నైతికతతో కూడిన విద్యా విధానం అవసరం: సుప్రీం సీజే డీవై చంద్రచూడ్‌ 

26 Feb, 2023 03:59 IST|Sakshi

సానుభూతి, నైతికతతో కూడిన విద్యా విధానం అవసరం: సుప్రీం సీజే డీవై చంద్రచూడ్‌ 

దళిత, ఆదివాసీ విద్యార్థుల ఆత్మహత్యలు కలచివేశాయి 

ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల మార్కులు, ఆంగ్ల ప్రావీణ్యాన్ని అపహాస్యం చేయడం సరికాదు 

ఆంగ్లం రాని వారిని అంటరాని వారిగా చూడకూడదు 

 ఉన్నత–నిమ్న, ధనిక–పేద అనే తేడాలు చూపకూడదు 

మార్కులు, ర్యాంకుల ఒత్తిడితో కూడిన విద్య మంచిది కాదు

సామాజిక మార్పు కోసం న్యాయమూర్తులు కూడా కృషి చేయాలి 

 నల్సార్‌ వర్సిటీ స్నాతకోత్సవంలో సీజేఐ సూచన 

 కార్యక్రమంలో పాల్గొన్న హైకోర్టు సీజే, సుప్రీం, హైకోర్టు న్యాయమూర్తులు 

 ‘‘ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల మార్కులను, ఆంగ్ల ప్రావీణ్యాన్ని అపహాస్యం చేయడం వంటి ఘటనలు ఉన్నత విద్యా సంస్థల్లో కొనసాగుతున్నాయి. ఆంగ్లం రాని వారిని అంటరానివారిగా వివక్షతో చూడటం, అసమర్థులుగా ముద్ర వేయడం వంటి విధానాలకు స్వస్తి పలకాలి. ఇలాంటివాటి వల్ల అణగారిన వర్గాల విద్యార్థుల ఆత్మహత్యల ఘటనలు పెరుగుతున్నాయి. ఈ బలవన్మరణాల్లో గ్రామీణ ప్రాంతాల వారు, ముఖ్యంగా దళిత, ఆదివాసీ వర్గాల విద్యార్థులే ఎక్కువని పరిశీలనల్లో తేలింది. గ్రామీణ ప్రాంతాల నుంచి వచి్చన వారిలో ఒత్తిడిని దూరం చేసి, సానుభూతితో వ్యవహరిస్తే.. ఇలాంటి ఘటనలు జరగకుండా వ్యవహరించవచ్చు.

ఎదుటివారిని అర్థం చేసుకునే విధానంతో కూడిన విద్యను ఉన్నత విద్యాసంస్థల్లో అందించడం అవసరం’’ అని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్‌ ధనుంజయ వై.చంద్రచూడ్‌ వ్యాఖ్యానించారు. సుప్రీం చీఫ్‌ జస్టిస్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రానికి తొలిసారి వచ‍్చిన జస్టిస్‌ చంద్రచూడ్‌ శనివారం నల్సార్‌ యూనివర్సిటీ 19వ స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

హైకోర్టు చీఫ్‌ జస్టిస్, నల్సార్‌ వర్సిటీ చాన్సలర్‌ జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో.. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ వి.రామసుబ్రమణ్యన్, జస్టిస్‌ పీఎస్‌ నరసింహతోపాటు పలువురు హైకోర్టు న్యాయమూర్తులు పాల్గొన్నారు. ముందుగా వర్సిటీ సంప్రదాయం ప్రకారం స్నాతకోత్సవ ఊరేగింపుతో రిజిస్టార్‌ కె.విద్యుల్లతారెడ్డి సీజేఐకి స్వాగతం పలికారు. వర్సిటీ వైస్‌ చాన్సలర్‌ ప్రొఫెసర్‌ శ్రీకృష్ణదేవరావు స్వాగతోపన్యాసం చేశారు. అనంతరం సీజేసీ ప్రసంగించారు.

వివరాలు ఆయన మాటల్లోనే.. 
‘‘తమకు చదువు చెప్పినవారినే కాదు.. చదువుకున్న సంస్థ అభివృద్ధికి పాటుపడిన సిబ్బంది, కార్మికుల శ్రమను కూడా విద్యార్థులు గుర్తించాలి. న్యాయశాస్త్ర విద్యార్థులు.. లా సబ్జెక్టులతోపాటు సాహిత్యం తదితర అంశాలపైనా అవగాహన పెంపొందించుకోవాలి. నేను చదువుకున్న రోజులతో పోలిస్తే ప్రస్తుత తరం విద్యార్థులకు సమాచారం, విజ్ఞానం పొందేందుకు అవకాశాలు చాలా విస్తృతంగా ఉన్నాయి. విద్యార్థులకు ఉన్నత విద్య అభ్యసించడమే కాదు. సమాజంపై బాధ్యత కూడా ఉంటుంది. 
సానుభూతి దయాగుణం అవసరం 
ఉన్నత–నిమ్న, ధనిక–పేద అనే తేడా లేకుండా అందరినీ న్యాయస్థానాలు సమానంగా చూస్తాయి. ఇదే విధానాన్ని అన్నింటా పాటించాలి. చట్టం అమలు, న్యాయం అందించడంలో సానుభూతి, దయాగుణం, తాతి్వకత అనేది చాలా ముఖ్యమైన అంశం. ఇది అన్యాయమైన స్థితి నుంచి న్యాయమైన సమాజ నిర్మాణానికి బాటలు వేస్తుంది. పెద్ద సంఖ్యలో మోటార్‌ ప్రమాద కేసులను పరిష్కరించేటప్పుడు సాంకేతిక అంశాలతో మానవీయ కోణాన్ని సమతూకం వేస్తూ సుప్రీంకోర్టు ఎన్నో తీర్పులు ఇచ్చింది. 

ఒత్తిడితో కూడిన విద్య మంచిది కాదు 
మనం విద్యను కూడా సానుభూతి కోణం నుంచే చూడాలి. చదువులో, వృత్తిలో రాణిస్తేనే మన జీవితాలు మెరుగ్గా ఉంటాయని విద్యా సంస్థల్లో మెదళ్లకు ఎక్కిస్తున్నారు. అలాగే విద్యార్థుల మధ్య తీవ్ర పోటీతత్వం, మార్కులు, ర్యాంకుల ఆధారిత విద్య వారిని మరింత ఒత్తిడికి గురిచేస్తుంది. పట్టణాలు, గ్రామాల్లోని విద్యార్థుల సామర్థ్యం ఒకేలా ఉండదన్న విషయం గ్రహించాలి. విద్య నేర్పడంలోనూ సానుభూతి, కరుణ, స్నేహభావం ఉన్నప్పుడే అది సంపూర్ణమవుతుంది. నైతికతతో కూడిన విద్యా విధానం అవసరం. ఆ మేరకు ప్రమాణాలు మారాలి. ఒత్తిడికి సంబంధించిన విద్యా విధానం మంచిది కాదు. 75 ఏళ్ల స్వాతంత్య్రంలో ఎన్నో ప్రముఖ విద్యాసంస్థలను ఏర్పాటు చేసుకున్నాం. కానీ ఎదుటి వారికి సాయం చేయాలనే దృక్పథంతో కూడిన విద్యా విధానం లేకపోవడం గమనించాల్సిన విషయం. న్యాయవిద్యలోనూ క్లినికల్‌ విధానం అవసరం. విద్యా సంస్థలు, బార్‌ కౌన్సిల్‌ దీని కోసం ప్రయత్నించాలి. 
ఆ ఆత్మహత్యలు కలచివేశాయి 
ముంబై ఐఐటీలో దళిత విద్యారి్థ, ఒడిశా న్యాయ విశ్వవిద్యాలయంలో ఆదివాసీ విద్యార్థుల ఆత్మహత్యలు కలిచివేశాయి. అట్టడుగు వర్గాలకు చెందిన విద్యార్థుల ఆత్మహత్యల ఘటనలపై ఆందోళన వ్యక్తం చేస్తూనే.. సామాజిక మార్పు కోసం సమాజంతో చర్చలు జరపడంలో న్యాయమూర్తులు కీలకపాత్ర పోషించాలి. న్యాయ, పరిపాలన వివాదాల పరిష్కారంతోపాటు సమాజం ఎదుర్కొంటున్న నిర్మాణాత్మక సమస్యలను పరిష్కరించేందుకు కూడా సుప్రీంకోర్టు ప్రయత‍్నిస్తోంది. సీజేఐగా విద్యార్థులు చదువుకునేందుకు ఆరు దశాబ్దాలకు సంబంధించిన తీర్పులన్నింటినీ అందుబాటులో ఉంచాం. ఆటో ఇంటెలిజెన్స్‌ ద్వారా కోర్టు విచారణను రికార్డు చేస్తున్నాం. దీంతో విద్యార్థులు విచారణ తీరును తెలుసుకోవచ్చు’’ అని జస్టిస్‌ చంద్రచూడ్‌ వివరించారు. ఈ కార్యక్రమంలో నల్సార్‌ యూనివర్సిటీ వ్యవస్థాపక వైస్‌ చాన్సలర్‌ రణబీర్‌ సింగ్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు జస్టిస్‌ ఎస్‌ఎస్‌ఎం ఖాద్రీ, జస్టిస్‌ పీవీ రెడ్డి, రాష్ట్ర అడ్వొకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్, హెచ్‌సీఏఏ చైర్మన్‌ రఘునాథ్, కార్యదర్శులు మల్లారెడ్డి, నరేందర్‌ తదితరులు పాల్గొన్నారు. స్నాతకోత్సవం సందర్భంగా పీహెచ్‌డీ (బ్లాక్‌ గౌన్‌–రెడ్‌క్యాప్‌), ఎల్‌ఎల్‌ఎం (బ్లాక్‌ గౌన్‌–ఎల్లో క్యాప్‌), ఎంబీఏ (బ్లాక్‌ గౌన్‌–ఎల్లో క్యాప్‌), బీఏ ఎల్‌ఎల్‌బీ (ఆనర్స్‌) (బ్లాక్‌ గౌన్‌–మెరున్‌ క్యాప్‌)తో పాటు పలు విభాగాల విద్యార్థులకు డిగ్రీ పట్టాలను ప్రదానం చేశారు. 
 
ఆ ఇద్దరికి పతకాల పంట.. 
 నల్సార్‌ స్నాతకోత్సవంలో బీఏ ఎల్‌ఎల్‌బీ (ఆనర్స్‌) విద్యార్థి తన్వీ ఆప్టేకు ఏకంగా పదకొండు పసిడి పతకాలు లభించాయి. మరో రెండు పసిడి పతకాలను ఉమ్మడిగా పొందారు. ‘‘ఇన్ని గోల్డ్‌ మెడల్స్‌ రావడం చాలా ఆనందంగా ఉంది. నా తల్లిదండ్రుల కృషి మూలంగానే నేను ఈ పతకాలు సాధించగలిగాను. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా’’ అని తన్వీ పేర్కొన్నారు. ఇక బీఏ ఎల్‌ఎల్‌బీ (ఆనర్స్‌) విద్యార్థి మంజరి సింగ్‌కు 10 పసిడి పతకాలు లభించాయి. మొత్తంగా స్నాతకోత్సవంలో 58 గోల్డ్‌ మెడల్స్‌ పంపిణీ చేశారు.   

మరిన్ని వార్తలు