ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. జోక్యం చేసుకునేందుకు సుప్రీం విముఖత

21 Nov, 2022 13:17 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కొనుగోలు కేసులో జోక్యం చేసుకునేందుకు సుప్రీంకోర్టు విముఖత వ్యక్తం చేసింది. రిమాండ్‌ను సవాల్‌ చేస్తూ ముగ్గురు నిందితులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై జస్టిస్‌ బీఆర్‌ గవాయి, జస్టిస్‌ విక్రమ్‌నాథ్‌తో కూడా ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. నిందితుల తరపు న్యాయవాది తన్మయ్​ మెహతా వాదించగా.. తెలంగాణ ప్రభుత్వం తరుపున సీనియర్​ న్యాయవాది దుష్యంత్​ దవే, సిద్ధార్థ్​ లూత్రా వాదనలు వినిపించారు.

ఈ మేరకు రామచంద్రబారతి సహా ముగ్గురు నిందితుల పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. విచారణ దశలో ఈ అంశంలో తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. రెగ్యులర్‌ బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించే హక్కు పిటిషనర్‌కు ఉందని కోర్టు సూచించింది. హైకోర్టు బెయిల్‌ ఇస్తుంది కదా అని వ్యాఖ్యానించింది.

అదే సమయంలో రిమాండ్‌ విషయంలో హైకోర్టు తీర్పును అత్యున్నత ధర్మాసనం తప్పుపట్టింది. హైకోర్టు సింగిల్ జడ్జి ఉత్తర్వులు సమర్థనీయం కాదని వెల్లడించింది. సింగిల్ జడ్జి వ్యాఖ్యలు ఆక్షేపణీయమని, తీర్పులో ప్రస్తావించిన అంశాలు సమంజసమైనవి కావని తెలిపింది. అరుణేశ్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలను హైకోర్టు తప్పుగా తీసుకుందని అభిప్రాయపడింది.

ముమ్మరంగా విచారణ
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్‌ విచారణ వేగవంతంగా కొనసాగుతోంది. బండి సంజయ్‌ అనుచరుడు అడ్వకేట్‌ శ్రీనివాస్‌ సోమవారం సిట్‌ విచారణకు హజరయ్యారు. నిందితులకు విమాన టికెట్లు బుక్‌ చేశారని శ్రీనివాస్‌పై అరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ చేతిలో కీలక ఆధారాలు సేకరించింది. అక్టోబర్‌ 26న తిరుపతి నుంచి హైదరాబాద్‌కు సింహయజులు స్వామికి  శ్రీనివాస్ టికెట్ బుక్  చేసినట్టు  సిట్ గుర్తించింది. ఈ మేరకు శ్రీనివాస్‌కు సంబంధించిన లావాదేవీలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఫోన్‌ కాల్‌ లిస్ట్‌ వివరాలు ముందుంచి శ్రీనివాస్‌ను సిట్‌ అధికారులు ప్రశ్నించారు.
చదవండి: ఎమ్మెల్యేలకు ఎర కేసు.... ఇప్పట్లో సిట్‌ ఎదుట సంతోష్‌ హాజరు లేనట్టే!

మరిన్ని వార్తలు