పూజలు చేసి..ప్రతి శిల్పమూ చూసి..

19 Dec, 2021 03:38 IST|Sakshi
రామప్ప ఆలయం వద్ద తన సతీమణికి పూలదండ వేస్తున్న సీజేఐ ఎన్వీ రమణ 

రామప్ప కళాసంపదకు సీజేఐ ఫిదా

వెంకటాపురం(ఎం): రామప్ప కళాసంపదకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ ఫిదా అయ్యారు. ఆలయంలో శిల్పాల సౌందర్యాన్ని చూసి మంత్రముగ్ధులయ్యారు. ములుగు జిల్లా వెంకటాపురం(ఎం) మండలంలో యునెస్కో గుర్తింపు పొందిన ప్రఖ్యాత రామప్ప దేవాలయాన్ని శనివారం సాయంత్రం ఆయన కుటుంబసమేతంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారులు హరీశ్‌శర్మ, ఉమాశంకర్‌లు పూర్ణకుంభంతో భారత ప్రధాన న్యాయమూర్తికి స్వాగతం పలికి ఆలయంలోకి ఆహ్వానించారు.

రామప్ప రామలింగేశ్వరస్వామికి జస్టిస్‌ రమణ దంపతులతోపాటు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సతీష్‌ చంద్ర శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం టూరిజం గైడ్‌ విజయ్‌కుమార్, ఇంటాక్‌ కన్వీనర్‌ పాండురంగారావులు ఆలయ చరిత్ర, శిల్పాకళా విశిష్టతను వివరించారు. గర్భగుడి ముందు ఉన్న సప్తస్వరాలు పలికే పొన్నచెట్టు శిల్పాన్ని సుప్రీం చీఫ్‌ జస్టిస్‌ స్వయంగా మీటారు. ఒకే శిల్పంలో వివిధ చోట్ల వేర్వేరు శబ్దాలు వస్తాయని గైడ్‌ వివరించారు.

రామప్ప ఆలయాన్ని శాండ్‌ బాక్స్‌ టెక్నాలజీతో నిర్మించారని, అదే తరహాలో ప్రస్తుతం అయోధ్యలో రామమందిరాన్ని నిర్మిస్తున్నారని ప్రొఫెసర్‌ పాండురంగారావు వెల్లడించారు. ఆలయంలో గంటా ఇరవై నిమిషాల పాటు సాగిన పర్యటనలో ప్రతి శిల్పం గురించి జస్టిస్‌ ఎన్వీ రమణ అడిగి తెలుసుకున్నారు. సాయంత్రం 6.30 గంటల తరువాత ఆయన హనుమకొండకు బయలుదేరారు.

ఆయన వెంట ఉమ్మడి వరంగల్‌ జిల్లా ప్రధాన జడ్జి నరసింగరావు, అదనపు జడ్జి అనిల్‌కుమార్, ములుగు సివిల్‌ జడ్జి రాంచందర్‌రావు, జిల్లా న్యాయసేవా సంస్థ చైర్మన్‌ మహేశ్‌నాథ్, జిల్లా కలెక్టర్‌ కృష్ణ ఆదిత్య, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్, ఎంపీ మాలోతు కవిత, ఎమ్మెల్యే సీతక్క, రాష్ట్ర జల వనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్‌ వీరమల్ల ప్రకాశ్‌రావు ఉన్నారు.

రాత్రి వరంగల్‌లోని నిట్‌లో సీజేఐ రమణ బస చేశారు. ఆదివారం ఆయన భద్రకాళి అమ్మవారిని దర్శించుకుంటారు. అనంతరం జిల్లా కోర్టు ప్రాంగణంలో కొత్తగా నిర్మించిన భవన సముదాయ ప్రారంభోత్సవంలో పాల్గొంటారు.  

మరిన్ని వార్తలు