‘సూపర్‌’ వ్యాక్సినేషన్‌ వేగవంతం

11 Jun, 2021 19:46 IST|Sakshi
నారాయణగూడ జైస్వాల్‌లైన్‌లో దుకాణదారుడి వివరాలు నమోదు చేస్తున్న సిబ్బంది

హైదరాబాద్‌: కరోనాను ఎదుర్కొని ఆరోగ్యంగా ఉండేందుకు మనముందు ఉన్న ఏకైక అస్త్రం వ్యాక్సినేషన్‌. ప్రతి ఇంట్లోని ప్రతి సభ్యునికి వ్యాక్సిన్‌ వేయాలనేది ప్రభుత్వం ఆలోచన. ఇందుకోసం  నగరంలోని ప్రతి సర్కిల్‌ వారీగా ఉన్న దుకాణదారులకు వ్యాక్సిన్‌ వేసేందుకు నడుం బిగించింది ‘గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌’ (జీహెచ్‌ఎంసీ). ఇందుకోసం ప్రతి వార్డుకు ఒక్కో శానిటరీ సూపర్‌వైజర్‌లను నియమించారు అధికారులు. సర్కిల్‌–16 అంబర్‌పేట పరిధిలో పదిరోజుల్లో పదివేల మందికి పైగా వ్యాక్సినేషన్‌ పూర్తి చేసిన ఘనతకు ఏఎంఓహెచ్‌ డాక్టర్‌ హేమలత దక్కడం విశేషం.  

రోజుకు వెయ్యిమందికి.. 
కోవీషీల్డ్‌ వ్యాక్సిన్‌ ప్రతి ఒక్కరికీ వేసేందుకు గాను సిద్ధమైన జీహెచ్‌ఎంసీ ఇందుకోసం సర్కిళ్ల వారీగా ఉన్న శానిటేషన్‌ సూపర్‌వైజర్‌లకు బాధ్యతలను అప్పగించింది. దీనిపై ఏఎంఓహెచ్‌లు నిత్యం పర్యక్షణ చేస్తున్నారు. ప్రతిరోజూ ఒక్కో సూపర్‌వైజర్‌ 50 దుకాణదారుల వద్దకు వెళ్లి వ్యాక్సిన్‌ ఎన్‌రోల్‌మెంట్‌ చెయ్యాలి. మరుసటి రోజు ఎన్‌రోల్‌ చేసిన వారందరికీ ఆయా పరిధిలోని వ్యాక్సిన్‌ నేషన్‌ కేంద్రం వద్ద వ్యాక్సిన్‌ వేయించాలి. ఇలా ప్రతిరోజూ దాదాపు వెయ్యి మంది దుకాణదారుల్ని గుర్తిస్తున్నారు. మొదట్లో దుకాణంలో ఉన్న ఒక్కరికే ఎన్‌రోల్‌ చేయగా..తర్వాత నుంచి దుకాణానికి సంబంధించిన సభ్యులకు వ్యాక్సినేషన్‌ వేసేందుకు మార్గాన్ని సుగమనం చేశారు. 

ఇప్పటికే 14వేలకు పైచిలుకు మందికి వ్యాక్సిన్‌ ప్రతిరోజూ ఏఎంఓహెచ్‌ పర్యవేక్షణలో ఎవరు ఎంత మందిని ఎన్‌రోల్‌ చేశారనే లెక్కలను ఉన్నత అధికారులకు పంపుతున్నారు. 

అన్ని వివరాలు నమోదు 
ప్రతి దుకాణదారుడి వద్దకు వెళ్లి వాళ్ల వివరాలను సేకరిస్తున్నాం. మాకు ఇచ్చిన యాప్‌లో వివరాలను నమోదు చేసుకుని మరుసటి రోజు లేదా తర్వాత రోజుకు స్లాట్‌ బుక్‌ చేస్తున్నాం. ఇలా ప్రతిరోజూ 50 దుకాణదారుల కుటుంబాల వివరాలను సేకరిస్తున్నాం. 
–  శ్రీనివాస్, సూపర్‌వైజర్‌ 

అర్హులందరికీ ఇస్తున్నాం.. 
సర్కిల్‌ పరిధిలో ఏ ఒక్క దుకాణదారుడిని వదలట్లేదు. ఒకటికి పదిసార్లు ఆయా దుకాణదారులతో మాట్లాడుతూ..వారికి వ్యాక్సిన్‌ యొక్క ప్రాముఖ్యతను తెలిపే అవగాహన కల్పిస్తున్నాం. ఇప్పటి వరకు 14వేలకు పైగా మంది వ్యాక్సిన్‌ మొదటి డోసు తీసుకున్నారు.  
– డాక్టర్‌ హేమలత, ఏఎంఓహెచ్, సర్కిల్‌–16, అంబర్‌పేట.  

మరిన్ని వార్తలు