Telangana: 41 కిలోమీటర్లు.. డ్రోన్ల ద్వారా టీకాలు..

23 Oct, 2021 04:04 IST|Sakshi

వికారాబాద్‌లో విజయవంతమైన ‘మెడిసిన్స్‌ ఫ్రం స్కై’ 

తొలిసారిగా అత్యధిక దూరం డ్రోన్ల ద్వారా మందుల రవాణా 

16 కిలోల బరువున్న మందులు, రక్తపు ప్యాకెట్లు సరఫరా 

మారుత్‌ డ్రోన్స్‌ సంస్థ ఆధ్వర్యంలో ప్రయోగం 

సాక్షి, హైదరాబాద్‌: డ్రోన్ల ద్వారా వ్యాక్సిన్లను సరఫరా చేసేందుకు ఉద్దేశించిన ‘మెడిసిన్స్‌ ఫ్రం స్కై’ప్రాజెక్టును వికారాబాద్‌ జిల్లాలో విజయవంతంగా పరీక్షించారు. దేశంలోనే తొలిసారిగా ఏకంగా 41 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతానికి కోవిడ్‌ టీకాలు, మందులను రవాణా చేశారు. వికారాబాద్‌లోని న్యూ ఏరియా ఆస్పత్రి నుంచి బొంరాస్‌పేట ప్రాథమిక వైద్య కేంద్రానికి (పీహెచ్‌సీ) డ్రోన్‌ ద్వారా పది సార్లు మందులను రవాణా చేశారు. ఈ రెండు ప్రాంతాల మధ్య 41 కిలోమీటర్లు ఉంటుంది. రోడ్డు మార్గాన వెళ్తే దాదాపు గంటా 25 నిమిషాల సమయం పడుతుంది.

కానీ డ్రోన్‌ ద్వారా కేవలం 32 నిమిషాల్లోనే చేరుకుంది. 30 కిలోల బరువున్న ఈ డ్రోన్‌ 16 కిలోల బరువున్న మందులను మోసుకుంటూ వెళ్లింది. ‘మెడిసిన్స్‌ ఫ్రం స్కై’ప్రాజెక్ట్‌లో భాగంగా శుక్రవారం మారుత్‌ డ్రోన్స్‌ టెక్‌ పైవేట్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో ఈ ప్రయోగం జరిగింది. ఒక్కో డ్రోన్‌ ద్వారా నాలుగు బాక్స్‌లను (ఒక్కో బాక్స్‌లో 10 యూనిట్ల రక్తం, 500 టీకా డోసులు) పంపించొచ్చు. అంటే ఒక్కో డ్రోన్‌ ఫ్లయిట్‌ ద్వారా రెండు నుంచి 3 వేల వ్యాక్సిన్‌ డోసులను పంపించవచ్చు. గతంలో 3 నుంచి 6 కి.మీ. దూరం లోపు మందులు, టీకాలు పంపే ప్రయోగాలు జరిపారు. 

తొలిసారి డ్రోన్ల ద్వారా సీడ్‌ బాల్స్‌  
గత సెప్టెంబర్‌లో అడవుల పునరుద్ధరణలో భాగంగా దేశంలోనే తొలిసారిగా కామారెడ్డి జిల్లాలోని అటవీ ప్రాంతంలో సీడ్‌ కాప్టర్‌ డ్రోన్ల సాయంతో విత్తనబంతులను వెదజల్లారు. ఆ తర్వాత 3 నుంచి 6 కి.మీ దూరానికి డ్రోన్ల ద్వారా టీకాలు, అత్యవసర ఔషధాలు, ఇంజెక్షన్లను విజయవంతంగా రవాణా చేశారు. తాజాగా డ్రోన్ల ద్వారా పంపిన మందుల వివరాలను అపోలో ఆస్పత్రి ఆధ్వర్యంలో రికార్డు చేశారు. డ్రోన్ల ద్వారా మందులను చేరవేసే సందర్భంలో టీకాలు ఉంచిన కంటైనర్ల ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయా? ఔషధాలపై ప్రభా వం పడుతోందా అన్న అంశాలను పరిశీలించారు.

నవంబర్‌ 8న గువాహటిలో.. 
నవంబర్‌ 8న అస్సాం రాజధాని గువా హటిలో కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సమక్షంలో గువాహటి నుంచి రోడ్డు మార్గం సరిగా లేని 40 కి.మీ దూరంలో ఉన్న ప్రాంతాలకు కరోనా టీకాలు రవాణా చేస్తాం. పర్వతాలు, లోయలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలపై అస్సాం, అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ తదితర ఈశాన్య రాష్ట్రాలతో మారుత్‌ డ్రోన్స్, పబ్లిక్‌హెల్త్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా, వరల్డ్‌ ఎకనమిక్‌ ఫోరం ప్రతినిధి బృందాలు చర్చలు జరిపాయి. గుజరాత్, జార్ఖండ్, కర్ణాటక, మిజోరం రాష్ట్రాలతోనూ వర్చువల్‌ సమావేశం నిర్వహించాం.
– ప్రేమ్‌కుమార్‌ విస్లావత్, మారుత్‌డ్రోన్స్‌ ఫౌండర్‌  

మరిన్ని వార్తలు