివరకే ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే నెలరోజులపాటు పల్లెపల్లెకు కాంగ్రెస్‌ పేరుతో రాష్ట్రవ్యాప్తంగా రైతు రచ్చబండ కార్యక్ర మాలను నిర్వహించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలను రైతులకు వివరించడంతో పాటు కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తుందన్న విషయాలను తెలియజేయాలని నిర్ణయించింది.

ఈ కార్యక్రమంపై సునీల్‌ ప్రతిరోజు నియోజకవర్గాలవారీగా వివరాలను ఏఐసీసీకి పంపించారు. ఈ నివేదికలను పరిశీలించిన తర్వాత రైతు రచ్చబండల నిర్వహణపై రాహుల్‌ అసంతృప్తి వ్యక్తం చేశారని, దీంతో ఈ నెల 21తో ముగియాల్సిన ఈ కార్యక్రమాన్ని మరో 15 రోజులు పొడిగించారని తెలిసింది. 

రేవంత్‌ వ్యాఖ్యల్లోని మర్మమూ అదే...
ఏఐసీసీ ఆలోచనలకు అనుగుణంగానే శనివారం గాంధీభవన్‌లో జరిగిన టీపీసీసీ ముఖ్యనేతల సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారనే చర్చ జరుగుతోంది. ‘నాయకులు పనిచేయకపోతే పదవులు రావు. గాంధీభవన్‌ చుట్టూ తిరిగితే పదవులు రావు. గ్రామాల్లో తిరగాలి. ప్రతి గడపా తట్టాలి. పెద్ద నాయకులు బాగా పనిచేస్తుంటే, కాబోయే నేతలు ప్రజల్లో తిరగడంలేదు. ఎప్పటికప్పుడు ఏఐసీసీకి నివేదికలు వెళుతున్నాయి. ప్రజల్లో నిత్యం ఉండే నాయకులకే పదవులు వస్తాయి’అన్న రేవంత్‌ వ్యాఖ్యల వెనుక మర్మం కూడా ఇదేనని తెలుస్తోంది.  

మరిన్ని వార్తలు