రూ.1450 కోట్ల  వ్యయంతో పనులు.. ‘సుంకిశాల’.. చకచకా

18 Jan, 2023 14:28 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మహానగర దాహార్తిని తీరుస్తున్న కృష్ణా మూడు దశల ప్రాజెక్టులకు ఈ ఏడాది చివరి నాటికి పుష్కలంగా తాగునీరు అందుబాటులోకి రానుంది. జలాలను తరలించేందుకు ఉద్దేశించిన సుంకిశాల ఇన్‌టేక్‌వెల్‌ నిర్మాణ పనులు చకచకా జరుగుతున్నాయి. నాగార్జున సాగర్‌ బ్యాక్‌వాటర్‌ సుంకిశాల వద్ద రూ.1470 కోట్ల అంచనా వ్యయంతో జలమండలి ఆధ్వర్యంలో పనులు జరుగుతున్నాయి. ఇప్పటివరకు సుమారు 50 శాతం.. అంటే రూ.760 కోట్ల మేర పనులు పూర్తయినట్లు నిర్మాణ సంస్థ తెలిపింది. ఈ ఏడాది నవంబర్‌– డిసెంబర్‌లోగా పనులు పూర్తి చేస్తామని పేర్కొంది.   

దాహార్తి దూరం..  
►ప్రస్తుతం కృష్ణా మూడు దశల ప్రాజెక్టుల ద్వారా నగరానికి నిత్యం 270 మిలియన్‌ గ్యాలన్ల (16.5 టీఎంసీలు) తాగునీటిని ఎలిమినేటి మాధవరెడ్డి కెనాల్‌ (ఏఎంఆర్‌పీ) నుంచి తరలిస్తున్నారు. ఏటా నాగార్జున సాగర్‌ ప్రాజెక్టులో నీటిమట్టాలు 510 అడుగుల కంటే దిగువనకు పడిపోయినపుడు డ్రెడ్జింగ్‌ ప్రక్రియ ద్వారా డెడ్‌స్టోరేజీ నుంచి  నీటిని తరలించాల్సి వస్తోంది.  

►ఈ నేపథ్యంలోనే ఈ ఇన్‌టేక్‌వెల్‌ను అత్యంత లోతున నిర్మిస్తున్నారు. సుమారు 170 మీటర్ల లోతు, 40 మీటర్ల వెడల్పున ఇన్‌టేక్‌ వెల్‌ను నిర్మిస్తున్నారు. పెరుగుతున్న జనాభా అవసరాల కారణంగా భవిష్యత్‌లో మొత్తంగా 20 టీఎంసీల కృష్ణా జలాలను నగరానికి తరలించేందుకు ఈ వెల్‌ను నిర్మిస్తుండడం విశేషం. మండువేసవిలోనూ ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎండీడీఎల్‌(మినిమం డ్రాయల్‌ డౌన్‌ లెవెల్‌) కంటే దిగువ నుంచి కూడా నీటిని తరలించేందుకు సుంకిశాల ప్రాజెక్టు ఉపయోగపడనుందని జలమండలి వర్గాలు తెలిపాయి.  

ప్రాజెక్టు పురోగతి ఇలా.. 
►అండర్‌ గ్రౌండ్‌ షాఫ్ట్‌ (వెట్‌ వెల్‌ డ్రై వెల్‌): అండర్‌ గ్రౌండ్‌ షాఫ్ట్‌ నిర్మాణం కోసం కీలకమైన రాతి తొలగింపు పనులు పూర్తయ్యాయి.  
►8 మీటర్ల డయా వ్యాసార్థంతో యాక్సెస్‌ టన్నెళ్లు, లింక్‌ టన్నెళ్ల తవ్వకం పనులు కూడా దాదాపు పూర్తి కావచ్చాయి. మొత్తం 1100 రన్నింగ్‌ మీటర్లు (ఆర్‌ఎంటీ)లో 900 ఆర్‌ఎంటీ మేర పనులు పూర్తయ్యాయి.  ఇన్‌ టేక్‌ టన్నెళ్ల తవ్వకం పనులు జరుగుతున్నాయి. 
►ఎలక్ట్రో మెకానికల్‌ ఈక్విప్‌ మెంట్‌: ట్రాన్‌ కో నుంచి ప్రత్యేకంగా హెచ్‌ టీ ఫీడర్‌ మెయిన్‌ తీసుకున్నారు. పంపులు, మోటార్లు, 
ట్రాన్సా్ఫర్మర్, సబ్‌ స్టేషన్, ఇతర సామగ్రి కొనుగోలు ప్రక్రియ జరుగుతోంది. 

పంపింగ్‌ మెయిన్లు: 2375 ఎంఎం డయా ఎంఎస్‌ పైపులైన్‌కు ప్లేట్లు, పైపుల కొనుగోలు, తయారీ జరుగుతోంది. మొత్తం 5 కిలోమీటర్ల పైపులైన్లు  తయారు కాగా, 3 కిలోమీటర్ల మేర పైపులైన్‌ ఏర్పాటు పూర్తయ్యింది. మొత్తం ప్రాజెక్టును 2023 నవంబరు– డిసెంబర్‌ నాటికి పూర్తి చేయనున్నారు.   
 

మరిన్ని వార్తలు