మహిళలు అన్ని రంగాల్లో ఎదగాలి 

11 Dec, 2022 01:53 IST|Sakshi
సదస్సులో జస్టిస్‌ హిమాకోహ్లి 

సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్‌ హిమా కోహ్లి 

మాదాపూర్‌: మహిళలు అన్ని రంగాల్లో పురోగమించాలని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ హిమాకోహ్లి పిలుపునిచ్చారు. మాదాపూర్‌లోని మెడికవర్‌ ఆసుపత్రిలో ఇంటర్నేషనల్‌ ఆర్బిట్రేషన్, మీడియేషన్‌ సెంటర్‌ సంయుక్త ఆధ్వర్యంలో శనివారం మెడికవర్‌ హాస్పిటల్స్‌ సహకారంతో ’సాధికారత– తెలంగాణ మహిళ’’అనే అంశంపై అవగాహన సదస్సును నిర్వహించారు. మహిళల సాధికారత ఆవశ్యకత, వాళ్లు ఎదుర్కొంటున్న సవాళ్ళపై చర్చ సాగింది.

ఈ సందర్భంగా అభివృద్ధి పథంలో దూసుకువెళ్లి ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్న 11మంది తెలంగాణ మహిళలను జస్టిస్‌ హిమాకోహ్లి సత్కరించారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి సర్పంచ్‌ భాగ్యభిక్షపతి, ముఖరా(కె) సర్పంచ్‌ గాడ్గే మీనాక్షి, సర్పంచ్‌ మొండి భాగ్యలక్ష్మితోపాటు మాదాపూర్‌ డీసీపీ కె. శిల్పవల్లి, రక్షణ మంత్రిత్వ శాఖ మాజీ డిప్యూటీ డైరెక్టర్‌ మల్లవరపు బాలలత, సెర్ప్‌ నుంచి ఎస్‌ కృష్ణవేణి, బుర్రి మంజుల, మారు సత్తవ్వ, ఉద్యానవన శాఖ నుంచి ఎస్‌. విజయలక్ష్మి, మంగళంపల్లి నీలిమ, యట్ల వెంకమ్మను ఘనంగా సన్మానించారు.

రిటైర్డ్‌ ఐపీఎస్‌ జీ మమతాశర్మ, ఐపీఎస్‌ అధికారి పద్మజ, జీవన్‌దాన్‌ హెడ్‌ డాక్టర్‌ స్వర్ణలత, వీహబ్‌ సీఈవో దీప్తిరావుతో సహా సదస్సుకు 90 మంది వివిధ సంస్థల పత్రినిథులైన మహిళలు, న్యాయవాదులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు