TS: పెండింగ్ బిల్లుల అంశం.. సుప్రీంకోర్టులో విచారణ వాయిదా

10 Apr, 2023 16:20 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: పెండింగ్ బిల్లుల విషయంపై తెలంగాణ ప్రభుత్వానికి, గవర్నర్‌కు మధ్య కొద్ది రోజులుగా విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఈ విషయంపై తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో, అత్యున్నత న్యాయస్థానం సోమవారం విచారణ చేపట్టింది. 

ఈ సందర్బంగా సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా సుప్రీంకోర్టుకు నివేదిక అందజేశారు. ఈ క్రమంలో ఇప్పటికే మూడు బిల్లులకు ఆమోదం తెలిపారని గవర్నర్‌ తరఫు న్యాయవాది తెలిపారు. పంచాయతీరాజ్‌ సవరణ బిల్లు, ఆజామాబాద్‌ మిల్లు బిల్లు, మెడికల్‌ బిల్లులపై వివరణ కోరారని గవర్నర్‌ తరఫు న్యాయవాది స్పష్టం చేశారు. ఇక, ఇదే సమయంలో గవర్నర్‌ వద్ద 10 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని తెలంగాణ ప్రభుత్వం నివేదికలో పేర్కొంది. విషయ తీవ్రత, ప్రాధాన్యత దృష్ట్యా విధిలేకనే కోర్టును ఆ‍శ్రయించినట్టు ప్రభుత్వం తెలిపింది. కాగా, వాదనల అనంతరం.. తదుపరి విచారణను రెండు వారాలకు కోర్టు వాయిదా వేసింది.   

ఇదిలా ఉండగా, చట్ట సభలు ఆమోదించిన బిల్లులకు గవర్నర్ ఆమోదముద్ర వేసేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రతివాదులుగా గవర్నర్ కార్యదర్శి, కేంద్ర న్యాయశాఖ కార్యదర్శిలను పేర్కొన్నారు. బిల్లుల ఆమోదాన్ని ఆలస్యం చేయడం ప్రజాస్వామ స్ఫూర్తి, ప్రజల ఆకాంక్షకు విరుద్ధమని తెలంగాణ ప్రభుత్వం పిటిషన్‌లో పేర్కొంది. ఇప్పటికే పెండింగ్ బిల్లుల ఆమోదంపై గవర్నర్ కార్యదర్శితో అడిషనల్ సోలిసిటరి జనరల్ చర్చించారు. రాజ్యాంగంలోని  ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్ బిల్లును ఆమోదించడం లేదా రాష్ట్రపతి పరిశీలనకు పంపాలని తెలంగాణ ప్రభుత్వం పిటిషన్‌లో పేర్కొంది. అయితే సుప్రీంకోర్టులో ఈ విషయంపై విచారణ జరగడానికి కొన్ని గంటలముందే రాష్ట్రపతి వీటిపై నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మొత్తం పది బిల్లులకూ గాను మూడింటికి మాత్రమే ఆమె ఆమోద ముద్ర వేయడం మరోసారి చర్చనీయాంశమైంది.
 

మరిన్ని వార్తలు