మంత్రి కొప్పుల పిటిషన్‌ కొట్టివేత

18 Aug, 2022 00:23 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ధర్మపురి శాసనసభ ఎన్నికకు సంబంధించి తెలంగాణ హైకోర్టు తీర్పు సవాల్‌ చేస్తూ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. మంత్రి ఈశ్వర్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను బుధవారం జస్టిస్‌ సంజయ్‌కిషన్‌ కౌల్, జస్టిస్‌ ఎం.ఎం.సుందరేశ్‌లతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈశ్వర్‌ తరఫు న్యాయ వాదుల వాదనతో ఏకీభవించని ధర్మాసనం పిటిషన్‌ ఉపసంహరణకు అనుమతి ఇస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది.

2018లో ధర్మపురి ఎన్నికల ఓట్ల లెక్కింపు సమయంలో వీవీ ప్యాట్‌లు లెక్కించకుండానే కొప్పుల ఈశ్వర్‌ గెలిచినట్లు ప్రకటించడం ప్రజా ప్రాతినిధ్య చట్టానికి వ్యతిరేకమంటూ కాంగ్రెస్‌ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ తెలంగాణ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను కొట్టివేయాలన్న ఈశ్వర్‌ అభ్యర్థనను తెలంగాణ హైకోర్టు జూన్‌ 28, 2022న కొట్టివేసింది.

హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలంటూ ఈశ్వర్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించగా తెలంగాణ మంత్రికి నిరాశ మిగిలింది. సుప్రీంకోర్టు తీర్పుపై అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ హర్షం వ్యక్తం చేశారు. కేబినెట్‌ హోదా మంత్రికి ప్రజలపై బాధ్యత ఉండాలని లక్ష్మణ్‌ తెలిపారు. కొప్పుల ఈశ్వర్‌కు మంత్రి పదవి అనుభవించే హక్కు లేదని.. వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.  

మరిన్ని వార్తలు